అట్టుడికిన అకాల్ యూనివర్సిటీ
భటిండా (పంజాబ్): పంబాజ్‌లోని భటిండాలో అకాల్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు హాస్టల్ వార్డెన్లు సహా నలుగురి ఉద్యోగాలు ఊడాయి. క్యాంపస్‌లోని ఒక హాస్టల్లో శానిటరీ ప్యాడ్ ఉందన్న అనుమానంతో అమ్మాయిలను దుస్తులు విప్పాలని వార్డెన్లు ఆదేశించడంతో విద్యార్థులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తంచేశారు. దాంతో విచారణ జరిపిన యూనివర్సిటీ వర్గాలు.. ఇందుకు కారణమైన నలుగురు ఉద్యోగులను తొలగించాయి.
హాస్టల్ వాష్‌రూంలో ఒక శానిటరీ ప్యాడ్ పడి ఉందని, దాన్ని ఎవరు పారేశారో తెలియాలంటే అమ్మాయిలంతా దుస్తులు విప్పాలని హాస్టల్ వార్డెన్ ఆదేశించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో యూనివర్సిటీలో ఆందోళన నిర్వహించారు. గత వారం జరిగిన ఈ ఘటనపై యూనివర్సిటీ అట్టుడికింది.
ఫజిల్కా జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకోవడంతో ప్రభుత్వ పాఠశాలలోని ఇద్దరు ఉపాధ్యాయులను బదిలీ చేస్తూ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ గత సంవత్సరం ఆదేశాలు జారీచేశారు. కుందల్ గ్రామంలో కొందరు విద్యార్థినులు ఏడుస్తూ, టీచర్లు తమను దుస్తులు విప్పాల్సిందిగా ఆదేశించారని ఫిర్యాదుచేసిన వీడియో క్లిప్ బయటపడింది. స్కూలు టాయిలెట్లో ప్యాడ్ పడి ఉండటంతో టీచర్లు అమ్మాయిల దుస్తులు విప్పించి తనిఖీ చేశారు. దీనిపై కఠిన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఆదేశించింది.