ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ & ఆడియో రిలీజ్

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మహానాయకుడు ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్, ఆడియోలు డిసెంబర్ 21న శుక్రవారం విడుదలయ్యాయి.  నందమూరి బాలకృష్ణ ఇందులో  ఎన్టీఆర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ‘ఆ రామారావు ఏంటి? కృష్ణుడేంటి?.. మార్చండి’ అని ఒకరెవరో అంటుంటే  ‘రామారావు చక్కగా సరిపోతారండీ. ఆయన కళ్లల్లో ఓ కొంటెతనం ఉంటుంది’ అని మరొకరు సమాధానం చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలవుతుంది.

‘నేను ఉద్యోగం మానేశా.. నచ్చలేదు.. సినిమాల్లోకి వెళ్తాను..’ అన్న డైలాగ్ తర్వాత ఎన్టీఆర్ రైల్లో మద్రాసు వెళ్లడాన్ని చూపించారు. ‘నిన్ను చూడ్డానికి జనాలు టికెట్టు కొని థియేటర్‌కు వస్తున్నారు. ఇలా నువ్వే వెళ్లి, కనిపిస్తే నీ సినిమాలు ఎవరు చూస్తారు’ అన్న ప్రశ్నకు. ‘జనం కోసమే సినిమా అనుకున్నాను. ఆ జనానికే అడ్డమైతే సినిమా కూడా వద్దు అంటాను’ అని ఎన్టీఆర్ ఎమోషనల్‌గా అనే సీన్‌ను ట్రైలర్‌లో చేర్చారు. ‘60 ఏళ్లు వస్తున్నాయి.. ఇన్నాళ్లూ మా కోసం బతికాం… ఇక ప్రజల కోసం, ప్రజాసేవలో బతకాలి అనుకుంటున్నాం’ అన్న మాటలతో ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశాన్ని సూచించారు.   ‘నిన్ను అందరూ ఇక్కడ దేవుడు అంటున్నారు. అక్కడ నువ్వు కూడా అందరిలాంటి మనిషివి అయిపోతావు బావా’ అని సతీమణి బసవ తారకం అంటే.. ‘తారకం నన్ను దేవుడ్ని చేసిన మనుషుల కోసం నేను మళ్లీ మనిషిని కావడానికి సిద్ధంగా ఉన్నా’ అని ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య ఉద్వేగంగా డైలాగ్ చెబుతారు. ఈ సీన్ ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి అద్దంపడుతుంది.

ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకంగా విద్యా బాలన్‌, హరికృష్ణగా కల్యాణ్‌రామ్, నారా చంద్రబాబు నాయుడుగా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌,  శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, జయప్రదగా హన్సిక, జయసుధగా పాయల్‌ రాజ్‌పుత్‌, సావిత్రిగా నిత్యా మేనన్‌, ప్రభగా శ్రియ నటించారు. రెండు భాగాలుగా నిర్మించిన ఈ బయోపిక్ మొదటి భాగాన్ని 2019 జనవరి 9న, రెండో భాగాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు.