NewsOrbit
వ్యాఖ్య

మహాస్వప్నం!

మరణం తర్వాత ఒక కవి పయనం ఎటు వైపు? బహుశా తీరని తన కలల తీరంలో అతను విహరిస్తాడు కాబోలు. అక్కడేముంటాయి? సముద్రం నిద్రపోతూ వుంటుందా? ఆ సముద్రం మీద కలలా ఆ కవి వాలతాడా? అతనే అలై కదులుతాడా? అసలు కవికి మరణం వుంటుందా? ఒక కవి ఉండడానికి లేకపోవడానికీ తేడా ఏమిటి? అతను భౌతికంగా ఉన్నాడని మనకు ఎలా వుంటే అనిపిస్తుందో అలా ఉన్నప్పుడు చూసిన ప్రపంచం, అతను లేనప్పుడు అతను వెళ్ళిన చోట  అతనికెలా కనిపిస్తుంది? అతనిలా అంతకు ముందే అక్కడకు చేరుకున్న వారు కేవలం రెక్కలుగా మాత్రమే గాల్లో ఎగురుతూ అతనికి స్వాగతం పలుకుతారా? చుక్కలు కరిగి కరిగి అతన్ని స్నానించి వెన్నెల వస్త్రం చుట్టి చుట్టూ మూగి పాటలు పాడతాయా? అతనక్కడ ఏమైనా రాస్తాడా పాడతాడా? మాట్లాడతాడా? ఈమధ్యనే చనిపోయిన మహాస్వప్న గురించి ఆలోచించినప్పుడల్లా ఇలాంటి ఆలోచనలే వస్తున్నాయి.

తెలుగు కవిత్వ చరిత్రలో దిగంబర యుగం భూమ్యాకాశాలు ఒక్కటై చప్పట్లు కొట్టిన నిప్పుల కాలం. ఆ ఆరుగురిలో అతి తక్కువ రాసి అతి ఎక్కువగా కవిత్వ ప్రేమికుల హృదయాల మీద ఆరని అగ్ని సంతకం చేసిన వాడు మహాస్వప్న. దిగంబర కవులు వేసిన మూడు సంపుటాలలో మహాస్వప్న రాసినవి ఆరు కవితలు మాత్రమే. కట్టలు కట్టలు కవిత్వాలెందుకురా అని అందరి మీదా విరుచుకుపడ్డానికి అవి చాలు. అతని అసలు పేరు కమ్మిశెట్టి వెంకటేశ్వర్రావట. మనకెందుకు? ఎవరెవరికో ఏవేవో పేర్లుంటాయి. ప్రపంచమంతా మనుషులకు ఓదో ఒక పేరుంటుంది. మనకు కావాల్సింది మహాస్వప్న పేరు ఒక్కటే.  ఊరు లింగసముద్రం. ప్రకాశం జిల్లా. ఏముందిలే అందిరికీ ఒక ఊరు, ఒక జిల్లా ఒక దేశం ఉంటాయి కదా. ప్రపంచంలో ప్రతి ఊరి మట్టి మీదా ఒక కవి పేరుంటుంది కదా. అది మహాస్వప్న మాత్రం ఎందుకు కాకూడదు? అసలే భూగోళాన్ని తన శిశ్నశిఖరాగ్రం మీద నిలబెట్టిన మొనగాడికి ఈ పేర్లతో పెద్ద పనేముంది?

సరే. ఇంతకీ మహాస్వప్న ఎక్కడికి వెళ్ళినట్టు? అతని కుటుంబీకులది ముత్యాల వ్యాపారమట. ఏ ముత్యాలు ఏరుకు రావడానికి ఏ గ్రహానికి వెళ్ళాడు? అక్కడ కూడా కనిపించి గోళాలన్నీ అతనితో ఆడుకుంటాయా? అతనిలో ఆ భాగం మీద తమ సంతకాలు భద్రపరుస్తాయా? ఎందుకింతగా ఆయన్ని తలుచుకోవాలి? మానవత్వం రెండు కళ్ళూ మూసుకుపోయినప్పుడు అతను మూడో కన్నయి విప్పుకున్నందుకా..? కాలం వాయులీనం మీద కమానై..చరిత్ర నిద్రా సముద్రం మీద తుపానై దిగంబర కవిలా, రాత్రి ఉదయిస్తున్న రవిలా మన హృదయాల మీద  నర్తించినందుకా? అవును అందుకే గుర్తుంచుకోవాలి. స్మరించుకోవాలి. లక్షోపలక్షల అక్షరాలు రాక్షస పాదాలై మనల్ని తొక్కిపారేస్తున్నప్పుడు నేనున్నానని ఒక కవి కౌగలించుకున్నందుకు తలుచుకోవాలి. ఆ ఆరుగురూ దిగంబరులై రావాల్సిన అవసరం ఏమొచ్చిందప్పుడు? కొత్త పదాలతో కొత్త మాటలతో కొత్త డిక్షన్ తో అడ్డదిడ్డంగా సమాజం మీద విరుచుకుపడాల్సిన పనేమొచ్చింది? నీతి బూతులై..బూతులు నీతులై అవే లోక ఖ్యాతులై చలామణి అవుతున్నప్పుడు ఒక కవి చౌడప్ప వచ్చాడు. కనిపిస్తున్నదంతా అబద్ధమై..అబద్ధమే సత్యమై..అకృత్యాలు అవినీతులు అసమానతలు అసహజాలు అన్యాయాలు సమస్త మాలిన్యాలు నాగరీకంగా నాజూకుగా గౌరవంగా మర్యాదగా పట్టు పీతాంబరాలతో ఊరేగుతున్నప్పుడు దిగంబర కవి వచ్చాడు. దేశదేశాల సుఖవ్యాధి పుండ్లతో చీడపురుగులు నిండిన మేడిపండ్లతో భూమి వెలయాలై పతితయై, భ్రష్టయై పుచ్చి గబ్బుకంపు కొడుతున్నప్పుడు మరణించిన దేవుడికి ప్రాణం పోసేందుకు పుట్టాడు దిగంబర కవిలా మహాస్వప్న. మనిషీ మనిషీ అని పిలిచాడు. భగవంతుడు చచ్చిపోయాడని ఏడ్చాడు. నల్లుల్నీ బల్లుల్నీ రక్తం పీల్చే జలగల్నీ పిశాచాల్నీ నిశాచరుల్నీ నలిపి నలిపి మట్టిలో కలిపేయడానికి పుడుతున్నా పుడుతున్నా కడుపు రగిలి..పుడమి పగిలి పుడుతున్నానని పెనుకేక వేసుకుంటూ వచ్చాడు. అందుకే మహాస్వప్న మనకిష్టం. మనం నమ్ముతున్న నాగరికతలు నాగరికతలు కాదు. సంస్కారాలు సంస్కారాలు కాదు. నీతులు నీతులు కాదు. రాజ్యాలు రాజ్యాలు కాదు. ఎన్నికలు..చట్టసభలు..చట్టాలు..కోర్టులు..రక్షకభటవర్గాలు మనవి కాదు మనవి కాదు. మనం మనుషులం కాదు. మనకింకేదో పేరుంది అంటూ మహాస్వప్న అరిచి అరిచి కవిత్వమై సొమ్మసిల్లిపోయినందుకు ఇప్పుడాయన్ని కలవరించాలి. ఈ కుహనా నాగరికతకు మానభంగం చేయడానికి అతను సర్వసన్నధ్ధమైనందుకు సంబరపడాలి. ఎన్ని అభినయాలు మనవి? ఎన్ని వేషాలు మనవి? ఎన్ని మాయామేయ మోసావేశ అహంకారాభినివేశాలు మనవి? మనం నటసామ్రాట్టులమైపోయాం కదా. చిలకపలుకులు మానుకోమన్నాడు. అభినయాలు నక్క వినయాలు కట్టిపెట్టమన్నాడు. బట్టలు విప్పేస్కోమన్నాడు. ఈ నాటకానికింక తెరజారింది. ఈ జీవితం మీద నగ్న సూర్యోదయమైంది భయం వీడమన్నాడు. నగ్నంగా బజార్లోకి రమ్మన్నాడు. వచ్చామా?లేదే. నటనలు వీడామా? లేదే. ఇంకా ఇంకా మరెంతో చాకచక్యంగా చకచకా నటనోన్మత్త నత్తలమై జీవించడం లేదా?

మహాస్వప్న అందుకే ఎక్కడికి వెళ్ళాడు అని ఇప్పుడాలోచిస్తున్నా. దిగంబర కవులు ఆవిర్భవించిన అయిదున్నర దశాబ్దాల క్రితం కంటె ఇంకా ఇంకా పతనోన్ముఖంగా సిగ్గు లజ్జా లేని అభినయాలతో మనుషులనబడే ఈ జాతి జీవించడం లేదా? ఏమన్నాడు మహాస్వప్న? మన మొహాల్ని చూడలేనన్నాడు. మాంసపు గుహల్లోంచి, దుర్గంధ వీర్యంతో తడిసిన శతాబ్దాల మీంచి, ఇంక మోయలేను ఈ దేవుళ్ళనీ, ఈ ఉద్గ్రంథాలనీ, ఇంక మోయలేను ఈ జైళ్ళనీ, సంకెళ్ళనీ, శాసనాల్నీ అని కొరడా పట్టుకుని భూగోళం వీపు మీద ఛళ్ళు ఛళ్ళున చరుచుకుంటూ వెళ్ళిపోయాడు. మల్లెపూల మీద మందహాసాల మీద వాంతి చేసుకున్నవాడు, రాజకీయాల్లో ధర్మశాస్త్రాల్లో వీర్యస్ఖలనం చేసుకున్నవాడు, వెన్నెల మీద ఉమ్మేసి చంద్రుణ్నీ,నక్షత్రాల్నీ , గ్రహాల్నీ రాళ్ళతో కొట్టిన వాడు ఎటు వెళ్ళి వుంటాడు? తప్పకుండా మనుషులు మాత్రం లేని మహాకాంతి గోళానికే చేరుకుని వుంటాడు. అభినయాలు అక్కర్లేని, నవ్వుల గాజు పూల అలంకరణలు అవసరం లేని, కనిపించని గోళ్ళతో ఒకరినొకరు పీక్కు తినే పీడకలలు రాని కాలంలోకి, పెత్తనాలు..ఆయుధాలు..రక్షక వలయాలు మచ్చుకైనా లేని మాయదారి వస్త్రాలు లేని లోకంలోకి వెళ్ళి ఉంటాడు. అక్కడ సరికొత్తగా ఈ ఆకారం లేని ఈ వికారాలు లేని మరో మానవ సృష్టిలో నిమగ్నమై వుంటాడు. ఒక కవి ఎందుకు మరణిస్తాడు? బతుకంతా మరణించడమే అయిన చోట కొత్తగా మళ్ళీ ఎలా మరణిస్తాడు. ఇంకో గ్రహం మీద ఫీనిక్స్ లా మళ్ళీ లేస్తాడు. మహాస్వప్న ఆ కొత్త గ్రహం మీద నిలబడి తన పవిత్ర మూత్రంతో ఈ భూగోళాన్ని అభిషేకిస్తాడు. జీవితమంతా రాత్రిలా రాత్రంతా బీటు పోలీసులా కాపలా కాసి కాసి అలిసిపోయాడు పాపం. ఇక అక్కడ కొన్ని యుగాల పాటు విశ్రమిస్తాడు. నిద్రలోనూ మనం కాని మనకోసం మరో కొత్త కల రచిస్తాడు.

డా.ప్రసాదమూర్తి 

( జూన్ 25న కనుమూసిన మహాస్వప్న కోసం)

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment