మనం రోజూ ఎంతోకొంత ప్లాస్టిక్ తింటున్నామని మీకు తెలుసా. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ప్రతి మనిషి కడుపులోకీ వారానికి అయిదు గ్రాముల ప్లాస్టిక్ వెళుతోంది. అంటే నెలకు 21 గ్రాములు, సంవత్సరానికి సుమారుగా 250 గ్రాములు. చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కల రూపంలో ఇది మన కడుపులోకి వెళుతోంది.
ఆస్ట్రేలియాలోని న్యూకేజిల్ యూనివర్సిటీ ఈ అధ్యయనం నిర్వహించిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక తెలిపింది. మానవ జీవితంలోకి ప్లాస్టిక్ ఎంతగా చొచ్చుకుపోయిందో దీని ద్వారా తెలుస్తోంది. ప్లాస్టిక్‌లో ఉండే అనేక రసాయనాలు మానవ శరీరంపై దుష్ప్రభావం చూపగలవు. ఇవి కాన్సర్ కారకాలు కూడా. వీటిలో బిపిఎ, పాతలేట్స్ అనే రసాయనాలు ప్రధానమైనవి.
ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కనబడుతుంది. మనం ప్లాస్టిక్ ప్లేట్లలో తింటాం. ప్లాస్టిక్ గ్లాసుల్లో తాగుతాం. ప్లాస్టిక్ సంచుల్లో ఆహార పదార్ధాలు మోస్తాం, నిల్వ చేస్తాం. మనం రోజూ వాడే పదార్ధాలు అన్నీ ప్లాస్టిక్ కంటైనర్స్లోనే ఉంటాయి. వీటి ద్వారా సూక్ష్మమైన ముక్కల రూపంలో ప్లాస్టిక్ శరీరంలోకి వెళుతుంది. ఇంకా చిత్రం ఏమంటే మనం తినే ఆహారంలో కూడా ప్లాస్టిక్ ఉంటుంది.
దీనివల్ల స్త్రీపురుషుల్లో వంధ్యత్వం వచ్చే ప్రమాదం ఉంది. కడుపులో పిండం మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. జన్మించి పెరిగి పెద్దయిన తర్వాత ప్రోస్టేట్ కాన్సర్, రొమ్ము కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆడపిల్ల అయితే భవిష్యత్తులో వంధ్యత్వం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. విచక్షణారహితమైన ప్లాస్టిక్ వాడకానికి ఎంత ఎక్కువ దూరంగా ఉండాలో ఇది చెబుతోంది.
ప్లాస్టిక్ పుట్టిన దగ్గరనుంచీ 2000 వరకూ ప్రపంచంలో ఎంత ప్లాస్టిక్ తయారయిందో ఆ సంవత్సరం తర్వాత ఇప్పటివరకూ అంత ప్లాస్టిక్ తయారయింది. ప్రపంచంలో తయారయ్యే ప్లాస్టిక్‌లో మూడవ వంతు ప్రకృతిలోకి వెళ్లి దానిని కలుషితం చేస్తున్నది. ఒకఅంచనా ప్రకారం ప్రతం ఏటా 80 లక్షల టన్నులకు పైగా ప్లాస్టిక్ సముద్రాలలో కలుస్తొంది. ఇది సముద్రంలోని జలచరాలకు ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ఆ జలచరాలను ఆహారంగా తీసుకునే మనిషికి కూడా ఇది ప్రమాదానికి దారితీస్తోంది.