NewsOrbit
వ్యాఖ్య

ఒక ఓటు – వంద అర్థాలు!

“ఓటు చాలా విలువైంది సుమా!” అన్నాడట ఓ ప్రవచన చక్రవర్తి మరో సామాన్యుడితో.
“నిజవే బాబయ్యా, కానీ మన దొంగసచ్చినోళ్ళు రెండేలకి  మించి పైసా కూడా ఇదల్చడం లేదు బాబూ!” అన్నాడట సదరు సామాన్యుడు!
ఎన్నికల వేళ, వెలకీ విలువకీ మధ్య సరిహద్దు గీతలు చెరిగిపోవడం సర్వ సామాన్యం. విలువలు చెట్టెక్కిపోగా వెల మాత్రమే రోడ్డెక్కి చిందేయడమూ సాధారణంగా జరిగేదే.
మన దేశంలో ఓట్ల వేడుకలు మొదలై రెండు వారాలు దాటిపోయాయి. ఇప్పటికి మూడు దశల పోలింగు పూర్తయింది కూడా. దేశంలో జరిగిన ఎన్నికల ఫలితాలు బయట పడ్డానికి మరో నెల రోజుల వ్యవధి ఉంది. ఆ లోగా, మరో ఇరవై రోజుల్లో, ఇంకో నాలుగు దశల పోలింగు పూర్తయి, ఎన్నికల్లో ఓ దశ ఓ కొలిక్కి వస్తుంది. ఆ తర్వాత వోట్ల లెక్కింపు పర్వం.
ఈ దశలో మనం ప్రతి ఓటుకు ఉన్నాయని అనుకునే అర్థాలూ పరమార్థాలూ వెతుక్కోవడం లో అర్థం ఉందా అసలు?
ఎందుకు లేదూ?
ఇప్పుడు జరుగుతున్నఎన్నికలు చివరివీ కావు- ఇకమీదట మన దేశంలో ఎన్నికలు జరగవనీ కాదు. అంచేత, ఓటు గురించి మాటాడుకునేందుకు మూడొందల అరవై రోజులు మంచి ముహూర్తాలే మనకి.
“బులెట్ కన్నా బాలట్ బలమైంది” అన్న అబ్రహాం లింకన్, ఓ మతాంధుడి బులెట్ కి బలై పోయిన మాట ఎంత నిజమో, “సామాన్యుల లోలోపల, అసామాన్యమైన శక్తి ఉంది- అదే ఓటు హక్కు! పశుబలాన్ని సైతం తరిమికొట్టగల శక్తి ఓటుకు మాత్రమే ఉం”దని  ప్రపంచ ప్రసిద్ధ కథా రచయిత రోల్డ్ డాల్ అన్నమాట కూడా అంతే నిజం మరి.
ఇంతకీ, లింకన్ పేరూ, రోల్డ్ డాల్ పేరూ విన్నారో లేదో కానీ, కనుమూరి బాపిరాజు తన ఎన్నికల ప్రచారం చాలా వింతగా చేసేవారు. “ఆతడనేక యుద్ధముల నారియు తేరిన వృద్ధమూర్తి…. ” అన్న అభివర్ణనకు అతికినట్లు సరిపోయే వ్యక్తిత్వం బాపిరాజుది. ఆయన ఎన్నో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవజ్ఞులు. చాలాసార్లు విజయం సాధించిన సక్సెస్ స్టోరీ కూడా. అయిదు సార్లు ఎమ్మెల్యే గానూ, రెండు సార్లు ఎంపీ గానూ గెల్చిన చరిత్ర బాపిరాజుకు ఉంది. ఆయన ప్రచారం చేసే తీరు చాలా వింతగానూ, విడ్డురంగానూ ఉండేది. లక్షమంది హాజరైన బహిరంగసభల్లో కూడా బాపిరాజు ఒక్కొక్క ఓటరును ఉద్దేశించే మాటాడేవారు.
“అయ్యా, అమ్మా, నేను చేసుకునే విన్నపం చాలా చిన్నది. మిమ్మల్ని చందాలు అడగను- విరాళాలు కోరను- లేదా నా తరఫున మండుటెండల్లో నిలబడి ప్రచారం చేయమని కూడా నేను అడగను. నా తరఫున మీరు కుటుంబ సభ్యుల్ని కూడా ఓటు అడగొద్దు- ఆ పనేదో నేనూ, మా వాళ్ళూ చేసుకుంటాం- నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒక్కటే! పోలింగు రోజున టయానికి వొచ్చి ఒక్క  ఓటేయండి. ఆ ఒక్క ఓటు నాకు వెయ్యండి!! “
భారతీయ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సారం తెలిసిన వారు కనకనే మన బుగ్గమీసాల రాజావారు అంత చిన్న కోరిక కోరి ఊరుకున్నారు. మన ఎన్నికల్లో అభ్యర్థుల తల రాతల్ని నిర్ణయించేది ఒక్క ఓటే. పోలయిన ఓట్లలో ఎవరికి -మిగతా వారి కన్నా – ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందో వారే గెలిచినట్లు ప్రకటించడమే మన పార్లమెంటరీ ప్రజస్వామ్య సంప్రదాయం. ఆ ఒక్క వోటే తనకి పడెయ్యమని అడగడం ద్వారా బాపిరాజు తన “సారమతి” ఎంతటిదో ప్రదర్శించుకున్నారు.
ఒక్కవోటే కదా అని తీసిపారేయకపోవడం లోనే ఉంది బాపిరాజు సారమతి.
రెండు వేల నాలుగులో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన సంగతి చాలామందికి ఇంకా గుర్తు ఉండే ఉండాలి. అయితే, సంతేమరహళ్లి నియోజకవర్గంలో జరిగిన ఓ వింత సంఘటన ఎందరికి గుర్తుందో మరి! ఎస్సీ లకు రిజర్వ్ చేసిన ఈ నియోజకవర్గం నుంచి జనతా దళ్ (ఎస్) అభ్యర్థిగా ఏ ఆర్ కృష్ణమూర్తి, కాంగ్రెస్ అభ్యర్థిగా ధృవనారాయణ్  పోటీ చేశారు.  పోటీ అక్షరాలా హోరాహోరీగా సాగింది. ఓట్ల లెక్కింపు దశలో సైతం ఏ ఒక్కరికీ స్పష్టమైన ఆధిక్యం దక్కలేదు. చివరికి, కృష్ణమూర్తికి నలభై వేల ఏడొందల యాభై ఒక్క ఓట్లు రాగా, ధృవనారాయణ్ కి నలభై వేల ఏడొందల యాభై రెండు ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడంతో కథ కంచికి వెళ్ళలేదు.
జనతాదళ్ అభ్యర్థి కృష్ణమూర్తి తన డ్రైవరుని ఓటు వెయ్యడానికి వెళ్లనివ్వలేదు. అతగాడి ఓటు యజమానికే పడివుంటే?
చరిత్రలో, అయితే, కానీ అనే మాటలకి స్థానం లేదట! అందుకే, ఒక ఓటు తేడాతో కృష్ణమూర్తి ఓడిపోయినట్లు ప్రకటించింది ఎన్నికల సంఘం!
రెండువేల ఎనిమిదిలో రాజస్థాన్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కూడా, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధినేత సీపీ జోషి విషయంలో ఇలాగే జరిగింది. జోషీజీ సతీమణి ఈ ఎన్నికల్లో  ఓటు వెయ్యనే లేదట పాపం.  ఫలితంగా జోషీజీ, ఒక ఓటు తేడాతో  కళ్యాణ్ సింగ్ చౌహాన్ అనే బీజేపీ అభ్యర్థి చేతిలో పరాజితులు కావలసి వచ్చింది!
రెండు వేల పదిహేను లో జరిగిన మొహాలీ మునిసిపల్ ఎన్నికల్లోనూ, కాంగ్రెస్ అభ్యర్థిని కుల్వీందర్ కౌర్ రంగీ కూడా  ఒక్క ఓటు తేడాతోనే విజయం సాధించారు.
 కాగా, రెండేళ్ల తర్వాత,  రెండు వేల పదిహేడులో జరిగిన బొంబాయి మునిసిపల్ ఎన్నికల్లో మరో వింత జరిగింది- రెండొందల ఇరవై నంబరు వార్డులో శివసేన, బీజేపీ అభ్యర్థులకు ఓట్లు సమానంగా వచ్చాయి. లాటరీ తియ్యగా బీజేపీ అభ్యర్థి అతుల్ షా గెలిచారు!
ఒక్క ఓటుకు ఎంత శక్తి ఉందో తెలుసుకోడానికి ఈ వివరాలు చాలు. కానీ మరొక్క విషయం మనవి చేసుకోనివ్వండి- ఇది కూడా ఓటు విలువను ఎత్తి చూపించే సంఘటనే కానీ, అది సామాన్య ఓటర్ల ఓటు కాదు- సాక్షాత్తు శాసన నిర్మాతల సభలోని ఓటు అది!
పందొమ్మిది వందల తొంబై తొమ్మిదిలో, పన్నెండో లోక్‌సభలో జరిగిన ఈ పరిణామం చరిత్రాత్మకమైనది. అప్పట్లో అటల్ బిహారీ వాజపేయి, పదమూడు నెలలుగా  ప్రధాన మంత్రిగా ఉండేవారు. ఆయన సర్కారు మీద తమకు విశ్వాసం లేదని ప్రతిపక్షం తీర్మానం పెట్టింది. ;దాదాపు సంవత్సరం ముందు సదరు లోక్ సభకి  సభ్యుడిగా ఎన్నికైన గిరిధర్ గమాంగ్ తర్వాత ఒడిశా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తన లోక్ సభ సభ్యత్వానికి ఇంకా రాజీనామా చెయ్యలేదు. అవిశ్వాస తీర్మానం పై వోటింగ్ జరిగే సమయానికి గమాంగ్ సభలోకి వచ్చి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఒకే ఒక్క ఓటు తేడా తో వాజపేయి ప్రభుత్వం కూలిపోయింది!
అంచేత ఒక్క ఓటు కూడా నేతల జాతకాలను తలకిందులు చేయగలదని గుర్తుంచుకోండి!!
– మందలపర్తి కిషోర్

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment