CBSE Class 12 Exams: దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఏపి సీఎం వైఎస్ జగన్ కు షాక్ ఇచ్చినట్లు అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు చేసిన దరిమిళా పలు రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు పదవ తరగతి పరీక్షలను రద్దు చేశాయి. ఏపిలోనూ టెన్త్ పరీక్షలు రద్దు చేయాలన్న డిమాండ్ ప్రతిపక్షాల నుండి, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుండి వచ్చాయి. అయితే విద్యార్థుల భవిష్యత్తు కోసం పరీక్షలు రద్దు చేసే ఆలోచన లేదని జగన్మోహనరెడ్డి సర్కార్ స్పష్టం చేసింది. తొలుత షెడ్యుల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం కరోనా కేసులు పెరుగుతుండటం, లాక్ డౌన్ అమలు నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. విద్యార్థులు పరీక్షలకు సంసిద్ధం కావాలని, పరిస్థితులు మెరుగుపడిన తరువాత పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలియజేసింది.

ఏపి ప్రభుత్వ వైఖరి ఈ విధంగా ఉండగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు జరపకపోవడమే మేలని ప్రధాన మంత్ర మోడీ అభిప్రాయపడ్డారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే ముఖ్యమని మోడీ స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ సమయంలో భయాందోళనల మధ్య విద్యార్థులు పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఒక వేళ ఎవరైనా పరీక్షలు రాయాలనుకుంటే వారికి కరోనా ఉధృతి తగ్గిన తరువాత పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలకు హజరుకావాలని విద్యార్థులను బలవంతం చేయవద్దని మోడీ పేర్కొన్నారు.
Read More: Anandaiah Medicine: ఆనందయ్య మందు పంపిణీపై వెనక్కు తగ్గిన టీటీడీ..కారణం ఇదీ..
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై పరీక్షల రద్దుపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఏపి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. పరీక్షలు నిర్వహించి తీరుతామన్న పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిర్ణయాలను పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి.