NewsOrbit
వ్యాఖ్య

చిత్ర విచిత్ర సారంగం!

సంస్కృత భాష చాలా  విచిత్రమైనది. ఒక్కో మాటకు అనేక అర్థాలు ఉండడం ఆ భాషలో సహజం. ఉదాహరణకు “సారంగ” శబ్దమే తీసుకోండి- ఆ మాటకు నిఘంటువులు ఇచ్చిన అర్థాల్లో పోలికే కనబడదు! సారంగమంటే కృష్ణ జింక; సారంగమంటే ఏనుగు; సారంగమంటే సింహం; సారంగమంటే తుమ్మెద; సారంగమంటే వానకోయిల- అనగా ఒకరకం పాము; సారంగమంటే చాతక పక్షి; ఇక సారంగమంటే నానార్ధాలూ, పర్యాయపదాల జాబితా చూస్తే కొన్ని వేల శబ్దాలను చూపిస్తున్నాయి నిఘంటువులూ, పదకోశాలూను.
ఒక్కమాటకి వేల అర్థాలూ, ఒకే మనిషిలో వంద వ్యక్తిత్వాలూ ఇమిడివుండడం ఈ పుణ్యభూమికి తెలియని విషయమేమీ కాదు.
సీతా మహాసాథ్వీని బలవంతంగా ఎత్తుకుపోయి, లంకలో దాచిపెట్టిన రావణుడు, సాక్షాత్తు బ్రహ్మ! ఆయన చేతనే రాములవారు యుద్ధానికి ముహూర్తం పెట్టించుకున్నారని చెప్తారు.
పంచవటిలో సీతను రావణుడు ఎత్తుకుపోయినప్పుడు వలవల విలపించిన అవతారపురుషుడు రాముడే, ఆ మహాతల్లి శీలాన్ని శంకించి అడవులకు పంపేశాడు.
ఈ రామాయణమంతా కావ్యంగా రాసిన వాల్మీకి ఒకప్పుడు దార్లు కొట్టి బతికిన గజదొంగ!
తోబుట్టువును ప్రాణప్రదంగా ప్రేమించిన కంసుడే, ఏడుగురు మేనల్లుళ్లను, పొత్తిళ్ళలో ఉండగానే పొట్టన పెట్టుకున్నాడు!
ధర్మదేవత ముద్దుబిడ్డగా ప్రసిద్ధుడైన ధర్మరాజు, పట్టపురాణిని జూదంలో పందెంగా ఒడ్డాడు! కురుక్షేత్రంలో “అశ్వద్ధామ హతః – కుంజరః” అని ప్రకటించాడు!
సంస్కృత పంచ మహాకావ్యాల్లో మూడు రాసిన “పుంభావసరస్వతి” మహాకవి కాళిదాసు వెర్రివాడైన పశులకాపరి!
గాథాసప్తశతి సంకలించిన శాతవాహన చక్రవర్తి హాలుడు నాగరికతా, నాజూకు తెలియని “ప్రాకృతికుడు”!

ఇవన్నీ “భారతీయ చరిత్ర”కెక్కిన విషయాలే!

కేంద్ర కేబినెట్ లో సూక్ష్మ, మధ్యతరహా వాణిజ్య సంస్థలు – పశుసంవర్ధక శాఖల సహాయ మంత్రిగా ఇటీవలే నియమితులైన ప్రతాప్ చంద్ర సింగ్ సారంగి కూడా ఇలాగే విభిన్న వ్యక్తిత్వాల సమ్మేళనమే.  సారంగ శబ్దానికి చెప్పే అర్థాల్లో ఉన్నంత వైవిధ్యం కాకున్నా, మనలాంటి సామాన్యులకు మతిపోగొట్టగల వైవిధ్యం ఆయన సొంతం. పొడుగాటి గెడ్డంతో, చూడ్డానికి గురూజీ గోల్వాల్కర్ను తలపిస్తూ వుంటారు సారంగీజీ. కోట్ల రూపాయల ఖరీదు చేసే సూటూ బూటూతో అట్టహాసంగా వుండే మోడీజీకి పూర్తి విరుద్ధంగా అత్యంత నిరాడంబరంగా ఉంటారు సారంగీజీ.  గతంలో ఒడిశా చట్టసభ సభ్యుడిగానూ, ప్రస్తుతం ఎంపీ గానూ, ప్రజాజీవితంలో ఉంటున్న సారంగీజీ విమర్శలను సహించలేని ఫైర్ బ్రాండ్ హిందుత్వ వాది. తనను విమర్శించే వాళ్ళెవరికీ పనీపాటూ లేవని -మంత్రిగా మన రాజ్యాంగ చట్టంపై ప్రమాణం చేసిన  తర్వాతనే – సారంగీజీ వ్యాఖ్యానించడం విశేషమే. కొసమెరుపు ఏమిటంటే మంత్రిపుంగవులకి తెలిసిన భాషల పేర్లడిగితే  సారంగీజీ సంస్కృతం ఒక్క దాని గురించే చెప్పడం! ఇంతకీ ఆయన సదరు సంస్కృతం ఎక్కడా చదువుకోలేదట! అయినా మన పిచ్చిగానీ, ఈ దేశంలో పుట్టిన హిందుత్వ వాదికి వేరెవరో సంస్కృతం నేర్పించాలా?
సంస్కృతం తప్ప మరే భాషా తెలియకపోయినా, సారంగీజీ సోషల్ మీడియాలో హీరో ఇమేజ్ సంపాదించుకో గలగడం మరో పెద్ద విశేషం. అన్నిటికీ మించిన కళ  ఒకటి ఆయనలో ఉన్నందువల్లనే సారంగీజీ కేంద్రమంత్రి పదవి  దాకా ఎగబాకగలిగారు.  ఆ కళారూపం పేరు మోడీ భజన! కొన్ని మచ్చు తునకలు మనవి చేసుకుంటున్నా చూడండి.
1 . చైనా-పాకిస్తాన్- శ్రీలంక- మయాన్మార్ లాంటి దేశాలు ఒకప్పుడు మనల్ని వణికించేవి; ఇప్పుడు మనల్ని చూసి అదురుకుంటున్నాయి- అదీ మోడీ మహత్యం!
2 . మూడుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసినందువల్లనే దేశదేశాల్లో భారత్ గౌరవం విజృంభించింది- అదీ మోడీ మహత్యం!
3  . అంతర్జాతీయ యోగ దివస్ వేడుకల్లో 50 ఇస్లామిక్ దేశాలు పాల్గొన్నాయి- అదీ మోడీ మహత్యం!
4 . బాలాసోర్ లాంటి నియోజకవర్గంలో నాలాంటి వాడు బలమైన ప్రత్యర్థులను ఓడించి గెలిచాడు! – అదీ మోడీ మహత్యం!
5 . ఆ మాటకొస్తే ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఎవరుగెలిచినా అది  మోడీ మహాత్యమే!
6 . ఫణి తుపాను రావడానికి ముందు కేంద్రం వేల కోట్ల రూపాయలు ఒడిశా రాష్ట్రానికి నిధుల రూపంలో అందించింది- అదీ మోడీ మహత్యం!
7 . నాకు ఏ మంత్రిత్వ శాఖ దక్కినా అది నాకు సంతోషకరమే. అయినా శాఖ కాదు- నాయకత్వం ఇచ్చే స్ఫూర్తి ఎక్కువ ముఖ్యం – అదీ మోడీ మహత్యం!
ఈ సప్తస్వరాలు వింటే, ఇంత లౌక్యం తెలిసిన ఈ “సాధువు” సహాయ మంత్రి కావడంలో గొప్పేముందని అనిపిస్తుంది. ఈ పెద్దమనిషి రేపు దేశానికి ప్రధాన మంత్రి అయినా వింతలేదని కూడా అనిపిస్తుంది.
ఎటొచ్చి, కుష్టు రోగుల సేవలో నిమగ్నుడైన ఆస్ట్రేలియన్ క్రిస్టియన్ మిషనరీ గ్రాహం స్టెయిన్స్ కుటుంబాన్ని -పది పదకొండేళ్ల వయసున్న ఆయన కొడుకులు ఇద్దరితో కలిపి- 1999లో మట్టుపెట్టిన సంఘటనతో సారంగీజీకి సంబంధం ఉందనే సంగతి కప్పెట్టడానికి కొంతకాలం పడుతుంది. అంతకాలం సారంగీజీ సహాయమంత్రి పదవితోనే సర్దుకోక తప్పదు. అవకాశం చిక్కితే ఆయన్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలో దింపడం, దరిమిలా యాంటీ సోషల్ మీడియా సహకారంతో ఆయన్ని గెలిపించుకోవడం ఎలాగు జరుగుతుందనుకోండి! పైగా, మోదీజీ మీద మన మధ్యతరగతి హిందూ సమాజానికి ఇంకా విసుగెత్తలేదు. అది జరిగేనాటికి సారంగీజీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా రంగం మీదకి వచ్చినా ఆశ్చర్య పడవలసింది ఏమీ లేదు.
సోషల్ మీడియా సామంతులు తల్చుకుంటే ఏదైనా సాధ్యమే, మన దేశంలో!

-మందలపర్తి కిషోర్

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment