NewsOrbit
వ్యాఖ్య

  అనగనగా ఒక దేశంలో..!

 అనగనగా ఒక దేశం. అది సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశం. అక్కడ న్యాయం నాలుగు పాదాలా నడుస్తుందని ఎవరు నమ్మినా నమ్మకపోయినా న్యాయ స్థానం మాత్రం పూర్తిగా విశ్వసిస్తుంది. అయితే ఇప్పుడా దేశంలో న్యాయ వ్యవస్థకు కొన్ని అనుకోని అవస్థలు దాపురించాయి. తన నిజాయితీని నిరూపించుకోవలసిన సందర్భం వచ్చింది. అందరికీ న్యాయం చెప్పే దేవత తనపై తానే తీర్పు చెప్పుకోవలసి వస్తే ఏం చేస్తుంది? ఆ ప్రశ్నకు జవాబుగా  తమ దేశంలో జరుగుతున్న తాజా న్యాయ పరిణామాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా వుందని సామాన్యుల నుండి మేధావుల వరకూ చాటు చాటుగా నొక్కి వక్కాణిస్తున్నారు.

అనగనగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలోని అత్యున్నత పదవిని అధిష్ఠించిన న్యాయమూర్తిపైన అదే న్యాయస్థానంలో పనిచేసిన ఒక మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అంత మాత్రాన దేశం ఏమీ దద్దరిల్లిపోలేదు, తలక్రిందులైపోలేదు. భూకంపాలూ సునామీలూ దాడి చేయలేదు.  కాని..సదరు న్యాయస్థానం మాత్రం తల్లడిల్లిపోయింది. మొత్తం న్యాయవ్యవస్థపైనే ఏదో పాపుల లోకం నుండి దెయ్యాలు వచ్చి దాడి చేసినట్టు ఫీలైపోయింది. ఏమిటీ వైపరీత్యం? ఎందుకీ విపత్కర పరిణామం? దేశం ఏమైపోతోంది? సమస్త మానవాళికీ సమన్యాయం పాటించే దేవుడి మీదనే ఇంత దుర్మార్గమైన ఆరోపణలా? యావత్తు న్యాయపీఠాలూ ఎవరో కాళ్ళు పీకేస్తున్నట్టు కుదేలైపోయాయి. తప్పు చేసే వాళ్ళకి దండన విధించే దేవుడు ఎక్కడైనా తప్పు చేస్తాడా? పాపులను శిక్షించే పరమ పూజ్యుడు ఎక్కడైనా పాపం చేస్తాడా? నేరగాళ్ళను బోనెక్కించి..కటకటాల వెనక కారు చీకట్ల గుయ్యారంలోకి నెట్టే అత్యంత నీతివంతుడైన బలశాలి ఎక్కడైనా నేరం చేస్తాడా? దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తులందరూ కోర్టు తలుపులు వేసేసి ఒకరిని పట్టుకొని మరొకరు బోరుబోరున ఓదార్చుకున్నారు. ఎంత దారుణం..ఎంత దారుణం అంటూ కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయ దేవత వైపు చూసి తల్లీ ఒకసారి ఆ గంతలు విదిల్చి ఈ విపరీతాన్ని చూడమ్మా అని వేడుకున్నారు. విచిత్రం ఏమంటే ఆ న్యాయదేవత కూడా ఒక స్త్రీ అన్న విషయం వారు మర్చిపోయారు.

దేశ ప్రధాన న్యాయమూర్తి పైన ఆరోపణ చేసిన ఆ మహిళ సర్వోన్నత న్యాయస్థానంలోని  మొత్తం న్యాయమూర్తులందరికీ తన పిటిషన్ పంపింది. దాని మీద విచారణ కోరింది. సర్వ సాధారణంగా ఇలాంటి కేసులలో విచారణ ఏవిధంగా సాగుతుందో అదే విధంగా జరుగుతుందని ఆశించింది. అదే కోర్టు గతంలో ఇలాంటి విషయాల మీద స్పందించి ఇచ్చిన తీర్పులకు కట్టుబడి తన కేసును పరిశీలిస్తుందని విశ్వసించింది. కానీ చిత్రాతి చిత్రంగా న్యాయమూర్తులందరూ ఒకటైపోయి కేసును గప్ చుప్ సాంబారు బుడ్డిగా మార్చాలని తీర్మానించుకున్నారని ఆమెకు చాలా ఆలస్యంగా తెలిసింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్నది మానవ మాత్రుడు కాదని..నీతికి..ధర్మానికి..న్యాయానికి..సౌశీల్యానికి..నిలువెత్తు రూపమైన న్యాయమూర్తి అని కోర్టు వారు భావించి కేసును కోర్టు నాలుగ్గోడల మధ్యనే పరిష్కరించాలని తీర్మానించడం ఇక్కడ సరికొత్త మలుపు. కోర్టు లోపలి వారితోనే కమిటీని వేసింది. బాధితురాలు వచ్చి తన వాదన వినిపించుకోచ్చని మహత్తరమైన అవకాశం ఇచ్చింది. అంతకు ముందే బాధితురాలికి అసలు బాధలు మొదలయ్యాయి. సర్వసాధారణంగా బలవంతులు బలహీనులను ఇలాంటి కేసులో ఎలా వేధిస్తారో..ఎలా బెదిరిస్తారో..మొత్తం కుటుంబ సభ్యులను ఎలాంటి భయాందోళనలకు గురిచేస్తారో అచ్చం అలాంటి సమస్తాలూ ఈమె విషయంలోనూ జరిగిపోయాయి. తర్వాత నిమ్మళంగా ఏ శబ్దాలూ బయటకు పొక్కనంత నిశ్శబ్దంగా విచారణ జరిపారు. బాధితురాలు ( సదరు కోర్టు దృష్టిలో నేరస్తురాలు) తనకూడా మరొకరిని సహాయంగా తెచ్చుకోకూడదు. తన వాదన కాని..విచారణ తీరు తెన్నులను కాని రికార్డు చేయరాదు. లోపలేం జరిగిందో బయటకు పొక్కరాదు. న్యాయం కోసమే జన్మనెత్తిన మహానుభావులు తమదాకా వస్తే ఇంత అన్యాయంగా ప్రవవర్తిస్తారా అని బాధితురాలు భోరుభోరుమంది. బాధితురాలి పక్షం వహించాల్సిన వారు నిందితుడైన తమ దేవుడి పక్షాన నిలిచి ఆమెను అవమానించారని తను భావించింది. ఇంక ఈ మాత్రానికి ఆ అతి రహస్య విచారణకు వెళ్ళి మాత్రం ఏం లాభమని విరమించుకుంది. దీనితో విచారణ కమిటీకి విచారణ చాలా సునాయాసమైపోయింది. షరా మామూలుగా.. సరియైన సాక్ష్యాధారాలు లేనందున దోషి, దోషి కాడని, బాధితురాలు, బాధితురాలు కాదని నొక్కి వక్కాణించేసింది. అసలు ఇందులో ఏదో కుట్ర కోణం దాగి వున్నట్టు అదేదో బయటకు లాగితేనే కాని కోర్టు పరువు గంగలోంచి గట్టుమీద పడదని న్యాయస్థాన సకలాంగాలూ విశ్వప్రయత్నం చేస్తున్నట్టుగా దేశానికి బోధపడింది.  ఈ మొత్తం ప్రక్రియ పరిశీలించిన దేశవాసులకు..మేధావులకు మాటపడిపోయింది.

కాబట్టి న్యాయమూర్తులంటే దేవుళ్ళని, వారు మానవమాత్రులు కాదని అందరూ అర్థం చేసుకోవాల్సి వుంది. న్యాయమూర్తులు పురుషులైనంత మాత్రాన వారికి పురుష లక్షణాలు..స్త్రీలైతే వారికి స్త్రీ లక్షణాలూ వుండవని..వారు వాటన్నింటికీ అతీతులనీ దేశ ప్రజలు తెలుసుకోవాలి. న్యాయమూర్తి ఎప్పుడూ న్యాయపీఠం మీదే కూర్చుంటారని..బోను ఎక్కే ప్రసక్తే లేదని అవగతం చేసుకోవాలి. న్యాయమూర్తికే న్యాయం కోసం దేవురించే పరిస్థితి వస్తే ఇక ఆ దేశం హీనాతిహీన రోగగ్రస్తమై సర్వావయవాలూ కుళ్ళి కృశించిపోయినట్టుగా అనుకోవాలి. కనుక దేశ వాసులంతా కోర్టులను..వాటి న్యాయప్రక్రియలను..వాటి నిజాయితీలనూ..వాటి నైతికతనూ..వాటి వ్యక్తిత్వాలను అనుమానించే సాహసం కూడా ఎవరూ చేయరాదన్న విషయాన్ని నరనరానా జీర్ణించుకోవాలి.

పాపం ఆ బాధితురాలు అతి త్వరలో నేరస్తురాలుగా బోనులో నిలబడుతుందేమో! పాప పుణ్యాలు విచారించే దైవాంశ సంభూతమైన వ్యవస్థనే నవ్వులపాలు చేసిన  కుట్రలో ప్రధాన నిందితురాలుగా నిలుస్తుందేమో! ఆ దేశంలో ఇక ముందేం జరుగుతుందో? కళ్ళప్పగించి చెవులప్పగించి మెదడులూ హృదయాలూ అన్నీ అప్పగించి చూడ్డం తప్ప మరో గత్యంతరం లేని సామాన్యులు..మేధావులు..కవులు..కళాకారులు..జర్నలిస్టులు అంతా నిరామయంగా చూస్తూ ఉండిపోతారేమో! అంతేనేమో..ఇంతేనేమో..అంతకంటే ఇంకేమీ ఉండదేమో..ఏమో..ఏమో..!

ఇంతకీ ఏ దేశం బాబూ అది?

తప్పు తప్పు పేరు ఉచ్చరిస్తే

నాలుక వేయి వ్రక్కలవుతుంది!

 

డా.ప్రసాదమూర్తి

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment