నార్వేకు చెందిన మత్స్యకారులు ఒక సొరచేపను చూశారు. దానికి రష్యాలో తయారైన కవచం లాంటి తాడు కూడా ఉండటంతో.. అది రష్యా సైనిక స్థావరం నుంచి వచ్చిందని ఆందోళనలు మొదలయ్యాయి. శిక్షణ పొందిన సొరచేపలు అన్న విషయమై ప్రచారం మొదలుకాగానే నార్వేలో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయని ఐటీవీ న్యూస్ సంస్థ తెలిపింది. దీనిపై దర్యాప్తు మొదలైంది. ఈ పెంపుడు బెలుగా సొరచేప ముర్మాస్క్ నుంచి 415 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంగోయా అనే దీవిలో నార్వే పడవలకు సమీపంలో కనిపించింది. అక్కడ రష్యాకు నౌకా స్థావరం ఒకటి ఉందని బీబీసీ తెలిపింది.
బెలుగా సొరచేపకు ఉన్న తాడును తొలగించేందుకు నార్వే మత్స్యశాఖ డైరెక్టరేట్ కు చెందిన జోర్గెన్ రీ విగ్, ఇంకా రీ విగ్ అనే ఇద్దరు నీళ్లలోకి దూకారు. ఆ తాడు స్ట్రాప్ మీద ‘ఎక్విప్ మెంట్ సెయింట్ పీటర్స్ బర్గ్’ అని రాసి ఉంది. దానిమీద ఒక యాక్షన్ కెమెరా కూడా బిగించి ఉందని యూరోన్యూస్ తెలిపింది. మత్స్యశాఖ డైరెక్టరేట్ ఆ సొరచేప బొమ్మలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.
ఐటీవీ కథనం ప్రకారం, రష్యా సైన్యం కొన్ని జలచరాలకు శిక్షణ ఇచ్చి గూఢచర్యానికి పంపి ఉంటుందని నార్వేలోని ఆప్టెన్ పోస్టన్ పత్రిక అనుమానాలు వ్యక్తంచేసింది. రష్యా కొన్ని సొరచేపలను పట్టుకుని పెంచిన విషయం తమకు తెలుసని, వాటిలో కొన్నింటిని వదిలి ఉంటారని, అవి తరచు పడవల వద్దకు వస్తాయని ఆర్కిటిక్, మెరైన్ బయాలజీ ప్రొఫెసర్ ఔడున్ రికర్డ్ సెన్ తెలిపారు. అయితే, తాము ఇలాంటి ప్రయోగాలు చేయడం లేదని రష్యాకు చెందిన వారు చెబుతున్నారన్నారు. రష్యా నౌకాదళం కొన్ని బెలుగా సొరచేపలను కొన్నేళ్ల క్రితం పట్టుకుని వాటికి శిక్షణ ఇచ్చిన విషయాన్ని మాత్రం నిర్ధరించారని చెప్పారు. అయితే రష్యా మాత్రం దీన్ని గట్టిగా ఖండించింది. జంతువులను గూఢచర్యానికి ఉపయోగిస్తే వాటి మీద మొబైల్ నంబరు కూడా రాసి ఆ నెంబరుకు ఫోన్ చేయమని రాస్తామా అని ఓ అధికారి ప్రశ్నించారు. యుద్ధం కోసం కొన్ని మిలటరీ డాల్ఫిన్లు తమ వద్ద ఉన్నాయని, దాన్ని తాము ఏమీ దాచి పెట్టడం లేదని చెప్పారు.
https://www.facebook.com/fiskeridirektoratet/posts/2910439532329775