వాషింగ్టన్: అమెరికాలో తమ పిల్లలకు జన్మనివ్వడం వల్ల ఆ దేశం పౌరసత్వం వస్తుందనే ఆశతో అక్కడికి వచ్చే మహిళల వీసాలపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇకపై ప్రసవం కోసం అమెరికాకు వచ్చే గర్భణీ మహిళలను ఇతర విదేశీయులుగానే పరిగణించనుంది. ఈ నిబంధనలు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నాయి.
గర్భణీగా ఉన్న ప్రతి ఒక్కర్నీ అమెరికా అడ్డుకోదు. ప్రెగ్నెన్సీతో అమెరికా వచ్చి… అక్కడ ప్రసవం చేయించుకునే అవకాశాలు ఉన్నాయి అని భావించే మహిళల వీసాల్ని మాత్రమే అధికారులు ఆపేస్తారని సమాచారం. ఇందుకోసం వీసాకు దరఖాస్తు చేసుకున్నప్పుడే ఈ వివరాల్ని తెలుసుకుంటారు. అమెరికాలోనే తమ డెలివరీ చేయించుకోవాలని చాలా మంది మహిళలు తాత్కాలిక టూరిస్ట్ వీసాలతో ఆ దేశానికి వెళ్తున్నారు. కొంత మంది మెడికల్ వీసాలపై వెళ్తున్నారు. అమెరికా దాని పక్కనే ఉండే కెనడాకు ఇలా బర్త్ టూరిజం కింద చాలా మంది వెళ్తున్నారు. అమెరికాలో పుట్టే వారికి అక్కడి పౌరసత్వంతోపాటూ… ప్రభుత్వం కల్పించే సదుపాయాలు, వెసులుబాట్లూ, ఇన్సూరెన్సులూ ఇలా ఎన్నో ప్రయోజనాలు లభిస్తున్నాయి. అంతేకాదు, అక్కడ పుట్టే పిల్లల తల్లిదండ్రులు ఏ దేశం వారైనా… పిల్లలు మాత్రం అమెరికాలో ఉద్యోగాలు, శాశ్వత నివాసం అన్నీ పొందగలుగుతున్నారు. ఇది తమ దేశానికి భారంగా ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఈ బర్త్ టూరిజంను అడ్డుకోకపోతే… తమకే నష్టమని భావించిన ట్రంప్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రసవాల కోసం అమెరికా వెళ్లడం చట్టబద్ధమే అయినా బర్త్ టూరిజం ఏజెన్సీల వీసా మోసాలు, పన్ను ఎగవేత కేసులు విరివిగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు. వలసలపై అన్ని రకాలుగా ఆంక్షలు విధిస్తున్నప్పటికీ అమెరికాలో పుట్టే ప్రతి బిడ్డను ఆ దేశం బిడ్డగానే పరిగణించాలన్న రాజ్యాంగ నిబంధన ట్రంప్ సర్కారుకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఈ ఇబ్బందులను అరికట్టేందుకే కొత్త వీసా విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు.