పచ్చ చొక్కాలకే ప్రభుత్వ పధకాలు: జివిఎల్

ఢిల్లీ, మార్చి 5 : ఓటర్ల జాబితాను సేకరించిన ఏపీ ప్రభుత్వం వాటిని దుర్వినియోగం చేసిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు విమర్శించారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జివిఎల్ మాట్లాడారు.

ఐటీ గ్రిడ్ అనే ప్రైవేటు సంస్థకు ప్రభుత్వ సమాచారం ఎలా చేరిందని ఆయన ప్రశ్నించారు. ప్రజల సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అందజేయడం ద్వారా ఏపీ ప్రభుత్వం పెద్ద నేరానికి పాల్పడిందని జివిఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ డేటాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు యత్నించారని జివిఎల్ ఆరోపించారు. ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చేసరికి తన బండారం బయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారని జివిఎల్ విమర్శించారు.

డేటా చోరీతో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని జివిఎల్ అన్నారు. ఇది రెండు రాష్ట్రాల సమస్య కాదని.. ప్రజల భద్రత, గోప్యతకు సంబంధించిన విషయమని జివిఎల్ పేర్కొన్నారు.

ఈ విషయంలో లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందని జివిఎల్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పచ్చచొక్కాలకే పరిమితం చేస్తున్నారని జివిఎల్ ఆరోపించారు.

దుర్మార్గులు రాజకీయాలు చేస్తే ఇలాంటి నేరాలే జరుగుతాయని జివిఎల్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఈసీ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని జివిఎల్ కోరారు.