డిప్రెషన్ (కుంగుబాటు) లక్షణాలు కనబడడం వృద్ధులలో ఎక్కువ. ఆర్ధిక సామాజిక హోదా, కుటుంబ సభ్యులతో సంబంధాలు, జీవిత భాగస్వామితో సంబంధాలు, ఇరుగు పొరుగుతో సంబంధాలు, జన్యుపరంగా సంక్రమించిన లక్షణాల వంటి కారణాలతో డిప్రెషన్ రావచ్చు. పెద్దవాళ్లను ఎక్కువగా పీడించే ఈ మానసిక రోగంపై పెద్ద స్థాయిలో పరిశోధన జరుగుతోంది.
క్రమం తప్పకుండా తేనీరు సేవిస్తే పెద్దలలో డిప్రెషన్ లక్షణాలు తగ్గుతున్నట్లు సింగపూర్ యూనివర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ఫలితాలను ఏజింగ్ అనే జర్నల్‌లో ప్రచురించారు.
తేయాకులో ఉండే కేటిచిన్, ఎల్ థియానైన్, కెఫిన్ వంటి పదార్ధాలు మంచి మూడ్‌ను తెచ్చిపెడతాయనీ, మెదడు, గుండె ఆరోగ్యానికి సహకరిస్తాయనీ, కాన్సర్‌ను నిరోధిస్తాయనీ గతంలోనే తేలింది. అయితే డిప్రెషన్ రాకుండా చేయడంలో తేయాకు పాత్రను ఖచ్చితంగా అంచనా వేయడం ఇప్పటివరకూ కష్టమయింది. ఎందుకంటే తేనీరు సేవించేవారు ఎక్కువగా సమూహాలలో కలుస్తుంటారు. ఆ విధంగా మిత్రులతో కలిసినందువల్ల కూడా డిప్రెషన్ దూరం అయిఉండవచ్చు కాబట్టి తేనీరు పాత్రను నిర్వచించడం కుదరలేదు.
తాజా అధ్యయనంలో ఈ ఇతర అంశాలను వేరు చేసి తేనీరు సేవించిన దాని ఫలితాన్ని మాత్రమే అంచనా వేసే పద్ధతులు రూపొందించి వాటి ప్రకారం పరిశీలన చేశారు. పెద్ద వయసు వారిలో తేనీరు సేవనం డిప్రెషన్ తగ్గించేందుకు ఖచ్చితంగా ఉపయోగపడుతున్నట్లు గుర్తించారు.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.