‘మహా’ సంక్షోభం.. డెడ్ లైన్ టెన్షన్!

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శుక్రవారం అర్ధరాత్రితో డెడ్ లైన్ ముగుస్తోంది. బీజేపీ శివసేనల మధ్య వివాదం ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో అసలు ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్ర శాసనసభ కాలపరిమితి ముగుస్తున్న తరుణంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ-శివసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ సీఎం పదవి విషయంలో ఇరు పార్టీల మధ్య వివాదం నడుస్తోంది. అక్టోబర్ 24న ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ప్రభుత్వ ఏర్పాటులో మిత్రపక్షాలైన బీజేపీ-శివసేనల మధ్య సంధి కుదరలేదు. 50:50 ఫార్ములాకు కట్టుబడి తమకు రెండున్నరేళ్లపాటు సీఎం పదవిని ఇవ్వాలని, అది కూడా తొలి అవకాశం తమకే ఇవ్వాలని శివసేన చేసిన డిమాండ్ కు బీజేపీ ఒప్పుకోలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు విషయంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీపై శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి విమర్శలను ఎక్కుపెట్టారు. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. బలం నిరూపించుకునేందుకు 15 రోజులు కాదు… నెల రోజులు తీసుకోవచ్చంటూ వ్యాఖ్యానించారు.

మరోవైపు ఫ‌డ్న‌వీస్ నేతృత్వంలోనే మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంద‌ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం చెప్పారు. ఎన్నికల కంటే ముందు పొత్తు పెట్టుకున్న బీజేపీ శివసేన పార్టీలే మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని తెలిపారు. అయితే, 50-50 ఫార్ములాకు కట్టుబడి తమ పార్టీకి సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా ఉంటేనే మద్దతు ఇస్తామని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతుండగా.. తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతోందని శివసేన ఆరోపణలు చేసింది. మహారాష్ట్ర ప్రతిష్టంభన నుంచి బయటపడేందుకు బీజేపీ డబ్బులు వెదజల్లుతోందని ఆపార్టీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా శివసేన జాగ్రత్త పడుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించకుండా వారిని ముంబైలోని ఓ హాటల్ కు తరలించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నయ మార్గాలు అన్వేషించిన శివసేన.. ఎన్సీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని భావించింది. అయితే, తాము ప్రతిపక్షంలోనే కూర్చంటామని, శివసేనకు మద్దుతు ఇచ్చేది లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేయడంతో కొంచం వెనక్కి తగ్గినట్లు కనిపించింది. అయితే సీఎం పదవి విషయంలో శివసేన మాత్రం తమ పంతం వీడడం లేదు. మరోవైపు రాష్ట్రపతి పాలనకైనా సిద్ధపడతాము కానీ శివసేనతో రాజీపడమని కొందరు బీజేపీ నేతలు తేల్చి చెబుతున్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. గత నెల 24న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమికి పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు. మొత్తం 288 స్థానాలు గల మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది సభ్యుల మద్దతు కావాలి. బీజేపీ 105 స్థానాలు, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో విజయం సాధించాయి. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వ కాలం ఇవాళ్టితో ముగుస్తుంది. దీంతో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందా? లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది. దీంతో దేశవ్యాప్తంగా రాజకీయపార్టీలతో పాటు ప్రజల దృష్టి కూడా మహారాష్ట్రపైనే పడ్డాయి.