మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవేళ సీబీఐ ఎదుట విచారణకు హజరైయ్యారు. ఇవేళ అవినాష్ రెడ్డి విచారణకు హజరు కావడం నాల్గవ సారి. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టు నిన్న వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తీర్పు వెలువరించే వరకూ అవినాష్ రెడ్డి పై బలవంతపు చర్యలు ఏవీ తీసుకోవద్దు అంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే క్రమంలో పార్లమెంట్ సమావేశాలకు హజరవ్వాల్సిన అవసరం ఉన్నందున మూడు వారాల పాటు విచారణ నుండి మినహాయింపు ఇవ్వాలని అవినాష్ తరపు న్యాయవాది కోర్టును కోరగా, సీబీఐ దర్యాప్తు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమనీ, మినహాయింపు కావాలంటే సీబీఐనే సంప్రదించాలని కోర్టు తెలిపింది.

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున 14వ తేదీ (నేడు) విచారణకు హజరు కాలేనని సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ రాయగా, వారు అవినాష్ వినతిని ఆమోదించలేదు. దీంతో అవినాష్ రెడ్డి కొద్ది సేపటి క్రితం సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ నేతృత్వంలో కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. అయితే ఈ రోజు విచారణ అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు. సీబీఐ కార్యాలయం వద్ద మీడియాతో అవినాష్ రెడ్డి మాట్లాడటంపై హైకోర్టు ఆక్షేపణ వ్యక్తం చేసిన కారణంగా ఈ రోజు మాట్లాడే అవకాశం లేదని భావిస్తున్నారు.
మరో పక్క హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పు ఆధారంగా ఇవేళ సీబీఐ చర్యలు ఉండే అవకాశం ఉంది. తీర్పు వెలువడే వరకూ అరెస్టు లాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దు అంటూ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇవేళ అరెస్టు జరగకపోవచ్చు. కాగా అవినాష్ రెడ్డి విచారణ సందర్భంగా కోటిలోని సీబీఐ కార్యాలయం వద్ద భారీ పోలీస్ భద్రత ఏర్పాట్లు చేశారు. అవినాష్ రెడ్డి అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
నేటి నుండి ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు