ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి.
ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో జాతులు ఉన్నాయి
అయితే అన్ని దేశాలు, అన్ని మతాలు, అన్ని కులాలు కలిపిన ఒక సంకర జాతి ఉంది.
అదే వయో వృద్దులు. ఇప్పుడు స్టైలిష్గా సీనియర్ సిటిజన్స్ అంటున్నారు.
అవ్వ పేరే ముసలమ్మ.
క్లుప్తంగా ఎస్సిలు. అంటే అంటరానివాళ్ళు.
వాళ్ళకి ఏరకమైన హక్కులు ఉండవు.
ఒకప్పుడు ఏదైనా చేసేటప్పుడు పెద్దవాళ్ళని సంప్రదించేవారు.
వాళ్ళ సలహా పాటించేవాళ్ళు.
మరి ఇప్పుడో ముహూర్తం పెట్టేక అందర్నీ పిల్చినట్టే వాళ్ళని పిలుస్తారు. అంతే.
వాళ్ళ మాటకి విలువ లేదు.
కొంతమంది ప్రపంచానికి భయపడి అమ్మ నాన్నని ఇంట్లోనే పెట్టుకుంటారు.
కానీ వాళ్ళు కేవలం పనిమనుషులతో సమానం.
వేళకి ఇంత పిండాకూడు పడేస్తారు.
కొంతమంది అవమానాలు భరించలేక హోంలకి వెళ్తున్నారు.
అక్కడ మాత్రం ఏం ఒరిగింది, అంతా వ్యాపారం.
జబ్బు చేస్తే డాక్టరు ఉండడు.
పెన్షన్ వాళ్లయితే డబ్బు కొడుకు తీసుకుంటాడు.
మరి అన్నేళ్లు పెంచిన ఖర్చు నువ్వు ఇస్తావా, లేదే!
కొడుకు గౌరవిస్తే కోడలు గౌరవిస్తుంది మనవలు గౌరవిస్తారు.
తాత మూకుడు తరతరాలు ఉండాలన్న కథ వినలేదా?
ఐతే వినండి.
ఓ మహానుభావుడు తండ్రిని పెరట్లో పాకలో ఉంచి తిండి మట్టి మూకుడులో పెడతాడు.
ఓనాడు మూకుడు కిందపడి ముక్కలవుతుంది.అప్పుడు కొడుకు తిడతాడు.
ఇదంతా చూస్తున్న మనవడు, తాతా నువ్వు మూకుడు బద్దలుకొట్టేస్తే మరి రేపు నేను మా నాన్నకి ఎందులో పెడతాను అంటాడు.
అంతే, కొడుక్కి కళ్ళు విడతాయి తండ్రిని లోపలి తీసుకెళతాడు. అది కథ.
రేపు మీబతుకులు అంతే అన్న సంగతి మర్చిపోకండి.
తల్లి తండ్రులందు దయ లేని పుత్రుండు అన్న వేమన పద్యం వినలేదా!
ఒక్కటి నిజం అమ్మ నాన్నల్ని ప్రేమించలేనివాడు ఎవర్ని ప్రేమించలేడు.
అన్నట్టు బాగ్బాన్ సినిమా చూసేరా?
అందులో కొడుకు తల్లితో ఓమాట అంటాడు. ‘కుఛ్ దిన్ కేలియే ఆప్ హమారా మొహమాన్ హో’ అంటాడు.
మనం మన పిల్లల ఇంట్లో ఎప్పుడూ అతిధులవే.
ప్రతి వృద్ధుడు ఎందుకు బతుకుతున్నావా అనుకుంటాడు.
ఖర్మ కాలి మెడిసిన్ పుణ్యవాని డాక్టర్ మనల్ని చావనివ్వడు.
ఇటు వీళ్ళు బతకనివ్వరు.
ఆ బతుకులు అంతే, జీవచ్ఛవాలు
-బీనా దేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ