(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అతనొక అమెరికన్. సౌదీ యువరాజు అవతారం ఎత్తాడు. జనాన్ని నమ్మించి మోసం చేయడం మొదలుపెట్టాడు. ఒకటా రెండా ఏకంగా 30 ఏళ్లు ఆ అవతారంలో మోసం చేస్తూనే ఉన్నాడు. ఎంత గొప్ప మోసగాడయినా ఏదో ఒక రోజు దొరికిపోతాడుగా! అలాగే మనవాడూ దొరికిపోయాడు. అతనిని పట్టిచ్చినదేమిటో తెలుసా? పందిమాంసం. ముస్లింలు పందిమాంసానికి ఆమడ దూరంలో ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. మనవాడు ఒకరోజు పందిమాంసం అవురావురుమంటూ ఆరగిస్తూ తనకు సొమ్ములు పెట్టుబడి పెట్టిన ఒక వ్యక్తి కంట పడ్డాడు. దానితో ఆట కట్టయిపోయింది.
ఫ్లోరిడాకు చెందిన ఆంథోనీ జిగ్నాక్ 2017లో మయామీ వచ్చాడు. అక్కడ అతను అందరికీ పరిచయం అయింది ప్రిన్స్ ఖాలిద్ బిన్ ఆల్ సౌద్ పేరుతో. నిజానికి అతను ఆ పేరుతో చలామణీ కావడం అంతకు చాలా సంవత్సరాల ముందే ప్రారంభమయింది. ప్రిన్స్ ఖాలిద్ ఇంటికి సుల్తాన్ అనే నేమ్‌ప్లేట్ ఉంటుంది. అతని వెంట చాలామంది బాడీగార్డులు ఉంటారు. ఫెర్రారీ కారులో ప్రయాణిస్తాడు. దానికి డిప్లొమాటికి నంబర్ ప్లేట్ ఉంటుంది. అయితే అది దొంగ ప్లేటు. తాను రాయల్ ఫ్యామిలీ కాబట్టి తనకు ప్రొటోకాల్ ప్రకారం మర్యాద ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు.
తాము లాభసాటి పెట్టుబడి పెడుతున్నామన్న భ్రమలో సౌదీ యవరాజు ఎక్కౌంట్లోకి డబ్బులు వేసిన వారి సంఖ్య డజన్లలోనే ఉంటుంది. ప్రిన్స్ ఖాలిద్ తన దగ్గరకు వచ్చేవారి దగ్గరనుంచి ఖరీదైన బహుమతులు అందుకుంటాడు. మొత్తం మీద అతను 80 లక్షల డాలర్ల మేరకు జనాన్ని వంచించాడు. ఆ డబ్బంతా డిజైనర్ దుస్తులు, నౌకా యాత్రలూ, ప్రయివేట్ జెట్ విమానాల్లో ప్రయాణాలూ వంటి విలాసాలకు విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు.
జిగ్నాక్ కొలంబియాలో జన్మించాడు. ఏడేళ్లవయసులో అతను దత్తతకు వెళ్లాడు. 17 ఏళ్ల వయసులో ప్రిన్స్ ఖాలీద్ అవతారం ఎత్తాడు. అప్పటినుంచీ అతను పలుమార్లు మోసం అభియోగాలపై అరెస్టయ్యాడు. కానీ ఖాలిద్ ముసుగు బయటపడకపోవడంతో అతని ప్రస్తానం ఆగలేదు. చివరికి పందిమాంసం పట్టిచ్చింది. కోర్టు అతనికి 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది.