ఏపి ప్రభుత్వం నియమించిన సిట్ విచారణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు ఖాయమంటూ వైసీపీ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు కామెంట్స్ చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను నిగ్గు తేల్చేందుకు జగన్మోహనరెడ్డి సర్కార్ సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే సిట్ నియామకంపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించగా, స్టే ఇచ్చింది. హైకోర్టు తీర్పును ఏపి సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, ఏపి హైకోర్టు సిట్ పై స్టే ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ప్రాధమిక విచారణ దశలోనే స్టే ఇవ్వడం సమంజసం కాదని పేర్కొంటూ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టేసింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఇక చంద్రబాబు ఉచ్చు బిగుసుకున్నట్లే అని, అరెస్టు కూడా ఖయమని పలువురు మంత్రులు, ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, హోం శాఖ మంత్రి తానేటి వనిత, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తదితరులు సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జరిగే పరిణామాలు వివరించారు.

అమరావతి పేరుతో భారీ అవినీతి జరిగిందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొంటూ, జరిగిన అవినీతి మొత్తం బయటకు తీస్తామని తెలిపారు. సిట్ దర్యాప్తుతో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు. కఛ్చితంగా అరెస్టులు కూడా జరుగుతాయని తెలిపారు. సుప్రీం కోర్టులో ఏపి ప్రభుత్వానికి భారీ విజయం దక్కిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విధానపరమైన నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం కలిగిస్తే తప్పేనని పేర్కొన్నారు. గతంలో జరిగిన తప్పులను తప్పకుండా సమీక్ష చేయాల్సిందేనని అన్నారు. రాష్ట్ర సంపదకు నష్టం కలిగించే కుట్రలను బయటకు తీస్తామని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో తప్పు చేయకపోతే వారికి భయమెందుకని సజ్జల ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లోనూ చంద్రబాబు హస్తం ఉందని సజ్జల ఆరోపించారు.

అమరావతి భూముల కుంభకోణంపై సిట్ దర్యాప్తునకు ప్రభుత్వం చేసిన అప్పీల్ ను పరిగణలోకి తీసుకుని మళ్లీ విచారణ జరిపించండని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామనీ, స్వాగతిస్తున్నామని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరగకపోతే దర్యాప్తును ప్రాధమిక దశలోనే ఎందుకు అడ్డుకున్నారని ఆమె ప్రశ్నించారు. తప్పు చేశామని భయం ఉండబట్టే స్టే తెచ్చుకున్నారని అన్నారు. విచారణ ఎదుర్కొని వాళ్ల నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. విచారణ జరిగితే చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు బయటపడతాయన్న భయంతోనే ప్రాధమిక విచారణలో ఉండగానే హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నారని తెలిపారు.

గతంలో కూడా ఈ అంశంపై మంత్రివర్గ ఉప సంఘం వేసినప్పుడు భూముల కొనుగోళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలను అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చారని తెలిపారు. రాజధాని ప్రాంతంలో జరిగిన ప్రతి అంశాన్ని పారదర్శకంగా విచారణ చేస్తామని అన్నారు. దోషులు ఎవరూ తప్పించుకోలేరని, ఎప్పటికీ సత్యమే గెలుస్తుందని అన్నారు. మరో మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో జరిగిన మొత్తం వ్యవహారాలపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామనీ, అక్రమాలు, అవినీతికి పాల్పడిన వారు ఎంతటి వారైనా జైలుకు వెళ్లడం తప్పదని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఈ అంశమే రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది.
అధ్యక్షుడు పుతిన్ హత్యకు ఉక్రెయిన్ కుట్ర అంటూ రష్యా సంచలన ఆరోపణ .. ఖండించిన ఉక్రెయిన్