కొంచెం ప్రేమగా వుందామని ఈ కొత్త సంవత్సరం దృఢంగా నిశ్చయించుకుందాం. వదిలించుకోవాల్సినవి కాదు, పెంచుకోవాల్సిన వాటి గురించి నిర్ణయాలు తీసుకుందాం. ఖర్చు లేనిది..కష్టం కానిది. కొండెలెక్కాల్సిన పనిలేదు. బండలు మొయ్యాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్. కొంచెం ప్రేమగా వుందామని మనస్పూర్తిగా అనుకుందాం. ప్రేమగా వుండాలని నిర్ణయించుకోవడం ఏమిటి అన్న అనుమానం రావచ్చు సహజమే. కాని ఇప్పుడు అంతకు మించిన అవసరం మరొకటి కనిపించడం లేదు. కేవలం ఒక మతం వారినో..ఒక కులం వారినో..ఫలానా ప్రాంతం వారినో..ఫలానా భాష వారినో కత్తిగట్టి ద్వేషిస్తున్న రోజుల్లో, విద్వేషమే దేశ వాసులకు మహాప్రసాదంగా పాలకులు పంచిపెడుతున్న నేపథ్యంలో ప్రేమ గురించి మాట్లాడుకోవడమే అతి కీలకమైన విషయంగా ఇప్పుడు మారిపోయింది. సాటివారిని, తోటివారిని కాస్తంత మనుషులుగా చూడమని చెప్పాల్సిరావడం కొంచెం విషాదమే కాని అదిప్పుడు తప్పనిసరి అయిపోయింది. భిన్న మతాల భిన్న భాషల సంస్కృతుల సమ్మేళనమైన దేశంలో కొందరిని అణచివేసి కొందరిని బాగుచేయడం అసాధ్యమని చెప్పాల్సిరావడం బాధాకరమే. కాని అదే ఇప్పుడు అనివార్యమైన సందేశంగా మారింది. ఓటు బ్యాంకు రాజకీయాలే రాజ్యమేలుతున్న చోట మనుషులు మనుషులుగా కాక, ఏ మృగాలుగానో మారిపోయే ప్రమాదమున్న చోట గుండె గుండెలోనూ ప్రేమను నాటాల్సిన అంశమే అత్యంత ప్రధానమైనదిగా ముందుకొచ్చింది. అందుకే ఇలా చెప్పుకుందాం. ఇలా ప్రతిజ్ఞ చేసుకుందాం. ఇలా ఒకరికొకరు భరోసా వాక్యాలు చెప్పుకుందాం.
|| కొంచం ప్రేమగా ఉందాం||
కుక్క పిల్లల్ని ప్రేమించినట్టు..
వాన చుక్కల్ని చేతుల్లో ఆడించినట్టు
పక్షులతో పువ్వులతో మాట్లాడినట్టు..వె
రీ సింపుల్..కొంచెం ప్రేమగా ఉందాం.
ముసలివాళ్ళతో ఎంతో ముద్దుగా ఉంటాం
పొద్దుటి పూటి పొగమంచు కొసలకు చూపుల్ని వేలాడదీస్తాం
ఊరకే చెట్లతో బాతాకానీ కొడతాం
జస్ట్ అంతే పెద్ద ఆయాసం పడక్కర్లేదు
కొంచెం ప్రేమగా ఉందాం
పిల్లల్ని గట్టిగా పట్టుకుని పడుకున్నట్టు
అమ్మానాన్నల పాదాలు తాకినట్టు..
చలిరాత్రి రగ్గు మడత విప్పినట్టు
కళ్ళు మూసుకుని దేవుణ్ణి తలుచుకున్నట్టు
పెద్ద బరువేం కాదు..
చాలా సింపుల్..కొంచెం ప్రేమగా ఉందాం
నీ కాగితాలనీ నీ కంప్యూటర్నీ
నీ పుస్తకాలనీ నీ వస్త్రాలనీ ఎంత ప్రేమిస్తావు నువ్వు
నీకు రోజూ కనిపించేవాడినీ
నీలాగే ఆశలతో ఆశయాలతో
కలలతో కన్నీళ్ళతో సతమతమయ్యేవాడినీ
నీ పక్కనే ఉన్నా..మరో గ్రహంలో ఉన్నా
నిన్ను నువ్వు ప్రేమించినట్టే వాడినీ ప్రేమించు
నువ్వు ప్రేమించినట్టే నేనూ నిన్ను ప్రేమిస్తాను
చూశావా ఎంత సింపుల్..
అందుకే కొంచెం ప్రేమగా ఉందాం
డా.ప్రసాదమూర్తి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ