(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆ దొంగకు వినూత్నమైన ఐడియా వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్క్ ఒకటి సంపాదించి దానిని ముఖానికి తగిలించుకుని చోరీకి బయలుదేరాడు. చోరీ చేశాడు కూడా. అయితే చివరన మాస్క్ ఊడిపోయి దొంగ గారి ముఖారవిందం బయటపడింది.
ఆస్ట్రేలియాలో ఈ సంఘటన జరిగింది. ముఖానికి ట్రంప్ మాస్క్ ధరించిన వ్యక్తి ఒక షాపింగ్ సెంటర్ తలుపులు పగలగొట్టి లోపలకు ప్రవేశించాడు. లోపల ఒక జ్యువెలరీ షాపు డిస్ప్లె విండో బద్దలుకోట్టి ఖరీదయిన వాచ్‌లు దొంగింలించాడు. మరో షాపులో కూడా చోరీ చేసాడు. చివరలో ముఖానికి ఉన్న మాస్క్ ఊడిపోయింది. దొంగ కోసం క్వీన్స్‌ల్యాండ్ పోలీసులు గాలిస్తున్నారు.
దొంగ గారు ట్రంప్ మాస్క్ తగిలించుకోవడం నెట్లో జోకులకు దారి తీసింది. అందరూ ట్రంప్ మీదే గురిపెట్టడం విశేషం. ఇది ఫేక్ న్యూసా అంటూ ఒక ఫేస్బుక్ యూజర్ ప్రశ్నించాడు. అది మాస్కేనంటారా అంటూ మరో వ్యక్తి జోక్ చేశాడు. షాపింగ్ సెంటర్ చుట్టూ గోడ కట్టండి. వాడు ఎక్కడికీ పోలేడు అంటూ మరో జోక్ పేలింది.