హైదరాబాద్: నగరశివారు రాజేంద్రనగర్‌లో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 173 వద్ద ఫుట్‌పాత్‌పై ఉన్న వ్యక్తి ఓ బాక్స్‌ను తెరిచేందుకు ప్రయత్నించగా అది భారీ శబ్థంతో పేలింది. దీంతో ఆ వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటనలో ఆ వ్యక్తి రెండు చేతులు తెగిపడి 10 మీటర్ల దూరంలో పడ్డాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాక్స్‌ను ఓపెన్ చేసిన వ్యక్తి బిచ్చగాడి(40)గా గుర్తించారు. అతడు సమీప ప్రాంతాల్లో వస్తువులను ఏరుకుని వచ్చి అందులోని బాక్స్‌ను ఓపెన్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, డాగ్ స్వ్కాడ్.. ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. ఈ ఘటనపై ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా బిచ్చగాడికి బాక్స్ ఇచ్చి ఓపెన్ చేసేలా చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కెమికల్ బాక్స్ అయి ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పేలుడు సంభవించిన ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటంతో ఇతరులెవరికీ ఎలాంటి హాని కలగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే భారీ పేలుడు కారణంగా వచ్చిన శబ్ధంతో సమీప ప్రాంతాల్లో నివసించేవారు భయభ్రాంతులకు గురయ్యారు.