మాక్స్ 737 విమానాల డెలివరీ నిలిపివేత
తయారీ మాత్రం కొనసాగుతుందని వెల్లడి
విమానాల పార్కింగుకు స్థలమే సమస్య
సీటెల్: అమెరికా విమానాల తయారీ కంపెనీ బోయింగ్.. తన 737 విమానాల డెలివరీని ఆపేయాలని నిర్ణయించింది. అయితే, వాటి తయారీ మాత్రం ఫుల్ స్పీడులో కొనసాగనుంది. ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ విమాన ప్రమాదం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ విమానాలను వాడటం ఆపేశారు. ఐదు నెలల్లో ఈ విమానాలు రెండు ప్రమాదాలకు గురికావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా వివిధ దేశాలకు 737 విమానాల డెలివరీని బోయింగ్ తాత్కాలికంగా ఆపింది.
అమ్మకాల్లో ఇదే టాప్
ఇప్పటివరకు బాగా వేగంగా అమ్ముడవుతున్న మోడళ్లలో 737 మాక్స్ 8 ఒకటి. దీన్ని సీటెల్ నగరంలోని ఫ్యాక్టరీలో తయారుచేస్తున్నారు. వీటిని నేలకే పరిమితం చేయాలని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలిక ఉత్తర్వులిచ్చింది. పరిస్థితులను అంచనా వేస్తూనే ఈ విమానాలను తయారుచేస్తామని బోయింగ్ ప్రతినిధి చాజ్ బికర్స్ తెలిపారు. ఇక్కడ నెలకు 52 విమానాలు తయారవుతాయి. వాటిలో అత్యధికం మాక్స్ విమానాలే. తయారీ వేగాన్ని జూన్ నాటికి పెంచాలని బోయింగ్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఎందుకిలా చేస్తారంటే..
సాధారణంగా ఉత్పత్తిదారులు ఉత్పత్తిని నిలిపివేసి, మళ్లీ వేగవంతం చేయడానికి ఇష్టపడరు. దానివల్ల సరఫరా తీరు దెబ్బతింటుంది. కానీ విమానాలు తయారుచేసి గోడౌనులో పెట్టాలంటే చాలా స్థలం కావాల్సి ఉంటుంది. విమానం డెలివరీ అయిన తర్వాతే కస్టమర్లు డబ్బు చెల్లిస్తారు. ప్రస్తుతానికి డెలివరీలు ఆపినా ధరల్లో మాత్రం మార్పు ఉండబోదని అంటున్నారు. వివిధ ప్రాంతాల్లో తమకున్న స్థలం మొత్తాన్ని విమానాలు నిలిపేందుకు వాడుకోవాలని బోయింగ్ భావిస్తోంది.