ప్రేమ.. ప్రతీకారం.. అరెస్ట్!

న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించి..దుర్బుద్ధితో అక్రమ గంజాయి కేసులో ఇరికించబోయి ఇరుక్కున్నాడో సీఐఎస్ఎఫ్ అధికారి. గురువారం సీనియర్ సీఐఎస్ఎఫ్ అధికారి రంజన్ ప్రతాప్ సింగ్ ని ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి భర్త కారులో 550 గ్రాముల గంజాయి పెట్టినందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. 20 ఏళ్ల క్రితం ఐఏఎస్ ఆఫీసర్ ని సీఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ రంజన్ ప్రతాప్ సింగ్ కలిశారు. సివిల్ సర్వీస్ పరీక్షలకు వీరు కలిసే సిద్ధమయ్యారు. 2000 సంవత్సరంలో ఇధ్దరూ ఉత్తరాఖండ్ లోని లాల్ బహదూర్ శాస్త్రీ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో నాలుగు నెలల ఫౌండేషన్ కోర్సుకు కూడా హాజరయ్యారు. ఆ సమయంలో సదరు ఐఏఎస్ ని రంజన్ ప్రతాప్ ప్రేమించాడు. అయితే ఆమె మరొక వ్యక్తిని వివాహం చేసుకోవడంతో అతను తీవ్ర మనస్తాపం చెందాడు. ఇటీవల ఆమెతో మళ్లీ స్నేహం పెంచుకుని.. తరచూ ఫోన్ కాల్స్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఆమె అతన్ని మందలించింది. దీంతో అతను ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆరు నెలల క్రితం తన చిన్ననాటి స్నేహితుడి నుంచి గంజాయిని కొన్నాడుని పోలీసులు తెలిపారు.

అయితే సింగ్ సదరు ఐఏఎస్ అధికారి భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో కన్సల్టెంట్ గా ఉన్న సదరు ఐఏఎస్ అధికారి భర్తను అరెస్టు చేయించేందుకు పథకం రచించాడు. మాదకద్రవ్యాలను కలిగి ఉన్నాడనే ఆరోపణలతో అతన్ని అరెస్టు చేయించాలని తన స్నేహితుడితో కలిసి ప్రణాళిక రచించాడు. అక్టోబర్ 4న ఇంటి బయట పార్క్ చేసిన ఐఏఎస్ అధికారి భర్త కారులో గంజాయిని పెట్టారు. అయితే, ఈ పథకం విఫలమైంది. కారులో మూడు గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో అసలు సూత్రధారి రంజన్ ప్రతాప్ అని తెలిసింది. విషయం బయటపడటంతో అడ్డంగా దొరికిపోయాడు. దీంతో రంజన్ ప్రతాప్ సింగ్ అతని స్నేహితుడు నీరజ్ చౌహాన్ లను పోలీసులు అరెస్టు చేశారు. వీరు గంజాయి కొనుగోలు చేసినట్లు తమకు ఆధారాలు లభించాయని డీసీపీ అతుల్ ఠాకూర్ తెలిపారు.