(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
హైదరాబాద్ కరీంనగర్ కలక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కరీంనగర్ బిజెపి ఎంపి బండి సంజయ్ సెల్ఫోన్లో మాట్లాడిన మాటల ఆడియో క్లిప్ సంచలనం కలిగిస్తున్నది. ఈ ఆధారంతో కలక్టర్ను అక్కడ నుంచి బదిలీ చేస్తారా లేదా అన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఆడియో క్లిప్ ఆధారంతో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ మీడియాకు చెప్పారు. అయితే ఇంతవరకూ ఆయన సిఎంను కలిసిందీ లేనిదీ తెలియదు.
సిఎంకు ఫిర్యాదు చేస్తే మాత్రం కలక్టర్‌కు ఇబ్బందేనని అంటున్నారు. దాదాపు ఎనిమిది నిముషాల సేపు సాగిన సంభాషణలో కమలాకర్‌ను అనర్హుడిగా ప్రకటింపజేసేందుకు బండి సంజయ్ కలక్టర్ సహకారం కోరారు. కలక్టర్ కాస్త సానుకూలంగానే స్పందించినట్లు ఆడియో క్లిప్ వింటే అర్ధమౌతుంది. పరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేసినందుకు కమలాకర్‌ను అనర్హుడిగా ప్రకటింపజేయాలన్నది సంజయ్ ఆలోచన.
సంజయ్ విజ్ఞప్తికి స్పందిస్తూ కలక్టర్ ఒకచోట, పెయిడ్ న్యూస్ చేసినందుకు ఇతర రాష్ట్రాలలో కొన్ని సందర్భాలలో అనర్హులుగా ప్రకటించారనీ, ఆ కేసులు ఫాలో కావాలనీ సంజయ్‌కు సలహా ఇచ్చారు. సంభాషణ మొత్తం మీద కలక్టర్ నోరు జారింది అక్కడే.
సంజయ్ తన అనుచరుడు ఒకరి మొబైల్ తీసుకుని దానిలోంచి కలక్టర్‌కు ఫోన్ చేశారు. ఆ ఫోన్లో సంభాషణ రికార్డయింది. తర్వాత కొన్నాళ్లకు ఆ అనుచరుడు సంజయ్‌కు దూరమయ్యాడు. అతనిని కమలాకర్ దగ్గరకు తీశారు. కమలాకర్‌కు ఆవిధంగా ఆడియో క్లిప్ దొరికింది. గతంలో ఒకసారి శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ తమకు కలక్టర్ సర్ఫరాజ్ గౌరవం ఇవ్వడం లేదంటూ ఆయనపై ధ్వజమెత్తారు. ఆ సందర్భంలో గంగుల కమలాకర్ రసమయి పక్షాన నిలిచారు. కలక్టర్ అప్పటినుంచీ గంగులపై గుర్రుగా ఉన్నారని అంటున్నారు.