‘కర్నాటక అసమ్మతి నడిపిందే అమిత్ షా!’

బెంగళూరు: కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో అసమ్మతి నడిపించింది బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షానేని, రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేలను(కాంగ్రెెస్, జేడీఎస్) రెండు నెలల పాటు ముంబైలో తలదాచుకునేలా చేసింది కూడా ఆయనేనని సీఎం యడియూరప్ప చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం 100 రోజుల పాలనను పూర్తి చేసుకొంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హుబ్బళ్లిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో యడియూరప్ప మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ 17 మంది ఎమ్మెల్యేల రాజీనామాల ఫలితంగానే మనం అధికారంలో ఉన్నాం. రెండు నెలలపాటు ముంబైలో ఉండాల్సిన అవసరం వారికేమొచ్చింది ? వారికి ముంబైలో తగిన భద్రత కల్పించింది మన జాతీయ అధ్యక్షులే అన్న విషయం మీరు మరిచారా ? వారి స్థానంలో మీరుంటే ఏం చేస్తారు ? మన పార్టీ అధికారంలోకి రావడానికి వారు ఎంతో సహాయపడ్డారు. ఎమ్మెల్యే పదవికి వారు రాజీనామా చేసి, సుప్రీం మెట్లు ఎక్కారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మేము వారివెంట ఉన్నాం. వారి అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో త్వరలో తీర్పు రానుంది. ఈ నేతలను మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలిపించాల్సిన బాధ్యత మనదే ‘ అని వ్యాఖ్యానించారు.

యడియూరప్ప తాజా ప్రసంగం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మొన్నటి వరకు ఆ రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు తమకూ సంబంధం లేదని ప్రకటించిన బీజేపీ.. తాజాగా సీఎం వ్యాఖ్యలతో ఎట్టకేలకు తన భాగస్వామ్యాన్ని అంగీకరించనట్లైందని కాంగ్రెస్ మండిపడింది. కాగా, 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన వ్యాజ్యంపై విచారణ ముగిసింది. తీర్పును వాయిదా వేసిన కోర్టు త్వరలో అనర్హుల భవిష్యత్తు ఏమిటో తేల్చనుంది. మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలతో ఖాళీ అయిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిసెంబర్‌ 5న ఉపఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. డిసెంబర్‌ 11న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. తమ సిట్టింగ్ స్థానాలను మళ్లీ దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల రాజీనామాతో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. ఎమ్మెల్యే తిరుగుబాటు చేసిన తరువాత ఈ ఏడాది జూలైలో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లు లభించాయని స్పీకర్ ప్రకటించారు. దీంతో ఆరు ఓట్ల తేడాతో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన జేడీఎస్ నేత కుమారస్వామి 14 నెలల పాలన తరువాత ఎమ్మెల్యేల రాజీనామాతో బలం కోల్పోవడంతో యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు.