‘పవనే జవాబు ఇస్తారట’

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యక్తిగత విమర్శలకు జనసేన పార్టీ నాయకులు గానీ జనసైనికులు గానీ స్పందించవద్దని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన చేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని భావిస్తున్నామని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మనోహర్ అన్నారు.  ప్రజా సంక్షేమం కోసం ఈ విమర్శలను భరిద్ధామని పవన్ కళ్యాణ్ చెప్పారని పేర్కొన్నారు.

పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం  విజయవాడలో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో సిఎం జగన్ విమర్శలకు బదులు ఇస్తారనీ, పార్టీ శ్రేణులు అందరూ సంయమనం పాటించాలనీ మనోహర్ కోరారు.

పవన్ కళ్యాణ్‌కు ముగ్గురు భార్యలు, నలుగురో అయిదుగురో పిల్లలు ఉన్నారు, వారు ఏ మీడియంలో చదువుతున్నారు అంటూ సిఎం జగన్ వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ ఈ పత్రికా ప్రకటన విడుదల చేశారు.