ప్రధాని నరేంద్ర మోదిని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి ప్రప్రధమంగా ‘ఫ్యూరెర్’ అన్న పదం ఉపయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధానికి, యూదుల మారణహోమానికి కారకుడు అయిన అడాల్ఫ్ హిట్లర్ జర్మనీ నియంతగా ఫ్యూరెర్ అని పిలిపించుకున్నాడు. ఫ్యూరెర్ అంటే జర్మన్ భాషలో నాయకుడు అని అర్ధం. హిట్లర్ అనంతరం ఆ పదానికి నియంత అనే అర్ధం స్థిరపడిపోయింది.
రాహుల్ మోదిని ఫ్యూరెర్ అనడానికి ప్రేరేపించిన విషయం బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో వచ్చిన ఓ కథనం. 2017-18లో భారతదేశంలో నిరుద్యోగం 6.1 శాతం ఉందనీ, ఇది గత 45 ఏళ్లలోనే అత్యధికమనీ బిజినెస్ స్టాండర్డ్ రాసింది. దీనికి ఆధారం నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీసు నిర్వహించిన ఒక సర్వే. గత డిసెంబర్లో ఈ సర్వే నివేదికను జాతీయ స్టాటిస్టికల్ కమిషన్ ఆమోదించినప్పటికీ దానిని ప్రభుత్వం విడుదల చేయకుండా తొక్కిపెట్టింది.
బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ఈ నివేదికను సంపాదించి ప్రచురించింది. దాని మీదట రాహుల్ గాంధీ ట్విట్టర్లో స్పందించారు. ‘నమో జాబ్స్. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని ఫ్యూరెర్ చెప్పారు. అయిదేళ్ల నిండిన మీదట లీకయిన ఉద్యోగాల కల్పన రిపోర్టు చూస్తే ఏముంది! అంతా వినాశనమే!’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ఆ మధ్య మోదీ ముంబైలో వాడిన ఉరి సినిమా పాపులర్ డైలాగ్‌ను కూడా రాహుల్ ఆయనపై తిరిగి ప్రయోగించారు. ‘హౌ ఈజ్ ద జోష్’ అనే ఆ డైలాగ్‌ను కాస్త మార్చి ‘హౌ ఈజ్ ద జాబ్స్’ అని ట్వీట్ చేశారు.
NoMo Jobs!
The Fuhrer promised us 2 Cr jobs a year. 5 years later, his leaked job creation report card reveals a National Disaster.
Unemployment is at its highest in 45 yrs.
6.5 Cr youth are jobless in 2017-18 alone.
Time for NoMo2Go. #HowsTheJobs pic.twitter.com/nbX4iYmsiZ
— Rahul Gandhi (@RahulGandhi) January 31, 2019
రాహుల్ విమర్శకు సమాధానంగా బిజెపి అధికారిక ట్విట్టర్ ఖాతాలో రాహుల్‌ను ఇటలీ నియంత ముస్సోలినీతో పోల్చారు. ‘ముస్సోలినీ లాగా రాహుల్‌కు హ్రస్వదృష్టి అని రుజువయింది. నిజానికి ఉద్యోగాలు పెరిగినట్లు ప్రావిడెంట్ ఫండ్ సంస్థ లెఖ్కలు చెబుతున్నాయి. జీవితంలో ఒక్క ఉద్యోగం కూడా చేయని నిరుద్యోగి మాత్రమే ఇలాంటి మాటలు ప్రచారం చేయగలరు’, అని ట్వీట్ చేశారు.