NewsOrbit
టాప్ స్టోరీస్ మీడియా

మోదీ..మీడియా…ఓ మాయ!

నిన్న రాత్రి టెలివిజన్ ఆన్ చేసి ఛానళ్లు మారుస్తుంటే ఈటివి సినిమాలో ‘కన్యాశుల్కం’ కనబడింది. సినిమా అప్పటికే అయిపోవచ్చింది. గురజాడ వారి మీద ప్రేమతో మిగిలిన కాస్తా చూసిన తర్వాతనే న్యూస్ ఛానళ్ల జోలికి వెళ్లాను. ఇండియా టుడేలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని రాహుల్ కన్వల్ ఇంటర్వూ చేస్తూ కనబడ్డాడు.

ఇంటర్వ్యూ హిందీలో సాగుతోంది. వారణాసిలో నామినేషన్ వేసిన తర్వాత మోదీ ఇస్తున్న ఇంటర్వ్యూ అది. కాశీలో గంగానది ఒడ్డున ఒక ఘాట్‌లో ఇద్దరూ ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. కాస్సేపటి తర్వాత లేచి మాటల మధ్యే  నడుచుకుంటూ ఒడ్డుకు వచ్చారు. అక్కడ ఒక 5స్టార్ బోటు సిద్ధంగా ఉంది. వారు ఎక్కిన తర్వాత బోటు గంగానదిలో షికారు ప్రారంభించింది. బోటులో ఆజ్‌తక్ హిందీ ఛానల్ యాంకర్ అంజనా ఓం కాశ్యప్ ప్రధానితో ఇంటర్వ్యూ కొనసాగించింది.

కాస్సేపటి తర్వాత ఇద్దరూ లేచి బోట్ రెండవ అంతస్థుకు వెళ్లారు. అక్కడ వారికి రాహుల్ కన్వల్‌తో పాటు ఆజ్‌తక్ ఇంకొక యాంకర్ శ్వేతా సింగ్ జత కలిశారు. నలుగురూ కలిసి పిచ్చాపాటీగా మాట్లాడుకున్నారు. ఇక్కడ మాత్రం మోదీ వ్యక్తిగత జీవితంపైనే ప్రశ్నలు ఎక్కువ భాగం నడిచాయి.

లైవ్ ప్రోగ్రాం కాదు కాబట్టి మధ్యమధ్యలో డ్రోన్ షాట్లు, రెండు పక్కలా ఒడ్డుపై నుంచి తీసిన షాట్లు, పక్కనే ప్రయాణిస్తున్న బోట్లపై నుంచి తీసిన షాట్లు కలిపి మొత్తం చాలా లైవ్లీగా రూపొందించారు. ప్రాచీన నగరం కాశీ మధ్యలోనుంచి పయనించే గంగానది, ప్రఖ్యాతి పొందిన ఘాట్లు, మోదీ ఇంటర్వ్యూ సాగుతున్న కారణంగా అక్కడ పోగయిన ప్రజల పలకరింపులూ, ఒడ్డున విస్తరించిన నగరం లాంగ్ షాట్లతో ఇండియా టుడే ప్రొడక్షన్ ఏ బాలీవుడ్ సినిమాకూ తీసిపోని రీతిలో సాగింది.

Photo courtesy: India Today

ఇంటర్వ్యూ సాగినంత సేపూ టాప్ బ్యాండ్‌లో  ‘అన్ ఫర్‌గెటబుల్ ఇంటర్వ్యూ’, ‘నొ హోల్డ్స్ బార్‌డ్ ఇంటర్వ్యూ’, ‘100% అన్‌అడల్టరేటెడ్ నమో’, ‘గ్రౌండ్ జీరో ఇంటర్వ్యూ’ అనే వర్ణనలు నడుస్తూనే ఉన్నాయి. ఇక నరేంద్ర మోదీ మాటకారితనం చూసిన తర్వాత కొద్దిసేపు ముందు చూసిన కన్యాశుల్కంలో గిరీశం గుర్తుకువచ్చాడు. అందులో గిరీశాన్ని ఉద్దేశించి సౌజన్యారావు పంతులు ‘ఔరా ఆషాడభూతీ నన్ను కూడా ఏమార్చావే’ అంటాడు.

నిజానికి తిమ్మిని బమ్మి చేయగల మోదీ మాటకారితనం గురించి కొత్తగా తెలుసుకునేదేమీ లేదు. కొద్ది రోజుల ముందు హిందీ నటుడు అక్షయ కుమార్‌కు రాజకీయాలతో సంబంధం లేకుండా ఇంటర్వ్యూ ఇచ్చిన మోదీ ఆతర్వాత రాజకీయ అంశాలపై ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ ఇది. మోదీ అయిదేళ్ల పాలనకు సంబంధించి ఇండియా టుడే ఆయనకు ఎలాంటి ప్రశ్నలు సంధించిందన్న కుతూహలం సహజంగానే ఉంటుంది.

జాతీయ ఛానళ్లుగా చెప్పుకునే అప్ కంట్రీ ఛానళ్లతో కాస్త పరిచయం ఉన్నవారికెవరికైనా ప్రధానమంత్రి అంతటి వాడు ఇంటర్వ్యూ ఇస్తే ఇండియా టుడే గ్రూప్ ఎడిటర్ రాజదీప్ సర్దేశాయ్ కదా వెళ్లాల్సింది అన్న అనుమానం రాకమానదు. ఇంటర్వ్యూ పూర్తిగా చూసిన తర్వాత రాజ్‌దీప్ సర్దేశాయ్ ఎందుకు వెళ్లలేదో అర్ధమైపోతుంది.

ముగ్గురు యాంకర్లూ కలిసి నరేంద్ర మోదీ తాను ఏంచెప్పాలనుకుంటున్నారో అది చెప్పేందుకు చక్కటి వెసులుబాటు కల్పించారు. గత అయిదేళ్ల పాలన మంచీచెడులకు  సంబంధించి జవాబులు చెప్పాల్సిన ఏ ప్రశ్నలనుండి అయితే మోదీ తప్పించుకుంటున్నారో ఆ ప్రశ్నలనే అడిగినట్లు ఉండాలి. మోదీ ఆ ప్రశ్నలకు  జవాబులు చెప్పినట్లూ ఉండాలి. కానీ మోదీ ఎక్కడా ఇబ్బందికి గురి కాకూడదు. ఇండియా చాలా కీలకమైన ఎన్నికలను ఎదుర్కొంటున్న వేళ ఇండియా టుడే దేశానికి చేసిన సర్వీసు అదీ.

నిజానికి ఇప్పటివరకూ నరేంద్ర మోదీ ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా ఇదే తంతు. ఇప్పుడు ఇండియా టుడే వంతు వచ్చింది. గత అయిదేళ్లుగా ప్రధాని మోదీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటే ఇలాంటి ఇంటర్వ్యూలకు ఎంత ప్రాధాన్యత ఉందీ మనకు అర్ధం అవుతుంది. ఆ ఇంటర్వ్యూ చేసే జర్నలిస్టుకు ఎంత సామాజిక బాధ్యత ఉందీ అర్ధం అవుతుంది. ఎంత కాదన్నా రాజ్‌దీప్ సర్దేశాయి కాస్త పరువు ఉన్న జర్నలిస్టు కదా! గుర్తుందా మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఆయన అమెరికా పర్యటన సందర్భంగా మోదీ మద్దతుదారులు న్యూయార్క్ వీధుల్లో రాజ్‌దీప్‌పై దాడి చేసిన సంగతి? అలాంటి రాజ్‌దీప్ నాయకత్వంలో ఇలాంటి ఇంటర్వ్యూ! అందుకు ఆయన సిగ్గుపడక తప్పదు. అలాంటిది ఆ ముగ్గురు యాంకర్ల బదులు తానే స్వయంగా మోదీతో ఆ మాటలన్నీ చెప్పించాల్సివస్తే! తర్వాత తన లైవ్ షోలో కాస్త పరువు నిలుపుకునేందుకు రాజ్‌దీప్ ప్రయత్నించారనుకోండి.

Photo courtesy: India Today

మోదీని ఇండియా టుడే గ్రూప్ యాంకర్లు ఏం అడిగిందీ, అందుకు ఆయన ఏం జవాబులు ఇచ్చిందీ చూస్తే విషయం అర్ధం అయిపోతుంది. మొత్తం ఇంటర్వ్యూ అంతా కాదు కానీ కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ప్రస్తావిస్తాను. అది నిజమైన ఇంటర్వ్యూనే అయితే ఆయా  ప్రశ్నలకు మోదీ జవాబు ఇచ్చిన వెంటనే తిరిగి కొన్ని ప్రశ్నలు సంధించాలి. జర్నలిజంలో తప్పటడుగులు వేస్తున్న వారికి కూడా తట్టాల్సిన ప్రశ్నలు. కానీ ఇండియా టుడే యాంకర్లకు మాత్రం ఆ ప్రశ్నలు తట్టలేదు.

అంశం: ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలం అయిందన్న ప్రతిపక్షాల ఆరోపణ.

జవాబు: ఆ ఆరోపణను గణాంకాలు బలపరడచడం లేదు.

రావాల్సిన ప్రశ్నలు: గత 45 ఏళ్లలో ఏనాడూ లేనంత స్థాయికి నిరుద్యోగం చేరిందని అధికారిక నేషనల్ శాపుల్ సర్వే లెక్కలే తేల్చాయి కదా? మీ ప్రభుత్వం ఈ నివేదికను తొక్కి పెట్టింది కదా?

2018లో కోటీ 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని సిఎమ్‌ఐఇ నివేదిక కూడా చెప్పిందిగా?

అంశం: ఒకపక్క టెరరిజంపై పోరు అంటూనే సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ను పోటీలో దించడం.

జవాబు: ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవు.

రావాల్సిన ప్రశ్న: మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద మాత్రమే సాధ్వి ప్రజ్ఞపై అభియోగాలు రద్దు చేశారు. ప్రాధమిక ఆధారాలు ఉండబట్టే కదా చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఆమెను ప్రాసిక్యూట్ చేస్తున్నది?

అంశం: పెద్ద నోట్ల రద్దు.

జవాబు: పెద్ద నోట్ల రద్దు నల్ల ధనంపై దాడి. లక్షా 30 వేల కోట్ల రూపాయల నల్లధనం బయటపడింది.

రావాల్సిన ప్రశ్న: మరి 99.3 శాతం కరెన్సీ బ్యాంకులకు తిరిగివచ్చిందని రిజర్వ్ బ్యాంక్ స్వయంగా చెప్పింది కదా? ఈ లక్షా 30 వేల కోట్ల రూపాయల లెఖ్క ఏమిటి?

అంశం: మహాఘటబంధన్ రాజకీయాలు.

జవాబు: వారివి అవకాశవాద రాజకీయాలు. బిజెపి అలా కాదు.

రావాల్సిన ప్రశ్న: ప్రతి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండే రామ్ విలాస్ పాశ్వాన్ ఇప్పడు మీతోనే ఉన్నారుగా? నితిశ్ మళ్లీ బిజెపిని వదలరని నమ్మకం ఉందా?

అంశం: ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు ఇడి, ఐటి వంటి సంస్థలతో దాడులు చేయిస్తున్నారన్న ఆరోపణలు.

జవాబు: మోదీ తప్పు చేస్తే ఆయన ఇంటిపై కూడా దాడులు జరిగేంతవరకూ వత్తిడి తీసుకురాండి. ప్రజాధనాన్ని దోచుకుంటుంటే చూస్తూ కూర్చోలేం కదా!

రావాల్సిన ప్రశ్న: ఒక్క బిజెపి నాయకుడి ఇంటిపై కూడా దాడులు జరగకపోవడం చిత్రంగా లేదూ?

జవాబు: ప్రతిపక్షాలు గెలిచినపుడు ఇవిఎంలు మంచివే. ఓడిపోతున్నపుడే ఇవిఎంలపై ఫిర్యాదులు వస్తాయి.

రావాల్సిన ప్రశ్న: ఇవిఎంలను బిజెపి కూడా తప్పు పట్టిన సందర్భాలు ఉన్నాయిగా?

అంశం: జమ్ము కశ్మీర్.

జవాబు: వాజ్‌పేయీ చెప్పిన ఇన్సానియత్, కశ్మీరియత్, జంహూరియత్  ఫార్మూలానే శిరోధార్యం.

రావాల్సిన ప్రశ్న: మీ ప్రభుత్వ హయాంలో కశ్మీర్ లోయ పూర్తిగా దూరమైంది కదా! ఇప్పటివరకూ మీరు అనుసరించిన పాలసీ విఫలం అయిందని ఒప్పుకుంటారా?

మోదీ ఒక సందర్భంలో ఆ మధ్య ఎల్.కె అద్వానీ తన బ్లాగ్‌లో రాసిన మాటలు ప్రస్తావించారు. ఎవరినైనా గానీ శత్రువుగా భావించడం బిజెపి స్వభావం కాదని ఆయన రాశారు. దానిని మోదీ తనకు అనుకూలంగా మలచుకున్నారు.

రావాల్సిన ప్రశ్న. అది మిమ్మలను ఉద్దేశించి రాశారని అందరూ అనుకుంటున్నారే.

ఇండియా టుడే టీమ్ మైనారిటీల గురించి మోదీని దీర్ఘంగా మాట్లాడనిచ్చారు. గోసంరక్షణ పేరుతో వారిపై జరిగిన దాడుల గురించి ప్రశ్నించలేదు. మోదీ మౌనంగా ఉండడాన్ని ప్రశ్నించలేదు.

తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా తనపై రకరకాల అబియాగాలు మోపి దుష్ప్రచారం చేశారంటూ మోదీ సుదీర్ఘంగా మాట్లాడారు. ఒక్క ఎదురు ప్రశ్న లేదు.

ఇటీవలి అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల తర్వాత ఏర్పడిన ప్రతిపక్ష ప్రభుత్వాలు ఆరు నెలల్లోనే ప్రజాధనం దోచేశాయనీ, ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నది ఆ డబ్బేననీ మోదీ ఆరోపించారు.

ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయకుండానే బిజెపి గెలుస్తుందా అన్న ప్రశ్న ఆయనకు ఎదురు కాలేదు.

ఇదంతా చూసిన తర్వాత సగటు పౌరుడు ఎవరన్నా మీడియా ఎవరికి జవాబుదారు, ప్రజలకా నరేంద్ర మోదీకా అని ప్రశ్నిస్తే అందుకు బాధ్యత వహించాల్సింది ఎవరు?

కొసమెరుపు: ఇంటర్వ్యూ పూర్తి అయిన తర్వాత, మోదీ యాంకర్లను ఉద్దేశించి ‘మీరు ఇంత కష్టపడ్డారు సరేగానీ, రేపు సోషల్ మీడియాలో మీమీద ఎన్ని రాతలు వస్తాయో చూడండి’ అన్నారు. తన ఇంటర్వ్యూలో డొల్లతనాన్ని ప్రజలు కొందరైనా గుర్తిస్తారని ఆయనకు అర్ధమైపోయింది.

-ఆలపాటి సురేశ్ కుమార్

 

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Bigg Boss 7: రతిక రోజ్ గుండెలో ఇంత భారాన్ని మోస్తుందా? ఆ కారణం వల్లే రాహుల్‌తో బ్రేకప్ అయ్యిందా? నిజాలు బయటపెట్టిన పెద్దయ్య!

Raamanjaneya

MS Dhoni: డోనాల్డ్ ట్రంప్ తో ధోని గోల్ఫ్…

Deepak Rajula

ABN Andhra Jyothi: ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థను కేసిఆర్ సర్కార్ వెలి వేసినట్లేనా..!

sharma somaraju

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Leave a Comment