విబేధాలు విమర్శలూ
నీ చుట్టూ ఇనప వలయాలు
అయినా నువ్వు పువ్వులా నవ్వుతూనే వుంటావు.
ఎరుపూ నీలం కాషాయం
రంగులెన్నో నిన్ను తప్పుపడుతూనే
తప్పనిసరై నీకు తిలకాలు దిద్దాయి
రంగులేవీ అంటని రహస్య కాంతివి నువ్వు-
భగత్ సింగులా సుభాష్లా రామరాజులా
రాలిన యువగోళాలను మరువలేం
నీ శాంత్య హింసల ఆయుధాలనూ విడవలేం
నువ్వు స్వాతంత్ర్యాన్ని ఖాళీ చేతులతోనో
బోసి నవ్వులతోనో తీసుకొచ్చావని
నమ్మడానికి వీల్లేదులే కాని
నీ చుట్టూ నెత్తురు కురిసినా
నువ్వు తెల్లని అకాశానివై నిలిచినందుకే నీకు జేజేలు.
అనేక కారణాలతో నిన్ను తిట్టుకున్నా
నువ్వు చూపిన దారి తప్ప మరో దారి లేదని
నీ విచిత్ర వ్యక్తిత్వంతో మాకు చెప్తూనే వున్నావు
భల్లూకాలు శాంతిని వల్లిస్తున్నాయి
రాబందులు అహింసను పఠిస్తున్నాయి
అబద్ధాలు సత్యాన్ని ధ్యానిస్తున్నాయి
ఏది వెలుగు? ఏది చీకటి?
పోల్చుకోలేని అయోమయంలో
నువ్వు తప్ప మరో దారిలేనంత దిక్కులేని వాళ్ళమయ్యాం.
అన్ని దిక్కులూ మూసుకుపోతున్నాయి మహాత్మా!
హింసను అనివార్యం చేసి
హింసను ఆయుధం చేసి
నిన్ను నిత్యం ధ్వంసం చేస్తూ
నీకు పూజలు చేస్తున్న కాలంలో
నిన్ను ఎవడు ఏ ఆయుధంగా వాడుతున్నాడో
అర్థంకాని గందరగోళంలో ఉన్నాం మహాత్మా!
నూట యాభై సంవత్సరాలు కాదు
నూట యాభై వేల సంవత్సరాలైనా
భూగోళమైనా మరే గోళమైనా
శాంతి కోసం సత్యం కోసం
సమరం తప్పనప్పుడు
నీ నిర్వస్త్ర శరీరాత్మలే నిజమైన
అస్త్రాలవుతాయి
నిజం మహాత్మా!
ఎన్నో కారణాలతో నిన్ను అంగీకరించలేని
శక్తులను కూడా కడకు
నిన్ను ఆలింగించక తప్పని అశక్తులను చేశావు
అందుకే మహాత్మా నువ్వు నిజం
నీ చేతి కర్ర నిజం
డాక్టర్.ప్రసాదమూర్తి
(అక్టోబర్ రెండున గాంధీ 150వ జయంతి)
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ