జనసేనకు మాజీ మంత్రి గుడ్ బై!

విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం చెందడంతో నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి బాలరాజు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపించారు. తమతో కలిసి పనిచేసే అవకాశమిచ్చినందు ధన్యవాదాలు తెలిపారు కొన్ని నిర్ణయాలు వేదనోభరితమైనా, తీసుకోక తప్పని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇక నుంచి జనసేన పార్టీల కొనసాగలేనని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ఇసుక కొరతకు నిరసనగా విశాఖపట్టణంలో ఆదివారం లాంగ్ మార్చ్ తలపెట్టింది. అందుకు ఒక్క రోజు ముందు అదే ప్రాంతానికి చెందిన నేత పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.

గతంలో కాంగ్రెస్ పార్టీలో బాలరాజు మంత్రిగా వ్యవహరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన జనసేన పార్టీ తరపున పాడేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బాలరాజుకు  గిరిజన ప్రాంతాల్లో మంచి పేరు ఉంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎన‍్నికల అనంతరం పవన్ తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లాంగ్‌ మార్చ్‌ సన్నహాల కోసం శుక్రవారం జరిగిన సమావేశానికి కూడా గైర్హాజరు అయ్యారు. కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉండి ఆ తర్వాత ఏ పార్టీలో చేరాలో బాలరాజు నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే పలువురు జనసేన పార్టీ నేతలు పార్టీని వీడిన విషయం తెలిసిందే.