న్యూయార్క్ నగరంలో నిరసన ప్రదర్శనను ఉద్దేశించి ప్రసంగిస్తున్న స్వీడిష్ కార్యకర్త గ్రేటా తున్బెర్గ్
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భూతాపం సమస్యను తక్షణం పట్టించుకుని పరిష్కారాలు వెదకాలని ప్రపంచ దేశాల నాయకులను కోరుతూ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ప్రదర్శనలు జరిగాయి. స్వీడిష్ టీనేజి కార్యకర్త గ్రేటా తున్బెర్గ్ స్ఫూర్తితో జరిగిన ఈ ప్రదర్శన ప్రపంచ చరిత్రలోనే పెద్ద వాతావరణ మార్పు నిరసన.
12 నెలల క్రితం గ్రేటా తున్బెర్గ్ పర్యావరణం పరిరక్షణ కోసం ఉద్యమం మొదలుపెట్టింది. గత సంవత్సరం ఆగస్టులో ఒక రోజు స్కూలు మానేసి భూతాపం తగ్గించడానికి గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ స్వీడన్ పార్లమెంట్ ముందు ప్లకార్డు పట్టుకుని నుంచుంది. ఆనాటి నుంచి వాతావరణం కోసం స్కూలు సమ్మె ఉద్యమం ప్రపంచంలో ఏదో ఒక మూల జరుగుతూనే ఉంది.
శుక్రవారం నాటి నిరసన ప్రదర్శనలో కూడా పిల్లలు, యువతీ యువకులే పాల్గొన్నారు. అయితే ఈ ఉద్యమం మొదలయిన తర్వాత తొలిసారిగా పెద్దలను కూడా ఆహ్వానించారు. ఫలితంగా లక్షలాది మంది సభ్యులుగా ఉన్న అనేక ట్రేడ్ యూనియన్లు నిరసనలో పాల్గొన్నాయి. కార్మికులు, వైద్యులు, నర్సులు..ఒ కరేమిటి అన్ని రంగాల వారూ చేయి కలిపారు. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ వంటి సంస్థలలో పని చేసే ఉద్యోగులు నిరసనలో పాలు పంచుకునేందుకు బయటకు నడిచారు.
మొత్తం మీద 185 దేశాల్లో ఈ ప్రదర్శనలు జరిగాయి. ఎక్కడికక్కడ తమ స్థానిక సమస్యలపై ప్రజలు నినదించారు. ఉదాహరణకు సాలమన్ దీవుల్లో సముద్రమట్టం పెరగడంపై, దక్షిణాఫ్రికాలో విషతుల్యమైన వ్యర్ధాలపై, భారతదేశంలో వాతావరణ కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్ధాల సమస్యలపై స్పందించారు. స్థూలంగా అన్నిదేశాల నుంచీ వచ్చిన సందేశం ఒక్కటే: భూతాపానికి కారణమవుతున్న కార్బన్ డై ఆక్సైడ్ వంటి వాయువుల సంగతి తక్షణం చూడండి.
ఐక్యరాజ్యసమితిలో వచ్చే సోమవారం వాతావరణ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. భూఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న పారిస్ శిఖరాగ్ర సమావేశం లక్ష్యానికి కట్టుబడే విధంగా ప్రపంచ దేశాల నుంచి హామీలు తీసుకోవడం కోసం సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
బరాక్ ఒబామా హయాంలో పారిస్ సమ్మిట్ ఒప్పందంపై అమెరికా సంతకం చేస్తే తర్వాత వచ్చిన డొనాల్డ్ ట్రంప్ దాని నుంచి బయటకు నడిచారు. సోమవారం నాటి శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ట్రంప్ సమితిలోనే ఉంటారు కానీ ఆయన ఆ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించరు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు.
శుక్రవారం నాటి చారిత్రాత్మక నిరసన ప్రదర్శనపై ‘ద గార్డియన్’ పత్రిక రూపొందించిన వీడియో చూడండి: