పురుషులను మానసికంగా ఎక్కువ ఇబ్బంది పెట్టే సెక్స్ సమస్యల్లో అంగస్థంభన ఒకటి. సరైన అంగస్థంభన లేకపోవడం ఒక సమస్య. వాంఛ ఉంటుంది. భాగస్వామితో కలిసి సెక్స్ ఆనందించాలన్న కోరికలో లోపం ఉండదు. కానీ క్రీడించేదగ్గరకు వచ్చేసరికి పురుషాంగం తగినంత గట్టిపడకపోవడం జరుగుతుంది. ఫలితంగా కలయిక ఇరువురికీ తీవ్రమైన అసంతృప్తికి దారి తీస్తుంది. ఈ సమస్యకు చాలా కారణాలు ఉంటాయి. వాటిలో మధుమేహం ఒకటి.
మధుమేహం ఉన్నవారిలో 50 శాతం మందికి స్ధంభన సమస్య వస్తుంది. మధుమేహం కారణంగా శరీరంలో రక్తనాళాలు కుచించుకుపోతున్నాయని కూడా దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఈ కారణంగా గుండె జబ్బుల వంటి ఇతరత్రా సమస్యలు వచ్చాయేమో కూడా చూసుకుని జాగ్రత్తపడాల్సి ఉంటుంది.
నాడీ వ్యవస్థలో లోపాలు, గుండె జబ్బులు, రక్తపోటు, రక్తనాళాల వ్యాధి, డిప్రెషన్, కొన్ని రకాల మందుల వాడకం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వంటి రకరకాల కారణాలతో స్థంభన సమస్య తలెత్తవచ్చు. ఈ సమస్యను బాహాటంగా చర్చించడానికి భారత సమాజంలో సంకోచిస్తారు. ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసుకుని పరిష్కరించుకోకుండా సమస్యను దాచిపెట్టుకోవడం వల్ల మానసికంగా కుంగుబాటు మొదలవుతుంది. కాబట్టి జంకకుండా వైద్యుడితో పంచుకోవాల్సిన సమస్య ఇది. స్థంభన సమస్య నిజానికి ప్రత్యేకంగా జబ్బు కాదు. అయితే శరీరంలో మరేదన్నా జబ్బు ఉందేమో చూసుకోండని హెచ్చరించే లక్షణం ఇది.
మధుమేహం, రక్తపోటు కారణంగా స్థంభన సమస్య తలెత్తినపుడు రక్తపోటును, రక్తంలో చక్కెర స్థాయిని, లిపిడ్స్ స్థాయిని అదుపులో ఉంచడం కోసం వైద్యులు చికిత్స చేస్తారు. వైద్యులు చేసే సహాయానికి అదనంగా మనం పాటించాల్సినవేమన్నా ఉన్నాయా?
ఉన్నాయి. శారీరక శ్రమను పెంచాలి. క్రమం తప్పకుండా నడక వంటి వ్యాయామం చేయాలి. యోగా, శ్వాస ఎక్సర్సైజులు చేస్తే మంచిది. ఎక్కువ బరువు ఉంటే తగ్గించాలి. పొగ తాగే అలవాటు ఉంటే మానాలి. ఆల్కహాలు సేవించే అలవాటు ఉంటే తగ్గించాలి. మానితే ఇంకా మంచిది. మానసికంగా వత్తిడి లేని లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.