రైతు ఆవేదన పట్టని కలెక్టర్!

అమరావతి: గుంటూరు జిల్లా కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ తీరుకు నిరసనగా కలెక్టరేట్ ఆవరణలో ఓ వృద్ధ రైతు ఆమరణ నిరాహార దీక్షను దిగడం సంచలనమైంది. కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ తనను చీదరించుకుంటున్నారని సదరు రైతు వాపోయాడు. తన భూమిని రెవెన్యూ అధికారులు మరొకరి పేరున నమోదు చేశారని, దీనిపై న్యాయం చేయాలని వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. చాలా రోజులుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా న్యాయం చేయడం లేదని వాపోతున్నాడు. దీనికి నిరసనగా ఆమరణ దీక్షకు పూనుకున్నాడు.

ఫిరగిపురానికి చెందిన రావి శంకర్రావు అనే రైతు పొలాన్ని ఇటీవల రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తి పేరుతో మార్చారు. దీన్ని గుర్తించిన ఆయన.. అధికారుల వద్దకు వెళ్లి రికార్డులను సరిచేయాలని కోరాడు. కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో ‘స్పందన’ కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు. అయినా కలెక్టర్ తన విన్నపాన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు కలెక్టర్ శ్యామ్యూల్ ను కలిసేందుకు ప్రయత్నిస్తే తనను చూడగానే చీదరించుకుంటున్నారని ఆరోపించారు. ఎన్ని సార్లు తిరిగినా అధికారులు.. పట్టించికోక పోగా బెదిరిస్తున్నారని శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి నిరసనగా ఆమరణ దీక్ష చేస్తున్నానని, తన చావుతో అయినా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాడు.