దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాధికారులపై ఎవరి పెత్తనం ఉండాలన్న అంశంపై గత కొన్నేళ్లుగా కేంద్రంలోని బీజేపీ, ఆప్ సర్కార్ మధ్య జరుగుతున్న పోరుపై ఇటీవలే సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఢిల్లీలో పరిపాలనా అధికారాలు స్థానిక ప్రభుత్వానికే ఉంటాయని తీర్పు చెప్పింది సుప్రీం కోర్టు. అయితే ఈ తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. తీర్పును సమీక్షించాలంటూ వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ నెల 11న సుప్రీం కోర్టు ఢిల్లీ పాలనపై సంచలన తీర్పు ఇచ్చింది. ఢిల్లీలో పాలనా అధికారాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే ఉంటాయని స్పష్టం చేసింది. శాంతి భద్రతలు మినహా అన్ని వ్యవహారాలపై సర్కార్ కే నియంత్రణ ఉంటుందని తేల్చి చెప్పింది.

దానికి అనుగుణంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చర్యలు ప్రారంభించారు. సేవల విభాగం కార్యదర్శి అశిష్ మోరేను బదిలీ చేశారు. కానీ దానికి కేంద్రం అడ్డుతగిలింది. అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో లెప్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) తుది మధ్యవర్తిగా చేస్తూ శుక్రవారం కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఆ వెంటనే ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చి తీర్పుపై సమీక్ష కోరుతూ శనివారం రివ్యూ పిటిషన్ వేసింది. కేంద్రం ఆర్డినెన్స్ ద్వారా నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీని ఏర్పాటు చేసింది. అది బదిలీలు, నియామకాలపై నిర్ణయం తీసుకుంటుంది. దానిలో ముఖ్యమంత్రి (చైర్ పర్సన్), చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ హోం సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. మెజార్టీ ఓటు ద్వారా నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడైనా ఓటింగ్ ద్వారా తేలని అంశం ఉంటే దానిపై తుది నిర్ణయాదికారి లెప్టినెంట్ గవర్నర్ కు ఉంటుంది.
అయితే ఇది లెప్టినెంట్ గవర్నర్ కు అధికారాలు కట్టబెట్టేలా ఉందంటూ ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. సుప్రీ కోర్టు ఆదేశాలను కేంద్రం ఉల్లంఘిస్తొందని మండిపడుతున్నారు. కేంద్ర కోర్టు దిక్కరణకు పాల్పడిందని వ్యాఖ్యానిస్తున్నారు. మరో పక్క కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు ఢిల్లీ ప్రభుత్వం కూడా సిద్దమవుతోంది. ఈ పరిణామాలతో ఢిల్లీలో అధికారాల పంచాయతీ ఇప్పట్లో తేలేలా కనబడటం లేదు.