(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆ యువతి పోలీస్ ఆఫీసర్‌కు బొమ్మ తుపాకి గురిపెట్టింది. అతను వెంటనే నిజం తుపాకితో కాల్చాడు. యువతి నేలకొరిగిపోయింది. హెల్ప్ మి, హెల్ప్ మి అంటూ రోదించింది. కానీ వైద్య సహాయం అందేలోపు మరణించింది. కాలిఫోర్నియా, ఫుల్లర్టన్లో ఈ నెల అయిదవ తేదిన జరిగిందీ సంఘటన. తమ కుమార్తె మరణానికి దారి తీసిన పరిస్థితులపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో ఫుల్లర్టన్ పోలీసులు ఆ సంఘటనకు సంబంధించిన వీడియో విడుదల చేశారు.
హన్నా విలియమ్స్ 17 ఏళ్ల యువతి. ఆమె డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నది. ఆ రోజు హన్నా హైవేపై చాలా వేగంగా కారు నడుపుతూ పోలీసు అధికారి కళ్లబడింది. ఆతను ఆమెను ఆపడంకోసం వెంబడించాడు. ఒకచోట సడన్‌గా ఆమె కారు వెనక్కుతిప్పి ఆపింది. తన కారు దిగి ఆమె కారు డ్రయివింగ్ సీటు వైపు వస్తున్న పోలీసుకు ఆ యవతి చేతిలో ఎక్కుపెట్టిన తుపాకి కనబడింది. వెంటనే అతను తన తుపాకితో కాల్చాడు.
ఈ ఎన్కౌంటర్ జరిగిన గంటన్నరకు ఆమె తండ్రి బెన్సన్ విలియమ్స్ తన కుమార్తె తప్పిపోయిందని పోలీసులకు ఎమర్జెన్సీ కాల్ చేశాడు. దానికి జవాబుగా బెన్సన్ ఇంటికి వెళ్లిన పోలీసుకు తన కుమార్తె డిప్రెషన్‌కు మందులు వాడుతోందనీ, ఆమె వల్ల ఎవరికన్నా హాని జరిగే ప్రమాదం ఉందనీ ఆయన చెప్పాడు. హన్నా మృతిపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఆయన కోరుతున్నాడు.