(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వచ్చినప్పటి నుంచి రాజకీయాలు మరింత హీటెక్కాయి. కేసీఆర్ కేబినెట్ లో ఉండేదెవరు..? పోయేదెవరు..? కొత్తగా వచ్చేదెవరనే విషయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. అయితే.. కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ పార్టీ విషయంలో మంత్రి ఈటల రాజేందర్ సీరియస్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయనకు ఉధ్వాసన పలకడం దాదాపు ఖాయమైపోయిందట. గులాబీ జెండాకు ఓనర్లం అంటూ.. ఈటల చేసిన కామెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రివర్గం నుంచి ఆయన్ను తప్పించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈటలను తొలగించాలని ఫిక్స్ అయ్యారట కేసీఆర్. దీనికి బలాన్ని చేకూర్చే విధంగా.. కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్ కు మంత్రిపదవి కన్ఫామ్ చేశారని ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం కొప్పుల ఈశ్వర్, ఈట రాజేందర్ లు మంత్రులుగా ఉన్నారు. కేటీఆర్, గంగులను తీసుకుంటే ఈ సంఖ్య నాలుగుకు చేరుతుంది. అయితే, గంగులను ఈటల రాజేందర్ ప్లేస్ లో తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. రాత్రి సీఎం కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో గంగుల కమలాకర్, ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నట్టు సమాచారం. గంగుల కమలాకర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈటల రాజేందర్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. దీంతో ఈటలను తొలగిస్తే.. బీసీ సామాజిక వర్గానికి చెందిన గంగులతో ఆ స్థానాన్ని భర్తీ చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈటల కామెంట్స్ కు టీఆర్ఎస్ నుంచి కౌంటర్ వచ్చినప్పుడే.. ఆయన అనుచరులు ఫుల్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఆయనను మంత్రి పదవి నుంచి తొలగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది. అయితే.. ఈటలను మంత్రి వర్గం నుంచి తొలగించే అవకాశం లేదని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కూడా ఈటల మంత్రి పదవిలోనే కొనసాగుతారని తెలిపారు. దీంతో కేసీఆర్ తన కేబినెట్ నుంచి ఎవరిని తప్పిస్తారనేది సస్పెన్స్ గా మారింది.
మరోవైపు మంత్రివర్గంలో కాత్తగా ఆరుగురికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తొలగింపుపైనా చర్చ నడుస్తోంది. జిల్లాల సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటే కొన్ని మార్పులు అనివార్యంగా సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు మంత్రుల పేర్లపై ప్రచారం జరుగుతుండగా..సమస్యలు ఉత్పన్నమవుతాయని భావిస్తే తొలగింపులను వాయిదా వేసే అవకాశం ఉంది.