బెల్జియం: ఒక పావురం వేలంలో 9.75 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. పావురాన్ని వేలం వేయటం ఏంటి? వేసినా మరి ఇంత రేటు పెట్టి కొంటున్నారా? అనే సందేహం తప్పక వస్తుంది. కానీ ఈ పావురం చాలా ప్రత్యేకమైనది. అందుకే ఇంత రేటు పలికింది.
ఈ పావురం పేరు అర్మండో. బెల్జియంలో జరిగే పావురాల రేసింగ్‌లో (ఎక్కువ దూరం ఎగరటం) అర్మండో ప్రతిసారి విజేతగా నిలిచింది.
బెల్జియం, బ్రిటన్, ఉత్తర ఫ్రాన్స్ , నెదర్లాండ్స్‌లో పావురాల రేసింగ్ ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. ప్రస్తతం ఈ రేసింగ్‌లు నిర్వహించటం తగ్గు ముఖం పడుతున్నప్పటికీ అర్మండో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది.
‘గతంలో నదిన్ అనే పావురం 2.91 కోట్ల రూపాయలకు అమ్మడుపోగా అర్మండో ఆ రికార్డును బద్దలుకొడుతుందని భావించాం. కానీ ఇంత రేటుకు అమ్ముడుపోతుందని ఊహించలేదు. అర్మండోనే ఇప్పటివరకూ వేలంలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన పావురం ‘ అని పావురాలను వేలం వేసే వెబ్సైట్ పీజియన్ పారడైజ్ పేర్కొంది.
అర్మండోను కొన్న వ్యక్తి వివరాలను మాత్రం పీజియన్ పారడైజ్ వెల్లడించలేదు. అయితే ఈ పావురాన్ని చైనాకు చెందిన వ్యక్తి కొనుగోలు చేసినట్లు బెల్జియన్ వార్త సంస్థ పేర్కొంది.
బెల్జియం పావురాల బ్రీడర్ జోయెల్ వెర్షూట్ అమ్మిన వందకు పైగా పావురాల్లో అర్మండో ఒకటి. కొన్ని వారాలుగా జోయెల్ పావురాలను వేలంలో అమ్ముతున్నాడు. ఆదివారం నాటికి జోయెల్ 178 పావురాలను సుమారు 1.55 కోట్ల రూపాయలకు అమ్మాడు.