2016లో ఇయాన్ బ్రెమ్మర్ అనే వ్యక్తి తాను లోక్ నెస్ సరస్సులో చూశానని చెబుతున్న నెస్సీ ఫొటో. అతనే ఆ ఫొటో తీశాడు. ద స్కాట్స్మన్ అనే వెబ్సైట్ ఈ వార్త ప్రచురించింది.
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
శతాబ్దాలుగా పరిశోధకులకు పని చెబుతున్న లోక్ నెస్ జలచరం మిస్టరీపై మరో అంచనా బయటకు వచ్చింది. ఆ మిస్టరీ జీవి రాక్షసి ఈల్ చేప (మలుగుపాము) అయ్యుండొచ్చని తాజాగా విడుదలైన ఒక అధ్యయనం నివేదిక చెబుతోంది. ఈ అధ్యయనం నిర్వహించిన న్యూజిలాండ్ యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో సైంటిస్టు నీల్ జెమ్మెల్, లోక్ నెస్ సరస్సులో చాలా ఎక్కువగా ఈల్ చేప డిఎన్ఎ కనబడిందని పేర్కొన్నారు.
స్కాంట్లాండ్లోని లోక్ నెస్ బ్రిటన్ మొత్తం మీద పెద్ద మంచినీటి సరస్సు. ఇందులో ఒక భారీ సైజు జలచరం ఏదో ఉందన్న వార్తలు దాదాపు 1500 ఏళ్లుగా వినబడుతున్నాయి. దీనిపై ఊహాగానాలకు కొదవ లేదు. షార్క్ చేప, క్యాట్ ఫిష్, అంతరించిపోయిన డైనోసార్ల సంతతి జలచరం, నీటి గుర్రం..ఆ జీవి ఏమిటి? అదేంటో తెలియదు కానీ, దానికి పేరు మాత్రం పెట్టారు: నెస్సీ
డైనోసార్ల జాతికి ఏమాత్రమో దగ్గరగా ఉండే డిఎన్ఎ కూడా సరస్సులో కనబడలేదని జెమ్మెల్ పేర్కొన్నారు. సరస్సులో మొత్తం 250 శాంపుల్స్ తీశారు. ప్రతి శాంపుల్లోనూ ఈల్ చేప డిఎన్ఎ కనబడింది. దాని ఆధారంగా ఆ మిస్టరీ జీవి రాక్షసి ఈల్ చేప అయిఉండవచ్చని ఆయన సూత్రీకరించారు.
లోక్ నెస్లో బాగా లావుపాటి ఈల్ చేపలు కనబడినట్లు గతంలో ఒకసారి సరస్సు అడుగుకు వెళ్లిన డైవర్లు చెప్పిన సంగతి ఆయన గుర్తు చేశారు. 1933లో కూడా ఈ జీవిపై ఒక అధ్యయనం జరిగింది. అది నిర్వహించిన వారు కూడా నెస్సీ భారీ సైజు ఈల్ చేప అయ్యుండొచ్చని తీర్మానించారు.
ఆరవ శతాబ్దంలో స్కాంట్లాండ్కు క్రైస్తవం తీసుకువచ్చిన సెయింట్ కొలంబా లోక్ నెస్లో మొదటిసారి ఈ మిస్టరీ జీవిని చూసినట్లు చెబుతారు. ఇటీవలి కాలంలో చివరిసారి ఒక అమెరికన్ జంట తాము ఈ భారీ జలచరాన్ని చూశామని చెప్పారు.