(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అధికారులూ, జాగ్రత్త. రానున్న రోజుల్లో మీరు ఎలా మెలగాల్సిందీ, దారి తప్పితే ఎలాంటి గతి ఎదురయ్యేదీ ఈ పాటికి అర్ధం అయిఉంటుంది కదా? అదీ అలా వళ్లు దగ్గిరపెట్టుకుని ఉండండి ఇక. ఏ మాత్రం తోక జాడించారో మధ్యప్రదేశ్, ఇండోర్ నగరంలో మునిసిపల్ కార్పొరేషన్ అధికారికి పట్టిన గతి చూశారా? అంత దూరం ఎందుకు, తెలంగాణ, కొమురంభీం జిల్లాలో అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్‌కు ఏం గతి పట్టిందో చూడలేదా! అదీ సంగతి. వళ్లు దగ్గిర పెట్టుకోండి.
ఇండోర్‌లో ఆక్రమణలు తొలగించడానికి వెళ్లాడా అధికారి. తన డ్యూటీ తాను చేస్తున్నాను అనుకున్నాడు. పిచ్చోడు. స్థానికంగా ఒక శాసనసభ్యుడు ఉన్నాడే, వెళ్లి ఆయన దీవెనలు అందుకోవాలని తెలియదా? ఆ మాత్రం తెలియకుండానే అధికారి ఎలా అయ్యాడు? చివరికి అయ్యగారికి గట్టి సన్మానమే జరిగింది. అందరూ చూస్తుండగా రోడ్డు మీద క్రికెట్ బ్యాట్‌తో తగిలించాడు కదా బిజెపి శాసనసభ్యుడు ఆకాశ్ విజయవర్గీయ!
ఆకాశ్ అలాంటి ఇలాంటి శాసనసభ్యుడా! కైలాస్ విజయవర్గీయ ముద్దుల కుమారుడు. కైలాస్ విజయవర్గీయ అంటే ఎవరు? ఫశ్చిమ బెంగాల్ వంటి కీలకమైన రాష్టంలో బిజెపి వ్యవహారాలు చూస్తున్న మహానేత. ఆయన కొడుకు, అందునా శాసనసభ్యుడు కొడితే కొట్టించుకోవాలి తప్పదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమన్నాడు ఆయన? మళ్లీ బ్యాట్ చేతబట్టే అవసరం అధికారులు రానివ్వరని అనుకుంటున్నాని అన్నాడు. మరి మీ ఇష్టం.
కైలాస్ విజయవర్గీయ మాత్రం, ఎంత మంచి తండ్రి ఆయన! కుమారరత్నం బ్యాట్ పుచ్చుకుని అధికారిని రొడ్డు వెంట పరిగెత్తించి కొడితే ఆయన ఏమన్నాడు! పౌర సంస్థల అధికారులు పొగరు చూపించకూడదని అన్నాడు. ‘ఆకాశ్జీ’ ఇంకా ఆట రాని ఆటగాడు అన్నాడు. ఆట రాని ఆటగాడే ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటే ఇక ఆట పూర్తిగా వస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి!
పోలీసులు గీలీసులు మీ పక్కన నిలబడతారని అనుకుంటున్నారేమో! అలాంటి భ్రమలేమీ పెట్టుకోకండి. ఇండోర్‌లో ఏమి జరిగిందో చూశారుగా? కార్పొరేషన్ అధికారిని రోడ్డు మీద బర్రెను బాదినట్లు బాదినపుడు పోలీసులు పక్కనే ఉన్నారు చూశారో లేదో! మళ్లీ జూనియర్ విజయవర్గీయ విడుదల అయ్యి జైలు నుంచి బయటకు వచ్చినపుడు కూడా అక్కడే ఉన్నారుగా! ఆకాశ్జీ అనుచరులు తమ నాయకుడు బయటకు వచ్చిన సంతోషంతో గాలిలోకి తుపాకులు కాలిస్తే అదేమి అన్నారా! తర్వాత ఇంటి దగ్గర మిఠాయిలు తిని ఎంచక్కా పోలీసులు కూడా సంతోషం పంచుకున్నారు కదా!
ఇక తెలంగాణలో కూడా ఇదే తంతు. ప్రజాప్రతినిధులను అధికారులు లెక్క చెయ్యకపోతే ఎలా? పోలీసులను వెంట పెట్టుకుని వెళితే సరిపోతుంది అనుకుంటే పప్పులో కాలేశారే. మన మహిళా రేంజరు గారు కూడా అదే అనుకున్నారు. పోలీసులు ఉండగా నాకేమి అవుద్దిలే అని. పైగా ఆడదాని జోలికి వస్తారా అని కూడా అనుకునుండవచ్చు. చివరికి నెత్తి పగిలింది. మాటలతో చెబితే వినిపించుకోరు. చేతల దాకా ఎందుకు రానివ్వడం? ఈ ఇద్దరికీ పట్టిన గతి చూసిన తర్వాతైనా అధికారులు బుద్ధిగా మెలగుతారా లేదా?