(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తాత్కాలిక డ్రైవర్ల చేతుల్లో ఆర్టీసీ బస్సులు పట్టు తప్పుతున్నాయి. వారి అజాగ్రతతో అదుపు కోల్పోయి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా సినీ నటుడు సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న కారును ఓ ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సంపూర్ణేష్ బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. సిద్దిపేట పట్టణంలో కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
సంపూర్ణేష్ బాబు తన భార్య, పిల్లలతో కారులో ప్రయాణిస్తుండగా.. ఆర్టీసీ బస్సు ఆయన కారుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంపూతో పాటు ఆయన భార్య, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలికి వచ్చి సంపూర్ణేష్ బాబుకు సాయం అందించారు. అనంతరం స్థానికులు సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సంపూతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును తాత్కాలిక డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
‘హృదయ కాలేయం’ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన సంపూ బర్నంగ్ స్టార్ గా విపరీతమైన ప్రచారం వచ్చినవిషయం తెలిసిందే.
ఇదిఇలా ఉంటే.. ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులో నడిపిస్తుంది. అయితే, అనుభవం లేని తాత్కాలిక డ్రైవర్లు విధుల్లోకి తీసుకోవడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే తాత్కాలిక డ్రైవర్లు నిర్లక్ష్య డ్రైవింగ్ తో ఎంతో మంది ప్రాణాలను బలిగొన్నారు. నిర్లక్ష్యంగా బస్సులు నడుపుతూ అటు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడంతోపాటు వేరే వాహనంపై వెళ్తున్న ప్రజలకు కూడా ప్రాణ రక్షణ కరువయ్యేలా డ్రైవింగ్ చేస్తున్నారు.