Beast: తమిళ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ నుంచి చివరిగా వచ్చిన `మాస్టర్` తమిళంలో పాటు తెలుగులో మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే ఆయన తదుపరి చిత్రమైన `బీస్ట్`పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.`డాక్టర్` ఫేమ్ ల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.
డైరెక్టర్ సెల్వరాఘవన్, యోగిబాబు కీలక పాత్రల్లో కనిపించబోతుండగా.. అనిరుధ్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ మూవీని నిర్మించారు. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 13న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. రిలీజ్కు ఇంకా ఏడు రోజులే ఉండటంతో.. మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
ఇందంతా బాగానే ఉన్నా.. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ కొత్త ప్రచారం మొదలైంది. అదేంటంటే.. 2009లో వచ్చి సూపర్ హిట్ అయిన హాలీవుడ్ మూవీకి `పాల్ బ్లార్ట్ : మాల్ కాప్`కు బీస్ట్ కాపీ అంటూ నెట్టింట టాక్ నడుస్తోంది. చెన్నైలో ఓ ఫేమస్ మాల్ ని టెర్రరిస్ట్ లు హైజాక్ చేస్తారు. అయితే అదే మాల్ లో గవర్నమెంట్ కి చెందిన టాలెంటెడ్ స్పై విజయ్.. తీవ్రవాదుల నుంచి ప్రజలను ఎలా రక్షించాడు అన్నదే బీస్ట్ కథగా ట్రైలర్ బట్టీ అర్థం అవుతోంది.
అయితే `పాల్ బ్లార్ట్ : మాల్ కాప్` మూవీ కథ కూడా ఇంచుమించుగా ఇలానే ఉంటుంది. ఓ మాల్ ని నేరస్తుల ముఠా స్వాధీనం చేసుకుంటుంది. అప్పుడు అక్కడే పని చేసే ఓ సెక్యూరిటీ గార్డ్ నేరస్తులతో పోరాడి ప్రజలని రక్షించడు. ఈ నేపథ్యంలోనే `పాల్ బ్లార్ట్ : మాల్ కాప్`, `బీస్ట్` చిత్రాల కథ సేమ్ టు సేమ్ ఒకటే అని టాక్ మొదలైంది. అంతేకాదు, కొందరు నెటిజన్లు రెండు చిత్రాలను కంపేర్ చేస్తూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. దీంతో విడుదలకు ముందు ఇదెక్కడ గోలరా నాయనా అంటూ విజయ్ ఫ్యాన్స్ తల పట్టుకుంటున్నారు.