సంక్రాంతి రేస్ లో ఉన్న డబ్బింగ్ సినిమాకి థియేటర్లు దొరకలేదని, కొంతమంది మాఫియాగా మారి చిన్న సినిమాలని-డబ్బింగ్ సినిమాలని తొక్కేస్తున్నారని అశోక్ వల్లభనేని బాహాటంగానే విమర్శించారు. నిజానికి పెద్ద సినిమాల విడుదల ఉన్న ప్రతిసారి, చిన్న సినిమా నిర్మాతల నుండి వచ్చే మొదటి మాట ఇదే. అయితే అసలు నిజంగానే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు దిల్ రాజు, అల్లు అరవింద్, యువి క్రియేషన్స్ చేతిలో మాత్రమే ఉన్నాయా? వాళ్లే వేరే చిత్రాలకి థియేటర్స్ ఇవ్వట్లేదా? అసలు వాస్తవం ఒకసారి చూద్దాం
తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రా, తెలంగాణలో మొత్తం సింగిల్ స్క్రీన్లు, మాట్లిప్లెక్స్ లు అన్నీ కలిపి 1170 థియేటర్లు ఉన్నాయి, నిజానికి ఒకప్పుడు ఇంతకన్నా ఎక్కువే ఉన్నా కూడా కంటెంట్ లెస్ సినిమాలు రావడంతో బయ్యర్లు, థియేటర్ ఓనర్లు చాలా మంది నష్టపోయి థియేటర్లని ఎత్తేశారు. అలా మిగిలిన ఈ 1170లో అల్లు అరవింద్ కి నైజాం, తూర్పు గోదావరి, కృష్ణ జిల్లాల్లో మొత్తం 18-19 థియేటర్లు ఉన్నాయి, ఆ తర్వాత యువి క్రియేషన్స్ కు గుంటూరు-సీడెడ్ లో కలిపి 35 థియేటర్లు ఉన్నాయి. అందరూ ఆరోపిస్తున్న ఈ నిర్మాతల మాఫియాలో కుటుంబ కథా చిత్రాల నిర్మాత అయిన దిల్ రాజుకు నైజాం- వైజాగ్ కలిపి అత్యధికంగా 60 థియేటర్లు ఉన్నాయి. తన సినిమాని తానే నిర్మించి, సొంతగా విడుదల చేసుకునే నిర్మాతకి 60 థియేటర్లు ఉండడమేంది అనేది చాలా చిన్న విషయం, పైగా దిల్ రాజు కెరీర్ ప్రారంభం అయ్యిందే డిస్ట్రిబ్యూటర్ గా కాబట్టి అతని దగ్గర ఎక్కువ సంఖ్యలో థియేటర్స్ ఉండడం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన విషయమేమి కాదు. ప్రొడ్యూసర్స్ తర్వాత ఈ లిస్ట్ లో ఎక్కువ థియేటర్లు ఉన్న వ్యక్తి సునీల్ నారంగ్. ఏషియన్ సినిమాస్ అధినేత అయిన సునీల్ నారంగ్ కి కేవలం నైజాంలోనే 170 పైగా థియేటర్లు ఉన్నాయి, సింపుల్ గా చెప్పాలి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద ఉన్న 1170 థియేటర్లలో ఓనర్స్ ఉన్నది 285 వాటికీ మాత్రమే, అంటే మొత్తం సంఖ్యలో అది 20 శాతం మాత్రమే. వీరికి తప్ప సొంతంగా పెద్ద సంఖ్యలో థియేటర్స్ ఉన్న వాళ్లు లేరు, మిగిలిన వాళ్లలో 400 మంది లీజుకి తీసుకొని థియేటర్లని రన్ చేస్తున్న వారే, వీరిలో నాగార్జున – సాయి కొర్రపాటి – ఎన్ వి ప్రసాద్ – సత్యనారాయణ – సీడెడ్ బ్రహ్మం ఇలా పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటాయి. వీరి తర్వాత సింగిల్ థియేటర్ల ఓనర్లు ఉండనే ఉన్నారు.
నిర్మాతల మాఫియాలో ఉన్న 285 వదిలేసినా , లీజుకి తీసుకోని నడిపిస్తున్న 400 థియేటర్లు వదిలేసినా కూడా ఇంకా దాదాపు సగం థియేటర్లు ఎవరి కంట్రోల్ లేకుండా ఉన్నాయి. చిన్న సినిమాలు, మంచి సినిమాలు వచ్చి ప్రేక్షకులని మెప్పిస్తే, ఆ చిత్రాలని కాపాడడానికి ఎప్పుడూ ముందుండే థియేటర్లు ఇవే. అర్జున్ రెడ్డి, rx 100 లాంటి సినిమాలు భారీగా లాభాల బాటలో నడిచాయంటే దానికి కారణం కూడా ఇవే. సరైన సినిమా తీసి, మంచి ప్రొమోషన్స్ చేస్తే ప్రేక్షకుల దృష్టిలో సినిమా పడుతుంది, బయ్యర్ల కంటికి బొమ్మ కనిపిస్తుంది, థియేటర్లు వాటంతట అవే వస్తాయి అంతే కానీ నాసిరకం సినిమాలు తీసి, విడుదల కష్టాలు పడుతూ, శాటిలైట్ రైట్స్ కోసం ఎక్కడో ఒక చోటైనా రిలీజ్ చేయాలని ట్రై చేసి, అది కుదరకపోతే నిర్మాతల మాఫియా, తోక్కేస్తున్నారు అనే మాటలు బయటకి వస్తాయి. సినిమాలో విషయం ఉంటే ఎవరు ఆపినా ఆగదు, అది గమనించి విమర్శిస్తే బాగుంటుంది. పోనీ అంత దూరం ఎందుకు సంక్రాంతి వరకే మాటాడుకుంటే, దిల్ రాజు చెప్పినట్లు జనవరి రేస్ లో ఉన్న చిత్రాలన్నీ ముందే విడుదలని ప్లాన్ చేసుకోని థియేటర్స్ పంచుకొని, వాటికి తగ్గట్లు బిజినెస్ చేసుకున్నాయి. ఇప్పుడు ఉన్న పళంగా సూపర్ స్టార్ సినిమా వస్తుంది, ఇక్కడ ఎంత పోటీ ఉన్నా కూడా మా సినిమాకి థియేటర్స్ ఇవ్వట్లేదు అంటే ఎలా? ప్రతి చిత్ర పరిశ్రమకి స్ట్రెయిట్ సినిమాలే ముఖ్యం, అవి ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది, డబ్బింగ్ సినిమాల వలన మన వాళ్లకి పెద్దగా ఒరిగేదేమి లేదు, వారు కట్టే పన్ను శాతం కూడా చాలా తక్కువ, కాబట్టి మన చిత్రాలని కాదని, స్ట్రెయిట్ సినిమాలని దాటి డబ్బింగ్ సినిమాకి థియేటర్లు ఇవ్వమని అడగడం ఎంత వరకూ కరెక్ట్ అనేది అలా అడుగుతున్న వారికే తెలియాలి. ఒకవేళ సంక్రాంతి రేస్ లో ఉన్న డబ్బింగ్ సినిమాకి నిజంగానే అంత సత్తా ఉంటే, పండగ అయిపోయిన తర్వాత పుంజుకునే మొదటి సినిమా అదే అవుతుంది.
అన్నింటికీ మించి ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది, అదేంటి అంటే ఒక సినిమా విడుదల స్థాయి ఎప్పుడు ప్రేక్షకుడిని ఎంత వరకూ ఆకట్టుకున్నారు, సినీ అభిమానుల్లో ఆ పర్టికులర్ మూవీపై ఎంత ఆసక్తి ఉంది, సినిమాని కొంటే అది లాభాలు తెస్తుందా లేక నష్టాలు మిగిలిస్తుందా అనే దానిపైనే థియేటర్లు కేటాయించబడుతాయి. బయ్యర్లు సినిని కొనడానికి కూడా డేర్ చేస్తారు, రీసెంట్ గా కేరాఫ్ కంచరపాలెం లాంటి సినిమా అంత మందికి రీచ్ అయ్యిందంటే దానికి కారణం సురేష్ బాబే. ఒక మంచి సినిమా అందరినీ మెప్పిస్తుంది అనే నమ్మకం థియేటర్ ఓనర్లకి, లీజుకి తీసుకున్న వారికి కలిగిస్తే వారే స్వయంగా ముందుకొచ్చి సినిమాని రిలీజ్ చేస్తారు. అయినా సినిమా ఆడుతుంది, డబ్బులు వస్తాయి అంటే ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. అంతెందుకు దిల్ రాజు కొన్ని సార్లు తాను నిర్మించిన సినిమాల కన్నా కొన్న సినిమాలనే ఎక్కువ థియేటర్లలో విడుదల చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, కాబట్టి ఇక్కడ అందరికీ కావాల్సింది డబ్బే, మంచి సినిమా చేసి ప్రేక్షకులని మెప్పించు, డబ్బులు సంపాదించుకో…