సమిధలయ్యేది మాత్రం దళిత బహుజనులే!

1999 కార్గిల్ యుద్ధం తరువాతి కాలంలో పెద్దగా అనుభవంలోకి రాని జాతీయవాద అత్యుత్సాహం పుల్వామా దాడితో ఎగసిపడింది.ఇప్పటివరకు కాశ్మీర్ చూడని విధంగా ఫిబ్రవరి 14 నాడు ఒక ఘోరమైన ఉగ్రవాద దాడి జరిగింది.  పేలుడుపదార్ధాలు నింపిన ఒక వాహనాన్ని ఆత్మహుతి దళ సభ్యుడు జమ్మూ-శ్రీనగర్ రహదారి మీద వెళ్తున్న కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాల కాన్వాయ్ మీదకి తీసుకువెళ్లటంతో నలభై తొమ్మిది మంది పారా మిలటరీ జవానులు మరణించారు. నలభై మంది సైనికులు మరణించినట్లు సి.ఆర్.పి.ఎఫ్ కి చెందిన ఉన్నతాధికారులు ధ్రువీకరించగా గాయాలతో మరో తొమ్మిది మంది తరువాత మరణించారు అని మీడియా ప్రచురించింది.

పుల్వామాలో ఈ రక్తపుటేరుకి కారణం పాకిస్థాన్ అని భారతదేశ ప్రభుత్వం  ఆరోపించింది. దాడి జరిగినప్పటి నుండి దేశంలోని అనేక మహానగరాల వాసులు నిరసన కవాతులు నిర్వహించారు. అలాగే వార్తా ఛానళ్ళు పాకిస్థాన్‌ని ఏ విధంగా శిక్షించాలి అని దీర్ఘంగా, తీవ్రంగా చర్చిస్తున్నాయి.

దాదాపుగా అగ్రకులస్తులే అయిన ఈ పట్టణ మధ్యతరగతి వర్గం వారి ఈ అత్యుత్సాహ జాతీయవాద ప్రదర్శన మాటున దాగున్న ఒక వైరుధ్యాన్ని అతి కొద్ది మంది మాత్రమే గమనించారు- దాడిలో చనిపోయిన వారిలో దాదాపుగా అందరూ నిమ్నకులాల పేదవారే. దాడి జరిగిన తక్షణమే చనిపోయిన నలభై మంది సైనికుల కులాల వివరాలు నేను సేకరించాను. కొంతమంది సైనికుల పేర్లే వారి కులాన్ని తెలియచేయగా, కులాన్ని సూచించని పేర్లు ఉన్న వారి కుటుంబసభ్యుల ఫోన్ నంబర్లు (సి.ఆర్.పి.ఎఫ్ దగ్గర నమోదయిన నంబర్లు) తీసుకుని వారితో మాట్లాడాను. ఆ సైనికుల అంత్యక్రియలని కవర్ చేసిన పాత్రికేయులతో, స్థానిక రాజకీయ నాయకులతో, సామాజిక కార్యకర్తలతో, సామాజిక శాస్త్రవేత్తలతో మాట్లాడి ఈ కుల వివరాలను నిర్ధారించుకున్నాను. పత్రికలలో వచ్చిన కథనాలతో సరిపోల్చుకున్నాను.

ఆ నలభై మంది జవాన్లలో దాదాపుగా అందరూ నిమ్న కులాలకి చెందిన వారే . మొత్తం మీద పంతొమ్మిది మంది వెనుకబడిన తరగతులకి చెందిన వారు, ఏడుగురు షెడ్యూల్డ్ కులాలకి చెందిన వారు, ఐదుగురు షెడ్యూల్డ్ తెగలకి చెందిన వారు, నలుగురు అగ్ర కులాలకి చెందిన వారు, ఒకరు అగ్ర కుల బెంగాలీ, ముగ్గురు జాట్ సిక్కులు, ఇంకొకరు ముస్లిం. అంటే నలభై మందిలో కేవలం అయిదుగురు-అనగా 12.5 శాతం- మాత్రమే హిందూ అగ్రకులాలకి చెందినవారు. ఈ సంఖ్య ఈనాడు భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తున్న ఒక వాస్తవానికి సజీవ సాక్ష్యం: మితవాద గ్రూప్‌ల నాయకత్వంలో నడుస్తున్న పట్టణ మధ్యతరగతి వారి హిందుత్వ జాతీయవాదం అణగారినవర్గాల వారి త్యాగాలని తనకి అనుకూలంగా వినియోగించుకుంటుంది.

చనిపోయిన వారిలో ఇద్దరు సంజయ్ రాజపుత్, నితిన్ శివాజీ రాథోడ్ విముక్త జాతి సమూహానికి చెందినవారు. ఇది సామాజికంగా , విద్యాపరంగా వెనుకబడిన కులం. మహారాష్ట్రకు సంబంధించి కేంద్ర ఓ.బి.సి జాబితాలో ఈ విముక్త జాతి సమూహం ఉంది. వీరిద్దరూ మహారాష్ట్ర వాస్తవ్యులు. సంజయ్ రాజపుత్ కుల ధృవీకరణ పత్రం సంపాదించలేక సి.ఆర్.పి.ఎఫ్‌కు జనరల్ కోటాలోనే ఎంపికయ్యాడు. రాజపుత్, ఇంకొక ముస్లిం జవాను కాక మరో ఎనిమిది మంది-అనగా 20శాతం- మాత్రమే జనరల్ కోటా ద్వారా సి.ఆర్.పి.ఎఫ్ కి ఎంపికయ్యారు.

జనరల్ కేటగిరీ ముస్లింలు వెనుకబడిన తరగతులకి చెందినవారు షెడ్యూల్డ్ కులాలకి చెందినవారు షెడ్యూల్డ్ తెగలకి చెందినవారు
పంకజ్ కుమార్ త్రిపాఠి నాసీర్ అహ్మద్ అమిత్ కుమార్ శ్యాం బాబు వి.వి.వసంత కుమార్
కౌశల్ కుమార్ రావత్   ప్రదీప్ కుమార్ అజిత్ కుమార్ ఆజాద్ హేమరాజ్ మీనా
మోహన్ లాల్   ప్రదీప్ సింగ్ సి. శివ చంద్రన్ విజయ్ సోరెంగ్
వీరేంద్ర సింగ్   విజయ్ కుమార్ మౌర్య బబ్లూ సంతరా మానేశ్వర్ బాసుమాతరి
సుదీప్ బిశ్వాస్   రమేష్ యాదవ్ ప్రసన్న కుమార్ సాహూ తిలక్ రాజ్
కుల్విందర్ సింగ్   మహేష్ కుమార్ మనీందర్ సింగ్ అత్త్రి  
జైమల్ సింగ్   జీత్ రామ్ రామ్ వకీల్  
సుఖ్జిందర్ సింగ్   రోహితాష్ లాంబ    
    నారాయణ్ లాల్ గుర్జర్    
    అవదేశ్ కుమార్ యాదవ్    
    భగీరధ్ సింగ్    
    నితిన్ శివాజీ రాథోడ్    
    సంజయ్ రాజపుత్    
    సుబ్రమణియన్. జి    
    మనోజ్ కుమార్ బెహరా    
    రతన్ కుమార్ ఠాకూర్    
    సంజయ్ కుమార్ సిన్హా    
    అశ్విని కుమార్    
    హెచ్.గురు    

ఈ నలభై మంది పదహారు రాష్ట్రాల నుండి వచ్చారు. జనరల్ కేటగిరీకి చెందిన ఎనిమిది మందిలో ఐదుగురు పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకి చెందినవారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరిలో ఒకరు బ్రాహ్మణుడు, మరొకరు రాజపుత్. పంజాబ్ కి చెందిన నలుగురిలో ముగ్గురు జాట్ సిక్కులు. అగ్రకులాలకి చెందిన మిగతా ముగ్గురిలో ఇద్దరు ఉత్తర ప్రదేశ్ బ్రాహ్మణులు, మరొకరు పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుదీప్ బిశ్వాస్. సుదీప్ బిశ్వాస్ బావమరిది సమప్తా బిశ్వాస్ నాకు చెప్పింది ఏంటంటే వారి కుటుంబం అటు బ్రాహ్మలు కాదు, ఇటు షెడ్యూల్డ్ కులామూ కాదు కానీ అగ్రకులమే అని.

“బిశ్వాస్” అనే పేరు వివిధ కులాల వారు వాడతారు కాబట్టి తమ కుటుంబం కుల వివరాలని సమప్తా బిశ్వాస్ పని కట్టుకుని చెప్పాడు. తను, మిగతా కుటుంబ సభ్యులు పశ్చిమ బెంగాల్ లోని నదియా జిల్లాలో దినసరి కూలీలు అని పేర్కొన్నాడు. కొన్ని కొన్ని సార్లు తమ కుటుంబం పనికోసం నదియా బయటకి వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయని, అలాంటి ఆర్ధిక ఇబ్బందులప్పుడు సుదీప్ జీతమే తమకి ఆసరా అని సమప్తా పేర్కొన్నాడు.

పంజాబ్ రాష్ట్రానికి చెందిన నాలుగో సైనికుడు మనీందర్ సింగ్ అత్త్రి. మనీందర్ షెడ్యూల్డ్ కులం రామదాసియా గణానికి చెందినవాడు. అత్త్రి కుటుంబానికి పావు ఎకరం కన్నా తక్కువ భూమి ఉంది, అతని తమ్ముడు కూడా సి.ఆర్.పి.ఎఫ్ లోనే పని చేస్తున్నాడు అని అత్త్రి బంధువు సునీల్ దత్ పేర్కొన్నారు. “ వనరులు, సామాజిక భద్రత లేక దళితులు ప్రమాదంతో కూడుకున్న ఉద్యోగాలు అయినటువంటి రక్షక దళాలలో, పారిశుధ్య పనిని ఎంచుకుంటున్నారు” అని పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో దినానగర్ ప్రాంతంలో నివసిస్తున్న మానహక్కుల కార్యకర్త సునీల్ దత్ పేర్కొన్నాడు. “జాతీయవాద నినాదాలు ఇచ్చేవారందరూ సౌకర్యవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. వారి పిల్లలకి దేశం కోసం ఇటువంటి త్యాగాలు చేసే అవసరమే లేదు. ఇది విడ్డూరంగా లేదూ?” అన్నాడతను.

భద్రతా దళాల్లో చేరే జాట్ సిక్కులు కూడా సన్నకారు రైతులు అవ్వటం వల్లన జీవనోపాధి చూసుకోవలసిన ఒత్తిడితో ఈ ఉద్యోగాన్ని ఎంచుకుంటున్నారు అని సునీల్ దత్ చెప్పాడు. ఈ దాడిలో మరణించిన పంజాబ్ కి చెందిన జాట్ సిక్కు కుల్విందర్ సింగ్ పరిస్థితి దత్ మాటలకి సజీవ సాక్ష్యం. తమ కుటుంబానికి రెండు ఎకరాల భూమి కూడా లేదు అని కుల్విందర్ సింగ్ తండ్రి దర్శన్ పేర్కొన్నారు. “కుల్విందర్ తల్లి ఆరోగ్యం అసలేమి బాగోలేదు” అని దర్శన్ చెప్పాడు.

ఒక పక్క దేశం అంతా జాతీయవాద అత్యుత్సాహంతో అట్టుడుకుతోంది. మరొకపక్క అమర జవాన్ల కుటుంబసభ్యులు కొందరు తమ బాధని, కష్టాలనూ దేశం తొందరలోనే మరచిపోతుందని భయపడుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌, కాన్పూర్ దేహాట్‌కి చెందిన అమర జవాను శ్యాంబాబు షెడ్యూల్డ్ కులానికి చెందినవాడు. అతని భార్య రూబీ దేవి. నేను ఆవిడతో మాట్లాడినప్పుడు భావోద్వేగాలతో ఆవిడ గొంతు పట్టుకుపోయింది. ‘దాడి జరిగిన తరువాత రెండు రోజుల పాటు సందర్శకులు వస్తూనే ఉన్నారు, కానీ ఇప్పుడు ఇల్లు ఖాళీగా ఉంది అని, నా దుఃఖాన్ని మొయ్యటానికి ఇప్పుడు నేనొక్కదాన్నే మిగిలాను’ అని రూబీ దేవి చెప్పింది. సి.ఆర్.పి.ఎఫ్ సైనికుల త్యాగాన్ని మరువము అని జాతీయ నాయకుల చేసిన వాగ్దానం గురించి ప్రస్తావించినపుడు ఆవిడ ఇలా అన్నారు- ‘చెప్పటానికి చెయ్యటానికి చాలా తేడా ఉంది’.

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ జిల్లాలో తులిధర్ గ్రామానికి చెందిన మహేష్ కుమార్ కుటుంబానికి కూడా ఇదే అనుభవం. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం సహాయ మంత్రి అనుప్రియా పటేల్, ఉత్తరప్రదేశ్  మంత్రి రీటా బహుగుణ దాడి జరిగిన తరువాత కుటుంబాన్ని కలవటానికి వచ్చారని మహేష్ బంధువు సుశీల్ కుమార్ యాదవ్ చెప్పాడు. కానీ దేశం మొత్తం అటు తరువాత  వీధులలో నినాదాలు ఇవ్వటంలో మునిగిపోయింది. “వాళ్ళని మేము ఆపలేము. మాకు మునగటానికి మా దుఃఖమే మిగిలింది ఇక” అని సుశీల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

తులిధర్ గ్రామం పేరు మార్చి మహేష్ కుమార్ పేరు పెట్టడం, అతని తమ్ముడు అమ్రేష్‌కి ఉద్యోగం ఇవ్వటం రాష్ట్ర ప్రభుత్వం కనీసం చెయ్యగలిగిన పనులు అని సుశీల్ కుమార్ యాదవ్ అన్నాడు. “అలహాబాద్ పేరు ప్రయాగ్ రాజ్ గా మార్చినప్పుడు ఈ గ్రామం పేరు మహేష్ గ్రామం గా ఎందుకు మార్చలేరు? తన జ్ఞాపకాలని సజీవంగా ఉంచడానికి అదే ఉత్తమ మార్గం. పుల్వామా అమరవీరులని మరవబోము అని వాళ్ళేగా చెబుతుంది?” అని సుశీల్ కుమార్ యాదవ్ అన్నాడు.

పుల్వామలో మరణించిన నలభై మందిలో పన్నెండు మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. అందులో ఇద్దరు బ్రాహ్మలు, ముగ్గురు షెడ్యూల్డ్ కులానికి చెందినవారు, ఏడుగురు వెనుకబడిన తరగతులకి చెందినవారు. “టి.వి ఛానళ్ల గుండెలు బాదుకునే జాతీయవాదం మరుగునపెట్టే గంభీరమైన సత్యం ఏమిటంటే దేశాన్ని కాపాడటానికి చనిపోయేది గ్రామీణ భారతానికి చెందిన వ్యవసాయ, నిమ్న కులాల వారే” అని సమాజవాది పార్టీ అధికార ప్రతినిధి సుధీర్ పన్వర్ పేర్కొన్నారు.

మిగతా రాష్ట్రాలకు కూడా పన్వర్ వ్యాఖ్యలు వర్తిస్తాయి. రాజస్థాన్ కి చెందిన ఐదుగురు సి.ఆర్.పి.ఎఫ్ సైనికులు దాడిలో మరణించారు. అందులో ముగ్గురు గుజ్జర్లు, ఒకరు షెడ్యూల్డ్ తెగ అయిన మీనా తెగకి చెందిన వారు, మరొకరు జాట్. తమిళనాడుకు చెందినా ఇద్దరు సైనికులలో ఒకరు పరయర్ అనే షెడ్యూల్డ్ కులానికి చెందిన వారు కాగా మరొకరు తేవర్ అనే వెనుకబడిన తరగతులకి చెందిన వారు. కర్ణాటకకు చెందిన ఒకరు రజక కులానికి చెందినవారు. ఒడిశాకి చెందిన ఇద్దరిలో ఒకరు వెనుకబడిన తరగతులకి చెందినవారు కాగా మరొకరు షెడ్యూల్డ్ కులానికి చెందినవారు.

“సి.ఆర్.పి.ఎఫ్ లో రిజర్వేషన్లు ఉన్నాయి” అని మీరట్ కి చెందిన విద్యావేత్త, దళిత కార్యకర్త అయిన సతీష్ ప్రకాష్ పేర్కొన్నారు.” ఆ కారణంగానే చనిపోయిన వారిలో అత్యధికులు బహుజన కులాలకి చెందినవారు.” బహుజన్ అంటే అత్యధికులు అని అర్థం. అగ్రకులాలకి చెందని వారి గురించి చెప్పేటప్పుడు ఈ పదం వాడతారు. “దేశం కోసం ప్రాణాలు అర్పించేది వారే” అని సతీష్ ప్రకాష్ అన్నారు. “ సైనిక దళాలలో రిజర్వేషన్లు అమలు చెయ్యకపోవడానికి చెప్పే వాదన ఎంత బూటకమో ఇది తెలియచేస్తుంది.”

“హిందుత్వ జాతీయవాదానికి రాజకీయాలలో ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఇటువంటి కుల, వర్గ సమీకరణాలను అది మరుగున పడేస్తుంది” అని అమృతసర్ లోని గురు నానక్ దేవ్ విశ్వవిద్యాలయంలో సోషియోలజీ ఆచార్యులు అయిన పరంజీత్ సింగ్ జడ్జ్ అన్నారు. “ ఎన్నికల రాజకీయాలలో జాతీయవాదం పోషించే పాత్ర ఒకటుంది. దళితులు తమతో లేరు అన్న విషయం భారతీయ జనతా పార్టీకి తెలుసు. అందుకే ఇటువంటి అతిశయోక్త జాతీయవాదాన్ని నిర్మిస్తే కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా ప్రజలను తమ వైపు లాక్కోవచ్చు.”

పుల్వామాలో చనిపోయిన వారి కుల, వర్గ నేపధ్యం గురించి బిజెపి ఇప్పటి వరకూ ఏమి మాట్లాడలేదు. మాట్లాడే అవకాశం కూడా లేదు- ఎన్నికల సంవత్సరంలో జాతీయవాదం అనే పాటకి బాణీ కట్టడానికే ఆ పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది.

అజాజ్ అష్రాఫ్

కారవాన్ మ్యాగజైన్ సౌజన్యంతో