వాషింగ్టన్: ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ నాయకుడు, కరడు గట్టిన ఉగ్రవాది అబూ బకర్ అల్-బాగ్దాదీ హతం కావడంలో ఓ శునకం పాత్ర కూడా ఉంది. ఓవైపు అమెరికా దళాలు తమ తుపాకులు ఎక్కుపెట్టి వెంటాడుతుండగా..మరోవైపు ఆ దళాలతో బాటు ఆమెరికా సైన్యానికి చెందిన ఓ శునకం కూడా అతడి వెంటాడి.. వేటాడింది. దీంతో చేసేది లేక తన ముగ్గురు పిల్లలతో ఓ టన్నెల్ లోకి పారిపోయిన బాగ్దాదీ.. బిక్కచచ్చిపోయాడు. అటు సైనికులు, ఇటు సింహంలా దూసుకొస్తున్న ఈ జాగిలాన్ని చూసి భయపడిపోయిన బాగ్దాదీ.. తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో తమ దేశ కమెండోలకు ఎంతగానో సాయపడిన ఈ శునకం తాలూకు చిత్రాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘ఐసిస్ అధినేత బాగ్దాదీని హతమార్చడంలో గొప్ప పాత్ర పోషించిన అద్భుతమైన ఈ జాగిలానికి సంబంధించిన చిత్రాన్ని బహిర్గతం చేస్తున్నాం.. అయితే దీని పేరు మాత్రం వెల్లడించలేం’ అని ట్రంప్ పేర్కొన్నారు.
https://twitter.com/realDonaldTrump/status/1188909031403900928
అయితే బాగ్దాదీ తనను తాను పేల్చేసుకుంటుండగా ఈ శునకం గాయపడింది. కానీ దాన్ని తిరిగి తెచ్చుకున్నామని, సురక్షితంగా ఉందని అయన తెలిపాడు. అమెరికా దళాలు విధుల్లో తమకు సాయంగా బెల్జియం మాలినోయిస్ జాతికి చెందిన శునకాలను వినియోగించుకుంటూ ఉంటాయి. 2011 లో ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చిన ఆపరేషన్ లో అమెరికా బలగాలు ‘ కైరో ‘ పేరుగల బెల్జియం మాలినోయిస్ జాతి కుక్కను ఉపయోగించుకున్నాయి. బాంబు పేలుడు వంటి ఘటనలు జరిగినప్పుడు అందుకు కారకులైనవారి పట్టివేతకుఇలాంటి మేలుజాతి శునకాలను వినియోగిస్తుంటారు.
భయానకమైన టెరరిస్టు కార్యకలాపాలతో కొన్ని సంవత్సరాల పాటు ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఐఎస్ఐఎస్ నేత అబూబకర్ ఆల్ బాగ్దాదీ మరణించాడని ఆదివారం అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రత్యేక దళాలు సిరియాలోని ఒక ప్రాంతంలో బాగ్దాదీ తలదాచుకున్న కాంపౌండ్‌పై దాడి చేశాయి. రెండు గంటల పాటు జరిగిన ఈ సైనికచర్యలో బాగ్దాదీ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కాంపౌండ్‌లో ఉన్న భూగర్భ సొరంగంలో తలదాచుకున్న బాగ్దాదీ అమెరికా సైనిక జవాన్లకు పట్టుబడకుండా ఉండేందుకు ఆత్యహత్య చేసుకున్నాడు. తాను ధరించిన పేలుడు పదార్ధాలతో తయారు చేసిన జాకెట్‌ను పేల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతి చెందింది బాగ్దాదీయేనని తర్వాత డిఎన్ఎ పరీక్ష ద్వారా నిర్ధారించుకున్నారు. అతనితో పాటు అక్కడ ఉన్న ముగ్గురు పిల్లలు కూడా ఈ పేలుడులో చనిపోయారు. ఈ దాడి మొత్తాన్నీ తాను వైట్‌హౌస్‌నుంచి ప్రత్యక్షప్రసారం ద్వారా చూశానని ట్రంప్ చెప్పారు. బాగ్దాదీ కుక్కచావు చచ్చాడు ఇని ఆయన అన్నారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో అమెరికా వైపున ప్రాణనష్టం లేదని ఆయన పేర్కొన్నారు.