(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పెళ్లి ముందు సినిమా లెవల్లో వీడియో తయారుచేయించారు. పెళ్లికొడుకు ధన్పత్ రాజస్థాన్ పోలీసు ఫోర్స్లో ఇన్స్పెక్టర్. ఉదయపూర్లో షూటింగ్ చేశారు. బ్యాక్గ్రౌండ్లో బాలీవుడ్ పాట పెట్టారు. 5 నిముషాల 43 సెకన్ల ఆ వీడియోను బంధుమిత్రులు చూడడం కోసం యుట్యూబ్లో అప్లోడ్ చేశారు.
అంతా బాగానే ఉంది. అయితే ఆ వీడియోలో కాబోయే భార్యాభర్తల మధ్య ప్రేమ చిగురించే సన్నివేశంలో ధన్పత్కు ఆ అమ్మాయి లంచం ఇచ్చినట్లు చూపించారు. ఆ యువతి హెల్మెట్ లేకుండా మొబైక్ నడుపుతుంటే ధన్పత్ ఆపుతాడు. లంచంగా కరెన్సీ నోటు తీసి అతని షర్ట్ జేబులో పెడుతూ ఫ్యాంట్ జేబులోంచి పర్సును లాఘవంగా కొట్టేస్తుంది ఆ అమ్మాయి. అక్కడ నుంచి ఇద్దరూ ప్రేమాయణం మొదలెడతారు. ఈ సన్నివేశం దగ్గరే పేచీ వచ్చింది.
https://youtu.be/MotKP9Up-xE
ఈ వీడియో సంగతి చిత్తోర్ఘడ్కు చెందిన ఒక పోలీసు అధికారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అందులో యూనిఫాంలో లంచం తీసుకున్నట్లు చూపించడం సీనియర్ పోలీసు అధికారులకు రుచించలేదు. ఇన్స్పెక్టర్ జనరల్ హవా సింగ్ గోమారియా రాష్ట్రంలోని అన్ని రేంజ్ల ఐజిలకు ఒక సర్క్యులర్ పంపించారు.
పోలీసు యూనిఫారం ధరించి అడ్డమైన పనులూ చేస్తూ వీడియోలు తీయడం కుదరదని ఆ సర్క్యులర్లో స్పష్టం చేశారు. పోలీసు యూనిఫాంను దుర్వనియోగం చేసే పోలీసు అధికారులపై చర్యతీసుకోవాల్సిందిగా అందులో కోరారు. పెళ్లికి ముందు వీడియోలలో యనిఫాం ధరించవద్దని అందులో పేర్కొన్నారు. యూనిఫాం ప్రతిష్టను కాపాడడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఐజిలను కోరారు.