స్పష్టం చేసిన ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ మధ్య ఒక కొత్త పదం కనిపెట్టారు. దానికి నిఘంటువులో కూడా అర్థం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. దాని పేరు ‘మోదీలై’. ప్రధానమంత్రి నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకుని, ఆయన తరచు వాస్తవాలను వక్రీకరిస్తారని విమర్శించేందుకు ఈ పదాన్ని ఆయన వాడుకున్నారు. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ వెబ్ సైట్ స్క్రీన్ షాటును ఫొటోషాప్ ద్వారా మార్చి, అందులో మోదీలై అనే పదాన్ని రాహుల్ బృందం ఇరికించింది. ఇంగ్లీషు డిక్షనరీలో కొత్త పదం వచ్చిందంటూ ఆయన ట్వీట్ చేశారు. దానికి స్వయంగా ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ స్పందించి ట్విట్టర్ ద్వారానే సమాధానం ఇచ్చింది. రాహుల్ గాంధీ షేర్ చేసిన బొమ్మ ‘ఫేక్’ అని, అలాంటి పదం అసలు లేనే లేదని తెలిపింది.
There’s a new word in the English Dictionary. Attached is a snapshot of the entry 🙂 pic.twitter.com/xdBdEUL48r
— Rahul Gandhi (@RahulGandhi) May 15, 2019
We can confirm that the image showing the entry ‘Modilie’ is fake and does not exist in any of our Oxford Dictionaries.
— Oxford Languages (@OxLanguages) May 16, 2019
రాహుల్ గాంధీ తన ట్వీట్ లో ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ పేరును ఎక్కడా ప్రస్తావించకపోయినా, ఆయన షేర్ చేసిన స్క్రీన్ షాట్ మాత్రం అచ్చం ఆ డిక్షనరీ వెబ్ సైటునే పోలి ఉంది. దాంతోపాటు ఆ వెబ్ సైటులో కాంగ్రెస్ పార్టీ ప్రకటన కూడా ఉన్నట్లుగా అందులో చూపించారు. ‘మోదీలై’ అనే పదానికి ‘తరచు వాస్తవాలను వక్రీకరించడం’ అనే అర్థం ఉన్నట్లుగా రాహుల్ షేర్ చేసిన స్క్రీన్ షాటులో తెలిపారు. అదే పదానికి అదే డిక్షనరీలో మరో అర్థం ఉందని, అది.. ‘తరచు, అప్పటికప్పుడే అబద్ధాలు ఆడటం’ అని కూడా ఫొటోషాప్ లో మార్చి పెట్టారు. దానికే ఇంకో అర్థం ‘నిర్విరామంగా అబద్ధాలు ఆడటం’ అనీ అన్నారు. మోదీలై అనేది ఒక ‘మాస్ నౌన్’ అని, అంటే ఏదైనా లెక్కించలేనిదని, అలాగే సాధారణ వాడకంలో బహువచనం లేనిదని కూడా అర్థం వస్తుందన్నట్లు తెలిపారు. తన ప్రచారం కోసం ఇలా లేని పదాలను ఉన్నట్లుగా సృష్టించిన రాహుల్ గాంధీ, ఆ తర్వాత ‘మోదీలై’ అనే పేరుతో వెబ్ సైట్ కూడా ఉందని, అందులో అత్యుత్తమ అబద్ధాలేవో కేటలాగింగ్ చేస్తారని అన్నారు.
‘Modilie’ is a new word that’s become popular worldwide. Now there’s even a website that catalogues the best Modilies! https://t.co/Ct04DlRsj3
— Rahul Gandhi (@RahulGandhi) May 16, 2019
‘మోదీ లై’ అనే కొత్త పదం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని ఆయన ట్వీట్ చేశారు. వెంటనే బీజేపీ మద్దతుదారులు రాహుల్ గాంధీ మీద విరుచుకుపడ్డారు. బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవీయ ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ వాళ్ల ట్వీట్ ను రీట్వీట్ చేసి రాహుల్ చేసిన తప్పును ఎత్తిచూపారు.
Slapped. https://t.co/tGMMa09ydf
— Amit Malviya (@amitmalviya) May 16, 2019
2017 సంవత్సరంలో కూడా రాహుల్ గాంధీ ఇలాగే చేశారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇంటిపేరును మార్చి.. ‘జైట్ లై’ అని అన్నారు. జైట్లీ పేరును కావాలనే ఆయన అలా మార్చారని అప్పట్లో బీజేపీ ఆరోపించింది.