సమ్మె చట్టవిరుద్దమంటే కుదరదు: హైకోర్టు

హైదరాబాద్:ప్రజాప్రయోజనాల పేరిట సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించలేమని హైకోర్టు పేర్కొన్నది.కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని, ఆర్‌టిసి యాజమాన్యాన్ని అనేక సార్లు తాము కోరామని హైకోర్టు గుర్తుచేసింది. తమకూ కొన్ని పరిమితులు ఉంటాయనీ, ఇలాగే చేయాలనీ ఆదేశించలేమని హైకోర్టు పేర్కొన్నది.

ఆర్‌టిసి సమ్మె వ్యవహారంపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. కార్మికుల సమ్మె చట్టవిరుద్దమని ప్రభుత్వం మరో సారి హైకోర్టుకు తెలియజేసింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నివేదికను ఉన్నత న్యాయస్థానానికి అందజేసింది. రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గ తీర్మానాన్ని ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది.

న్యాయస్థానం సూచన మేరకు 47 కోట్ల రూపాయలు చెల్లించినప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాబోవని ప్రభుత్వం తెలిపింది. హైకోర్టు సూచనపై నాలుగు డిమాండ్ల పరిష్కారానికి అధ్యయనం చేయగా 2,209 కోట్ల రూపాయల వరకూ తప్పనిసరి చెల్లింపులు, రుణాలు, నష్టాలు ఉన్నాయనీ, ఈ 47 కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోవనీ ప్రభుత్వం నివేదికలో వివరించింది.

విలీనంపై కార్మికులు మొండిపట్టుతో వ్యవహరిస్తే చర్యలు సాధ్యం కావని హైకోర్టుకు అందజేసిన నివేదికలో పేర్కొన్నది.

ఎస్మా చట్టం ప్రకారం ఆర్‌టిసి సమ్మె చట్టవిరుద్దమని పిటిషనర్ తరపు న్యాయవాది కృష్ణయ్య హైకోర్టుకు తెలిపారు. ఉన్నత న్యాయస్థానం స్పందిస్తూ ఎస్మా చట్టం ప్రకారం ఆర్‌టిసిని తప్పనిసరి సర్వీసుగా పేర్కొంటూ జారీ చేసిన జివో చూపాలని ఆదేశించింది. ఆర్‌టిసిని ప్రజా ప్రయోజన సేవ (పబ్లిక్ యుటిలిటీ సర్వీస్)గా ప్రకటించినందున ఎస్మా పరిధిలోకి వస్తుందని కృష్ణయ్య వాదించగా ప్రజా ప్రయోజన సేవలన్నీ అత్యవసర సర్వీసులు కావని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్‌టిసిని ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం జివో ఇస్తేనే అత్యవసర సర్వీసుగా ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణను రేపటికి వాయిదా వేసింది.