NewsOrbit
వ్యాఖ్య

2019 – అంతానికి ఆరంభం!

ఈ రోజు డిసెంబర్ ఒకటో తేదీ. ఇవేళ్టితో 2019 సంవత్సరం అంతానికి తెరతీయడం మొదలవుతుంది. ఈ నెల పొడుగునా ఇంగ్లీష్ పత్రికలు “ఇయర్ ఎండర్స్” ప్రచురించడం ఓ ఆనవాయితీ. అదృష్టవశాత్తూ మనకి ఆ ఆచారం లేదు. లేనట్లయితే, ఈ పాటికి మన ప్రసార మాధ్యమాలు ఊదరగొట్టేయడం మొదలైపోయేది.
ఈ ఏడాది పొడుగునా, మహా ఘనత వహించిన మన ప్రధాన మంత్రి ఎన్నెన్ని దేశాలు తిరిగి వచ్చారో, ఎన్నెన్ని వందల కోట్ల డాలర్ల విదేశీ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని వచ్చారో ఏకరువు పెట్టి మన ప్రాణాలు తోడేసి ఉండేవారు.
హోమ్ మంత్రి చాణక్య నీతి ప్రదర్శించి ఎందరు విద్యార్థుల మీద  “రాజద్రోహం” కేసులు పెట్టించారో చాటిచెప్పి, మనల్ని చావగొట్టడం మొదలైపోయి ఉండేది!
ఇక, దేశంలో బుద్ధి మాంద్యం ఉంటే ఉందేమో కానీ, ఆర్థిక మాంద్యం మాత్రం కలికానికి కూడా లేదనీ- ఆర్థిక రంగం వాయువేగ మనోవేగాల మీద పురోభివృద్ధి సాధిస్తోందని మన తెలుగింటి కోడలమ్మ -అదేనండీ, శ్రీమతి నిర్మలా సీతారామన్- చేసే  గర్జనలతో గుండెలు బేజారైపోతూ ఉండేవి.
అయినా మనకి ఉన్న ఆచారాలతోనే పళ్ళేక చస్తూ ఉంటే లేనివాటి గురించి తల్చుకుని కుంగి పోవడం ఎందుకు చెప్పండి? కాకపోతే, ఈ “ఇయర్ ఎండర్స్” గురించి ఓ చిత్రమైన విషయం చెప్పనా?
ఈ ఏడాది కాలంలో ఎందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారో మన “ఇయర్ ఎండర్స్”లో ఎవరూ ఎప్పుడూ ప్రస్తావించరు!
ఈ ఏడాది కాలంలో బలవంతపు బ్రాహ్మణార్థం లాంటి “చై.నా” విద్యావిధానం పుణ్యమా అని ఎన్ని పసిమొగ్గలు రాలిపోయాయో “ఇయర్ ఎండర్స్” లో ఎవరూ ఎప్పుడూ చెప్పరు!
ఈ ఏడాది కాలంలో, ఎందరు ఆడపడుచులు అత్తింటి ఆరళ్లకు బలైపోయారో “ఇయర్ ఎండర్స్”లో ఎవరూ ఎప్పుడూ చెప్పరు!
ఈ ఏడాది కాలంలో, ఎందరు పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వ ఆర్ధిక సంస్థలకూ, బ్యాంకులకూ కుచ్చుల టోపీలు పెట్టి రెక్కలు విప్పి తుర్రుమన్నారో “ఇయర్ ఎండర్స్” లో ఎవరూ ఎప్పుడూ చెప్పరు!
ఈ ఏడాది కాలంలో, ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయో, ఎన్ని లక్షలమంది కూలిజనం పూటకూటికి కూడా నోచుకోకుండా పోయారో “ఇయర్ ఎండర్స్” లో ఎవరూ ఎప్పుడూ చెప్పరు!
ఈ ఏడాది కాలంలో, ఎన్ని విశ్వవిద్యాలయాల్లో హాస్టళ్లు మూతపడ్డాయో, ఎన్ని లక్షలమంది పేద విద్యార్థులు ముద్దకు దూరమైపోయారో “ఇయర్ ఎండర్స్” లో ఎవరూ ఎప్పుడూ చెప్పరు!
అంతెందుకు, నిన్నకాక మొన్న, నానా పాట్లూపడి సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికుల్లో ఎందరు వత్తిడికి తట్టుకోలేక- అవమానభారం దిగమింగలేక ఆహుతైపోయారో ఆ లెక్కలేవీ “ఇయర్ ఎండర్స్” లో ఎవరూ ఎప్పుడూ చెప్పరు!
నిజానికి 2019 గురించి అంతగా “ఊదరగొట్టేయ”డానికి ఏముందని అడిగేవాళ్ళు  ఉంటారని నాకు తెలుసు! అడగాలి కూడాను! అలా నిలదీసి అడగడం మర్చిపోయినందువల్లనే మనమిప్పుడు ఇలా ఉన్నామని నా నమ్మకం. అంతమాత్రం చేత ఈ ఏడాది పొడుగునా మనదేశం అలలు లేని కొలనులా ప్రశాంతంగా నిద్రపోతోందని మాత్రం అనడానికి లేదు కదా!
ఏడాదంతా అలా ఉంచండి- గడిచిన నెల రోజులే తీసుకోండి!
గాంధీజీ ప్రమాదవశాత్తూ “మరణించారని” ఒడిశా ప్రభుత్వం ఒక అధికార పత్రంలో ప్రకటించిన సంగతి రచ్చకెక్కింది -నిన్నటితో ముగిసిన- నవంబర్లోనే కదా? ఎనభయ్యో పడిలో పడిన జాతిపిత గాంధీ తాతను నత్తూ రామ్ గోడ్సే  అనే హిందుత్వ  ఉన్మాది బాహాటంగా, బహిరంగంగా హత్యచేసిన సంగతి ఈ దేశంలో చిన్నపిల్లలకు కూడా తెలిసిపోయింది. దాన్ని జనస్మృతి లోంచి చెరిపేసే ప్రయత్నంలో భాగంగానే సదరు “అధికార ప్రచురణ” వెలువడింది. చిత్రం ఏమిటంటే ఈ ప్రచురణ జరిగిన ఒడిశాలో ఉన్నది గోడ్సే అభిమాన సంఘమైన బీజేపీ కాదు- స్వాతంత్య్ర సమరయోధుడు బిజూ పట్నాయక్ పేరిట ఏర్పరిచిన పార్టీ అక్కడ అధికారం లో ఉంది. గుడ్డి దర్బారు వెలిగించే హక్కు కాంగ్రెస్‌కూ బీజేపీకే పరిమితం కాదని దీంతో రుజువైంది. ఏ పార్టీలోకైనా గోడ్సే అభిమానులు చెదపురుగుల్లా తొలుచుకు పోగలరని కూడా మరోసారి రుజువైంది.
కాగా సమ్మె చేసే కార్మికులకు లక్ష నీతులు బోధించే మన న్యాయ కోవిదులెవ్వరూ, ఈ జాతీయ ద్రోహానికి ఫలానా శిక్ష వేసి తీరాలని అనకపోవడం విడ్డూరమే మరి! చిన్నపిల్లలకు  కూడా తెలిసిన విషయం, ఒకానొక రాష్ట్ర ప్రభుత్వ బాధ్యులకు “తెలియకపోవడం” క్షంతవ్యమేనా? నిజానికి ఇది నిజం తెలియక పోవడమా? మరెవ్వరికీ నిజం తెలియనివ్వకుండా చేసే ప్రయత్నమా? మన శిక్షా స్మృతిలో ఈ నేరానికి ఏ శిక్షా నిర్దేశించలేదా?? ఇలాంటి విషయాలేవీ మన “ఇయర్ ఎండర్స్”లో ఎవరూ ఎప్పుడూ చెప్పరు!
“జాతి జాతి నిర్ఘాత పాత సంఘాత హేతువై, కాలకేతువై” నిలిచిన సంఘటన మన పక్కనున్న మహారాష్ట్రలో జరిగింది కూడా  -నిన్నటితో ముగిసిన- నవంబర్లోనే కదా? ఎన్నికల్లో బీజేపీ చేతికి అధికారం అప్పజెప్పడం – ఆ మాటకొస్తే ఏ ఒక్కపార్టీకీ అధికారం అప్పజెప్పడం- తమకు ఇష్టం లేదని మహారాష్ట్ర జనం స్పష్టంగా తీర్పు చెప్పారు. కానీ ప్రజా తీర్పును పక్కన పెట్టి, బేరసారాల రాజకీయాలు సాగించి బీజేపీ తన నిజస్వరూపం బయట పెట్టుకుంది.  రాజ్యాంగబద్ధ వ్యవస్థల పట్ల ఆ పార్టీ అధినాయకులకు ఏ పాటి గౌరవం ఉందో ఈ సంఘటనతో మరోసారి రుజువయింది. పదవీ రాజకీయాల పంకంలో పుట్టిపెరిగిన శరద్ పవర్ తో వైకుంఠపాళీ ఆడబోయి బొక్కబోర్లా పడింది బీజేపీ. చిత్రం చెప్పనా? ఈ వివరాలు కూడా మన జాతీయ ప్రసార మాధ్యమాలు ప్రచురించే “ఇయర్ ఎండర్స్” లో ఎవరూ ఎప్పుడూ చెప్పరు!
ఇక, సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా, గాంధీజీ హంతకుడైన నత్తు రామ్ గోడ్సేని గొప్ప దేశభక్తునిగా అభివర్ణిస్తూ టెర్రర్ కేసులో ముద్దాయిగా ఏళ్ళ తరబడి జైల్లో ఉండివచ్చిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ మాట్లాడింది కూడా  -నిన్నటితో ముగిసిన- నవంబర్లోనే కదా? ఎక్కడో జెఎన్‌యూ క్యాంపస్ లో ఎవరో విద్యార్థులు ఏవో నినాదాలు ఇచ్చారని ఆరోపిస్తూ కన్హయ్యపై రాజద్రోహం కేసు పెట్టిన బిజెపి ప్రభుత్వం తమ పార్టీ టిక్కెట్ పై భోపాల్ నుంచి ఎంపీగా ఎన్నికయిన ప్రజ్ఞా ఠాకూర్ పై మాత్రం మాటవరస “క్రమశిక్షణ” చర్య తీసుకోవడం గురించి ఏ జాతీయ ప్రసార మాధ్యమమైనా తమ “ఇయర్ ఎండర్స్” లో రాస్తాయేమో చూద్దాం!!

 

     -మందలపర్తి కిషోర్ 

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment