కన్నూర్: కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఓ చిత్రమైన అభిమాని దొరికాడు. తనను కలిసేందుకు ఐదు గంటలకు పైగా వేచి చూసిన అతడి అభిమానానికి రాహుల్ ఫిదా అయిపోయారు. కేరళలోని కన్నూరు జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. అక్కడకు వచ్చిన రాహుల్ గాంధీని చూడాలని, ఆయనను కలవాలని ఏడేళ్ల వయసున్న నందన్ అనే అబ్బాయి వచ్చాడు. దాదాపు ఐదు గంటలపాటు అలాగే నిలబడిపోయాడు. కానీ, భద్రతా కారణాల వల్ల తనను వెళ్లనివ్వకపోవడంతో నిరాశగా వెనుదిరిగాడు. ఈ విషయం ఎలాగో రాహుల్ గాంధీ వరకు వెళ్లింది. వెంటనే ఆయన తన బుల్లి అభిమాని తండ్రికి ఫోన్ చేశారు. ‘‘హాయ్, నేను రాహుల్ గాంధీని. మీ అబ్బాయితో ఓసారి మాట్లాడచ్చా’’ అని అడిగారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ కొత్తగా ప్రారంభించిన వయనాడ్ ట్విటర్ ఖాతాలో వెల్లడించారు.
తెల్లవారుజామున 5 గంటలకే నందన్ తన తల్లిదండ్రులతో కలిసి ఆడిటోరియం వద్దకు వచ్చాడు. కానీ హాల్లోకి వెళ్లడం కుదరలేదు. తన షర్టు మీద రాహుల్ ఫొటో అతికించుకుని, తాను బాగా అభిమానించే వ్యక్తిని కలవాలని ఓ లేఖ కూడా చేత్తో పట్టుకున్నాడు. రాహుల్ అక్కడ 9 గంటలకు సమావేశంలో మాట్లాడాల్సి ఉంది. తన కొడుకు రాహుల్ ను కలవలేని విషయాన్ని నందన్ తండ్రి ఫేస్ బుక్ లో రాయగా అది వైరల్ అయింది. స్థానిక కాంగ్రెస్ నాయకుడి నుంచి ఆ విషయం రాహుల్ వరకు వెళ్లి.. చివరకు నందన్ కు ఫోన్ వచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా చీఫ్, మాజీ హీరోయిన్ దివ్యస్పందన ట్వీట్ చేశారు.
https://twitter.com/divyaspandana/status/1118871373638766593