(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వారి ఖాతాల సమాచారం ఇండియాకు అందింది. అటోమాటిక్ సమాచార మార్పిడి ఒప్పందం (ఎఇవోఐ) కింద స్విట్జర్లాండ్ ఫెడరల్ పన్నుల శాఖ ప్రభుత్వానికి ఈ వివరాలు అందించింది. ఇండియాకు ఈ సమాచారం అందడం ఇదే ప్రధమం. గత సంవత్సరం అమలులోకి వచ్చిన ఎఇవోఐ కింద మొత్తం 75 దేశాలకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం స్విస్ ఖాతాల సమాచారం అందించింది.
అయితే ఇందులో ఒక మతలబు ఉంది. ఒప్పందం కింద అందిన సమాచారం బయటపెట్టకూడదన్న నిబంధనలకు లోబడి ఇండియా సమాచారం అందుకున్నది. ఇండియాకు ఎన్నిఖాతాల సమాచారం అందించిందీ, ఈ ఖాతాలలో ఎంతెంత మొత్తాలు ఉన్నది తదితర వివరాలు వెల్లడించేందుకు స్విస్ కేంద్ర పన్నుల విభాగం అధికారులు నిరాకరించారు.
భారతీయల పేరుమీద ఉన్న ఖాతాల సమాచారం మాత్రమే సేకరించి ఇండియాకు ఇచ్చామని మాత్రం అధికారులు తెలిపారు. ఈ ఖాతాల్లో నల్లధనం దాచుకుని ఉండొచ్చు, కొన్ని అధికారికంగా వ్యాపార లావాదేవీలకు ఉపయోగించిన ఖాతాలు కూడా అయిఉండొచ్చు.
మొత్తం అన్ని దేశాలకూ కలిపి 31 లక్షల ఖాతాల సమాచారం అందించారు. ఖాతాదారుడి పేరు. అడ్రసు, టాక్స్ గుర్తింపు నంబర్, వ్యాపార సంస్థ పేరు, ఖాతాలో ఉన్న డబ్బు వంటి వివరాలు అందించారు. సమాచార మార్పిడి ఒప్పందం కింద స్విట్జర్లాండ్‌కు కూడా ఆయా దేశాల నుంచి సమాచారం అందింది.