(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆ ఫొటోగ్రాఫర్ మెడకు కెమెరా తగిలించుకుని హిమాచల్‌ప్రదేశ్ వెళ్లాడు. అక్కడ ఒక చోట ఆయనకు మంచు చిరుత కనిపించింది. ఆహా అనుకుంటూ క్లిక్ చేశాడు. తీరా చూస్తే అందులో చిరుతపులి కనబడనే లేదు. ఇదేమిటి ఈ వింత అనుకుంటున్నారా! అయితే మీరూ ప్రయత్నించండి.
వన్యప్రాణుల ఫొటోగ్రాఫర్ సౌరభ్ దేశాయ్ ఇటీవల హిమాచల్‌ప్రదేశ్, స్పిటి లోయ ప్రాంతంలోని కిబర్ గ్రామం సందర్శించారు. మోటారు వాహనాలపై చేరుకోగలిగిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గ్రామంగా ఈ ఊరును చెబుతారు. కిబర్ గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అతనికి మంచు చిరుత కనబడింది. ఆ ఫొటోను దేశాయి ‘ఆర్ట్ అఫ్ కామఫ్లాజ్’ అనే శీర్షికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. కామఫ్లాజ్ అంటే పరిసరాలలో కలిసిపోయి కనబడకుండా ఉండడం.
ఈ మంచు చిరుత పరిసరాలలో ఎంతగా కలిసిపోయిందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో చూసిన నెటిజెన్స్ ఏదబ్బా చిరుతపులి అంటూ గంటలుగంటలు తలలు బద్దలు కొట్టుకున్నారు. మొత్తం మీద పట్టకున్నవాళ్లు స్నేహితులను చిరుత ఎక్కడుందో చెప్పండి చూద్దాం అంటూ సవాలు విసిరారు. వైరల్ అయిన ఈ ఫొటోను 14 వేల మంది లైక్ చేశారు. మరి మీరూ ప్రయత్నించి చూడండి.
https://www.instagram.com/p/BwHZBkrj3aP/?utm_source=ig_web_copy_link